పంజాబ్‌లో ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 75 శాతం మంది కోటీశ్వరులు.. సగం మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్

Published : Mar 15, 2022, 01:02 PM IST
పంజాబ్‌లో ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 75 శాతం మంది కోటీశ్వరులు.. సగం మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్

సారాంశం

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. దేశ రాజకీయాలు అన్నీ ఈ ఎన్నికల ఫలితాల వైపే చూశాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ఆస్తులు, వారు ఎదుర్కొంటున్న క్రిమినల్ కేసులను వెల్లడించే ఏడీఆర్ రిపోర్టు తాజాగా విడుదలైంది. దాని ప్రకారం, కొత్త పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికైన 117 మంది ఎమ్మెల్యేల్లో 75 శాతం మంది కోటీశ్వరులు. అందులో దాదాపు సగం మంది(58) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఆప్ చరిత్ర సృష్టిస్తూ తొలిసారిగా పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇదిలా ఉండగా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్), పంజాబ్ ఎలక్షన్ వాచ్(పీఈడబ్ల్యూ)లు సంచలన నివేదికలు బయటపెట్టాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు కోటీశ్వరులనని ఆ నివేదికలు తెలిపాయి. అలాగే, అసెంబ్లీకి ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్టు వెల్లడించాయి. గత అసెంబ్లీ ఫలితాలతో పోల్చితే.. ఈ సారి నేరపూరిత కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఈ సారి ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయని రిపోర్ట్ వెల్లడించింది. ఒకరిపై మర్డర్ కేసు.. మరో ఇద్దరిపై హత్యా ప్రయత్నం, మరో ముగ్గురిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని పేర్కొంది.

కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన మొత్తం 117 మందిలో 33.33 శాతం మంది ఆస్తుల విలువ రూ. 5 కోట్లను మించి ఉన్నదని, కాగా, రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య ఆస్తులున్నవారు 23.08 శాతం, రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఆస్తులున్నవారు 27.35 శాతం, రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల ఆస్తులున్నవారు 11.97 శాతం, రూ. 10 లక్షలలోపు ఉన్నవారు 4.27 శాతం మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఈ రిపోర్టులు వెల్లడించాయి. 92 మంది ఆప్ ఎమ్మెల్యేల్లో 63 మంది కోటీశ్వరులు అని, 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 17 మంది కోటీశ్వరులేనని, శిరోమణికి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే , ఒక బీఎస్పీ ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేలూ ఈ కేటగిరీలోనే ఉన్నారు. కాగా, గత అసెంబ్లీలో 81 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే ఉండేవారని వివరించారు.

అత్యధిక సంపన్నులైన టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో ఐదుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఆప్ నుంచి ఒకరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మొహలీ ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ 238 కోట్లతో అందరికంటే సంపన్నుడిగా ఉన్నారు. ఆయన తర్వా త రూ. 125 కోట్ల ఆస్తులతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాణా గుర్జిత్ సింగ్, రూ. 95 కోట్ల ఆస్తులతో ఆప్ ఎమ్మెల్యే సునమ్ అమన్ అరోరా ఉన్నారు.

కాగా, తక్కువ ఆస్తులు ఉన్న పది ఎమ్మెల్యేల్లో ఆప్ ఎమ్మెల్యే నరందర్‌పాల్ సింగ్ సావన్(రూ. 18,370), నరిందర్ కౌర్ భరాజ్(రూ. 24,409)లు ఉన్నారు. కాగా, రూ. 3.65 లక్షలతో మూడో స్థానంలో లాభ్ సింగ్ ఉగోకె ఉన్నారు. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఉగోకె బదౌర్ నియోజకవర్గం నుంచి ఓడించాడు.

గత అసెంబ్లీలో కేవలం 16 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా, ఇప్పుడు 58 ఎమ్మెల్యేలపై ఈ కేసులు ఉన్నాయి. అంటే.. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. పార్టీల వారీగా చూసుకుంటే.. నేరపూరిత కేసులు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యేలు 52 మంది, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు శిరోమణి అకాలీ దళ్ ఎమ్మెల్యేలు, ఒక్కరు బీజేపీ నుంచి ఉన్నారని ఏడీఆర్, పీఈడబ్ల్యూ రిపోర్టులు వెల్లడించాయి.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు