
Bengaluru : కర్నాటక రాజధాని బెంగళూరులో 17 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ విద్యార్థి 23వ అంతస్తు నుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన స్నేహితులకు వీడియో సందేశం పంపాడు. అందులో తనకు ఎలాంటి సమస్యలు లేవు అంటూనే.. ఆత్మహత్యే శరణ్యం అని పేర్కొనడం సంచలనంగా మారింది. వివరాల్లోకెళ్తే.. బెంగళూరులో ఆదివారం రాత్రి కోననకుంటెలోని నివాస సముదాయం 23వ అంతస్తు నుంచి ఓ మైనర్ దూకి చనిపోయాడు. అతను దూకడానికి ముందు తన స్నేహితులకు వీడియో సందేశాన్ని పంపాడు. అయితే అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో వెల్లడించలేదు.
23వ అంతస్తు నుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్న సదరు విద్యార్థి సెకండ్ ప్రీ-యూనివర్శిటీ కోర్సు (పీయూసీ) చదువుతున్నాడు. అతనికి ఆరోగ్యం లేదా విద్యాపరమైన సమస్యలు లేవని బాలుడి తండ్రి తమకు తెలియజేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో బాలుడు తన బంధువు ఇంటి బాల్కనీకి వచ్చి దూకినట్లు సమాచారం. అతను దూకినప్పుడు అతని బంధువులు నిద్రలో ఉన్నారు. అయితే, ఆ విద్యార్థి 23వ అంతస్తు నుంచి దూకడంతో సెక్యూరిటీ గార్డులు పెద్ద చప్పుడు విని ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ సదరు విద్యార్థి విగతజీవిగా పడి ఉండటం గుర్తించారు అని పోలీసులు పేర్కొన్నారు.
కాగా, ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సహజంగా జరిగిన ఘటనలా లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ విద్యార్థి ప్రాణాలు తీసుకోవడానికి ముందు ఓ వీడియో సందేశాన్ని తన మిత్రులకు పంపినట్టు పోలీసులు గుర్తించారు. తన జీవితంలో ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవని తెలుపుతూ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇద్దరు స్నేహితులకు వీడియో సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియో దృశ్యాల్లో అతను బయలుదేరాల్సి ఉందని మరియు వేరే మార్గం లేదని పేర్కొన్నాడు. అతని స్నేహితులు ఉదయం మాత్రమే సందేశాలను గమనించి అతనికి కాల్ చేయడానికి ప్రయత్నించారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసుకోవడానికి పోలీసులు మృతుడి ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కోనసాగుతున్నదనీ, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. సదరు విద్యార్థి మొదటి సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి అని, కానీ రెండవ సంవత్సరంలో అతని పనితీరు క్షీణించిందని, అతను తరగతులకు హాజరుకావడం లేదా పరీక్షలు రాయడం లేదని ప్రాథమిక విచారణలో తేలింది. అతని స్నేహితులు, సహచరులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.