చత్తీస్‌ఘడ్ లో ట్రక్కును ఢీకొన్న బస్సు: ఏడుగురు మృతి,ముగ్గురికి గాయాలు

By narsimha lodeFirst Published Sep 12, 2022, 10:26 AM IST
Highlights

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 
 

రాయ్‌పూర్: చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు  మరణించారు. రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 

ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాయ్ పూర్ నుండి సుర్గుజా జిల్లాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాంగో పోలీస్ స్టేషన్ పరిధిలోని మడైఘాట్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కోర్బా ఎస్పీ సంతోష్ సింగ్ చెప్పారు. ఈ బస్సులోని ఏడుగురు ఎక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు  గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ప్రతి రోజూ చోటు చేసుకుంటున్నాయి.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు  ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. 

ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఈ నెల 4వ తేదీన మహరాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ గ్రూప్ మాజీ చైర్మెన్ సైరస్ మిస్త్రీ మరణించారు. ఈ నెల 6వ తేదీన తెలంగాణలోని జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఉపాధి కూలీలు మరణించారు. రోడ్డు మధ్యలో మొక్కలు నాటుతున్న కూలీలను లారీ ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మరణించారు. 

ఈ నెల 3వ తేదీన ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రంలోని బారాబంకీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు.  గుజరాత్ రాష్ట్రంలోని ఆరావళి జిల్లాలో ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. 

also read:మేడ్చెల్ లో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి.. ఓవర్ టేక్ చేయబోయి...

ఈ నెల 7వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనమయ్యారు. బైక్, బస్సుఢీకొన్న ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది గాయపడ్డారు ఈ ఘటనలో బస్సుకు నిప్పంటుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

click me!