ముంబైలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి, నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

First Published Jul 3, 2018, 10:42 AM IST
Highlights

తప్పిన పెనుముప్పు:  ముంబైలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

ముంబై: భారీ వర్షాల కారణంగా ముంబయిలోని అంధేరి రైల్వే స్టేషన్‌లోని పాదచారుల  వంతెనలో కొంత భాగం  మంగళవారం నాడు కుప్పకూలింది. దీంతో పశ్చిమ రైల్వే సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.ఈ  ఘటనలో ఆరుగురికి గాయాలైనట్టు అధికారులు ప్రకటించారు.

అంధేరి ఈస్ట్‌, అంధేరి వెస్ట్‌ను కలిపే ఈ వంతెన కూలడంతో రైల్వే స్టేషన్‌లోని ఓవర్‌హెడ్‌ ఎక్విప్‌మెంట్‌ ధ్వంసమైంది.ఇంజినీర్ల బృందం మరమ్మతు చర్యలు చేపట్టిందని పశ్చిమ రైల్వే పీఆర్‌ఓ రవీందర్‌ భాకర్‌ తెలిపారు. ఈ ఘటనతో సెంట్రల్‌ రైల్వేకు చెందిన రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

వంతెన కూలడంతో అంధేరీ స్టేషన్‌ నుండి వెళ్లే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వంతెన శిథిలాలను తొలగిస్తున్నాయి. మంగళవారం నాడు ఉదయం 7.30లకు వంతెన కూలిందని రైల్వే శాఖాధికారులు ప్రకటించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు సహయక చర్యలు చేపట్టారు.

భారీ వర్షాల కారణంగానే వంతెన కూలిపోయిందని  అధికారులు అభిప్రాయపడుతున్నారు. వంతెన కూలిన సమయంలో దాని కిందుగా రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు.

పశ్చిమ రైల్వే సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగులకు టిఫిన్‌ బాక్సులు అందించే డబ్బావాలాలు కూడా ఈరోజు పశ్చిమ రైల్వే రూట్లలో తమ సేవలు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు.

click me!