
చెన్నై : కుక్కల దాడిలో మరణిస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. చెన్నైలో ఓ మహిళ పిలియన్ రైడ్ చేస్తూ వాటి దాడిలో గాయపడి మరణించింది. క్రోమ్‌పేట నివాసి (55) అయిన ఆ మహిళ వారం రోజుల క్రితం బైక్ మీద పిలియన్ రైడ్ చేస్తోంది. ఆ బైక్‌ను వీధికుక్కల గుంపు వెంబడించడంతో.. బండిమీదినుంచి జారి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం మరణించింది. మృతి చెందిన మహిళను తేన్‌మొళిగా గుర్తించిన పోలీసులు ఆమె తన కొడుకుతో బైక్‌పై ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
తేన్‌మొళి క్రోమ్‌పేట్‌లోని రాధా నగర్‌లో నివాసి. అక్కడికి సమీపంలోఉన్న లైబ్రరీలో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 24న, ఆమె కుమారుడు, ఆమె గాంధీ నగర్ గుండా వస్తుండగా వీధికుక్కల గుంపు వెంబడించింది. వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో, ఆమె కొడుకు బండి వేగం పెంచాడు. దీంతో వెనుక కూర్చున్న తేన్మొళి, బ్యాలెన్స్ తప్పి, జారి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయం కావడంతో ఆమెను పోరూర్‌లోని ఎస్‌ఆర్‌ఎంసి ఆసుపత్రికి తరలించారు.
పక్కింటి యువకుడితో భార్య పాడుపని.. కోపంతో కొట్టి చంపి, మృతదేహాన్ని స్కూటీపై తీసుకువెడుతూ...
అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ప్రమాదవశాత్తు కిందపడి మరణించినట్లు కేసు నమోదు చేసిన తర్వాత, సంఘటనకు దారితీసిన ప్రాంతంలో వీధికుక్కల బెడదపై నివేదిక ఇస్తామని సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. ఇలాంటి ఘటనే జనవరిలో జరిగింది. ఒక పాఠశాల విద్యార్థిని ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా ఒక వీధికుక్క వెంబడించడంతో తన సోదరి స్కూటీ వెనక కూర్చున్న ఆమె బండి మీదినుంచి జారిపడిపోయింది.
తాంబరం, క్రోమ్‌పేట, పల్లవరం, హస్తినాపురం, సెలైయూర్, పమ్మల్, పొజిచలూరు పరిసర ప్రాంతాల్లో వీధికుక్కల బెడదపై స్థానికులు నిత్యం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కుక్కల వల్ల యువకులు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ జనవరి 31న పల్లావరంలోని తాంబరం కార్పొరేషన్ జోనల్ కార్యాలయం వద్ద సామాజిక కార్యకర్త వి సంతానం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలో కుక్కల దాడుల ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. చిన్నారులపైనే కాదు వృద్ధులపై కూడా కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురంలో వెలుగు చూసిన ఓ ఘటన కలకలం రేపింది. శీలం రాంబాయమ్మ అనే వృద్ధురాలి మీద కుక్కలు దాడి చేశాయి. ఆమె ఇంటి ముందు కూర్చుని ఉండగా ఒక కుక్క దాడి చేసి ముక్కుపై తీవ్రంగా కరిచింది.
ఈ హఠాత్పరిణామానికి ఆమె గట్టిగా కేకలు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కుక్కను అదిలించి.. ఆమెను చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రాంబాయమ్మ మీదే కాదు అదే గ్రామంలో మరో నలుగురు మీద కూడా కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. పశువుల మీద కూడా కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నాయి. కుక్కల దాడిలో గాయపడిన వారిలో శీలం సమ్మన్న, జ్యోతిలు కూడా ఉన్నారు.