Covid 19: దేశ వ్యాప్తంగా కరోనా (Coronavirus), జేఎన్.1 సబ్ వేరియంట్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటివరకు..పలు రాష్ట్రాల్లో 511 కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ ‘జేఎన్.1’ వేరియంట్ కేసులు ఇప్పటివరకు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బయటపడ్డాయి.
Covid 19: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా (Coronavirus), సబ్-వేరియంట్ JN.1 కేసుల్లో వేగంగా పెరుగుదల నమోదవుతోంది. బుధవారం (జనవరి 3) విడుదల చేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో 602 కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు నమోదు కాగా.. ఐదుగురు మరణించారు. అదే సమయంలో JN.1 సబ్-వేరియంట్‌కు సంబంధించి 511 కేసులు నమోదయ్యాయి.
కొవిడ్ ‘జేఎన్.1’ ఉపరకం కేసులు ఇప్పటివరకు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బయటపడ్డాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం.. ఇందులో కర్ణాటకలో అత్యధికంగా 199 సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కేరళలో 148, గోవా లో 47, గుజరాత్ లో 36, మహారాష్ట్ర లో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్‌లో 4, తెలంగాణలో రెండు, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
అప్రమత్తమైన కేంద్రం
కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం, JN.1 సబ్-వేరియంట్ కేసులు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలను నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించింది. అలాగే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేస్తోంది.
అంతేకాకుండా ఈ మార్గదర్శకాలన్నింటినీ ఖచ్చితంగా పాటించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఐదుగురు మరణించారు. కేరళలో ఇద్దరు, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు మరణించారు. 602 కొత్త కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,440 కి పెరిగింది.
నాలుగేళ్లలో 5.3 లక్షల మరణాలు
ఆరోగ్య శాఖ గణాంకాలను పరిశీలిస్తే.. గత ఏడాది డిసెంబర్ 5 నాటికి కోవిడ్ రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది. కానీ, చల్లని వాతావరణంతో కొత్త వేరియంట్‌ల కేసులలో మరోసారి పెరుగుదల కనిపిస్తుంది. కొవిడ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు (4 సంవత్సరాలలో) దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. 5.3 లక్షల మందికి పైగా మరణించారు. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. కోలుకున్న రోగుల సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. ఇప్పటివరకు 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్‌లు అందించారు.