డబ్బులే డబ్బులు.. ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే ఐదు రెట్లు ఎక్కువ నగదు.. బారులు తీరిన స్థానికులు

Published : Jun 16, 2022, 12:45 PM IST
డబ్బులే డబ్బులు.. ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే ఐదు రెట్లు ఎక్కువ నగదు.. బారులు తీరిన స్థానికులు

సారాంశం

మహారాష్ట్రలోని ఓ ఏటీఎం విత్ డ్రా కోసం ఎంటర్ చేసిన అమౌంట్ కంటే కూడా ఐదు రెట్లు ఎక్కువ నగదును కస్టమర్లకు అందించడం సంచనలంగా మారింది. రూ. 500 విత్ డ్రా చేస్తే ఓ కస్టమర్‌కు ఐదు రూ. 500 నోట్లు వచ్చాయి. మరోసారి ప్రయత్నించినా.. రూ. 2,500 నగదు వచ్చింది. ఈ విషయం వేగంగా వ్యాపించడంతో స్థానికులు ఏటీఎం ఎదుట పెద్ద క్యూ కట్టారు.

ముంబయి: మహారాష్ట్రలోని ఓ ఏటీఎం డబ్బులు కుమ్మరించింది. అడిగిన దాని కంటే ఐదు రెట్లు ఎక్కువగా క్యాష్ డిస్పెన్స్ చేసింది. ఉదాహరణకు రూ. 500 విత్‌డ్రా చేస్తే.. ఆ ఏటీఎం రూ. 500లకు బదులు రూ. 2,500 అందించింది. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. స్థానికులంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఏటీఎం ముందు బారులు తీరారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పోటీ పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలో నాగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

నాగ్‌పూర్ నగరం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఖాపర్‌ఖేడా పట్టణం ఉన్నది. ఈ పట్టణంలో ఓ ప్రైవేటు బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు ఉపసంహరించుకోవడానికి ఓ వ్యక్తి వెళ్లాడు. ఆయన ఆ ఏటీఎంలో రూ. 500 తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, ఆయనకు రూ. 500 నోట్లు ఐదు వచ్చాయి. దీంతో ఆయన ఖంగు తిన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇది నిజమేనా? అని మరోసారి రూ. 500 కోసం ప్రయత్నించాడు. అప్పుడు కూడా మరోసారి ఆయనకు రూ. 2,500 డబ్బులు చేతుల్లోకి వచ్చింది.

ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకింది. స్థానికులంతా పరుగున ఏటీఎం ముందుకు వచ్చి చేరారు. ఏటీఎంలో విత్ డ్రా చేసుకోవడానికి బారులు తీరారు. ఈ వ్యవహారం ఇలాగే సాగుతుండగా.. అదే బ్యాంకు కస్టమర్ ఒకరు అక్కడికి వచ్చారు. ఏదో తేడాగా కనిపించడంతో స్థానిక పోలీసులను అలర్ట్ చేశాడు. అంతే, పోలీసులు వేగంగా స్పాట్‌కు వచ్చారు. అనంతరం, ఆ అవకతవక గురించి బ్యాంకు అధికారులు తెలియజేసినట్టు ఖాపర్‌ఖేడా పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఏటీఎం మెషీన్‌లో చిన్న సాంకేతిక లోపం కారణంగా ఈ డబ్బు ఐదు రెట్లు ఎక్కువగా వస్తున్నట్టు గుర్తించారని వివరించారు. ఏటీఎం మెషీన్‌లో డబ్బులు పెట్టేటప్పుడు.. రూ. 100 నోట్లు పెట్టే ఏటీఎం ట్రేలో రూ. 500 నోట్లు పెట్టారని ఆ అధికారి చెప్పారు. అందుకే రూ. 500 విత్ డ్రా చేస్తే.. వంద రూపాయల కరెన్సీ నోట్లు ఐదు రావడానికి బదులు రూ. 500 నోట్లు ఐదు వచ్చినట్టు అర్థం అవుతున్నది. అయితే, ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని ఆ పోలీసు అధికారి వివరించారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?