
ఈ ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోవడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఎండలు మండపోతున్నాయి. వేసవి కాలంతో సమానంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వుండటంతో విద్యుత్ డిమాండ్ కూడా అధికంగా వుంటోంది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల అనధికార విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఇదిలావుండగా.. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఐదు రోజులుగా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం డాక్టర్లు ఫ్లాష్ లైట్ల కింద గాయపడిన రోగులకు చికిత్స చేయాల్సి వచ్చింది.
శుక్రవారం సాయంత్రం కిలేపాల్‌లో ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించగా.. 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. అక్కడకు చేరుకోగానే కరెంట్ పోయింది. గాయపడిన వారిలో కొందరి పరిస్ధితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం దిమరాపాల్ మెడికల్ కాలేజీకి పంపించాల్సి వచ్చింది. ఫోన్ చేసి సమాచారం అందించినప్పటికీ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ కూడా ప్రమాద స్థలానికి చేరుకోలేదు. గాయపడిన వారిని ఆసుపత్రికి సమీపంలో నివసిస్తున్న చిత్రకూట్ ఎమ్మెల్యే రాజ్‌మాన్ బెంజమిన్, బస్తనార్ గ్రామ తహసీల్దార్ వాహనాల్లోనే ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణీకులు కుటుంబాలు వైద్య సదుపాయాలు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బస్తనార్ బ్లాక్‌లో వున్న ఏకైక పెద్ద ఆసుపత్రి ఇదేనని వారు చెబుతున్నారు. ఎమ్మెల్యే రాజ్‌మన్ బెంజమిన్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఉన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు.
పిడబ్ల్యుడి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అధికారి అజయ్ కుమార్ టెంబర్న్‌ను సమస్య గురించి అడగగా.. షార్ట్ సర్క్యూట్ సంఘటన జరిగిన వెంటనే భవనంలో ప్రాథమిక మరమ్మతులు చేసినట్లు పేర్కొన్నారు. మరమ్మత్తుల కోసం నెల రోజుల క్రితమే విద్యుత్ శాఖకు లేఖ పంపినట్లు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరిజిత్ చౌదరి తెలిపారు. వర్షాల కారణంగా గోడలపై తేమ వుందని, షార్ట్ సర్క్యూట్‌కు కారణమయ్యే అవకాశం వుందని లేఖలో సూచించినట్లు చెప్పారు. ఆసుపత్రికి జనరేటర్ కావాలని కోరుతూ డాక్టర్ చౌదరి ఆ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.