దేశంలో దాడులపై సెలబ్రిటీల ఆవేదన: చర్యలపై ప్రధాని మోదీకి 49 మంది ప్రముఖులు లేఖ

By Nagaraju penumalaFirst Published Jul 24, 2019, 5:17 PM IST
Highlights

జై శ్రీరామ్ నినాదం ఇప్పుడు కొందరి మూకదాడులకు ఊతపదమైపోయిందని లేఖలో పేర్కొన్నారు.  ఈ దాడులను చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలను జాతి ద్రోహులుగా, అర్బన్ నక్సైలైట్ల పేరుతో హింసించడం తగదన్నారు.

న్యూఢిల్లీ: దేశంలో అసహనం, మూకదాడులను నిర్మూలించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి 49 మంది సెలబ్రిటీలు లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన వారిలో ప్రముఖ సింగర్ శుభా ముద్గల్, నటి కొంకణా సేన్ శర్మ, మరియు దర్శకుడు శ్యామ్ బెనగల్, మణిరత్నం, క్రీడారంగం నుంచి అనురాగ్ కశ్యప్ లు ఉన్నారు. 

జూలై 23న దేశంలో జరుగుతున్న మూకదాడులను నివారిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. ఇప్పటి వరకు వెయ్యికి పైగా దాడులు జరిగాయని లేఖలో ప్రస్తావించారు సెలబ్రిటీలు. కులం పేరుతో దళితులు, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. 

దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులను నియంత్రించాలని లేఖలో పేర్కొన్నారు. పరిస్థితులు మరింత దిగజారగక ముందే చర్యలు తీసుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోదీని లేఖలో కోరారు. దాడులపై పార్లమెంట్ లో చర్చిస్తే ఉపయోగం ఉండదని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. 

దేశంలో ముస్లింలు, దళితులు, మైనారిటీ వర్గాల ప్రజలపై జరుగుతున్న మూకదాడులను తక్షణమే నిర్మూలించాలని కోరారు. 2016లో మూకదాడులలో 840 మంది చనిపోయినట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ నివేదికలో చూసి తామంతా షాక్ కు గురైనట్లు తెలిపారు. 

జనవరి 1 2009 నుంచి అక్టోబర్ 29 2018 సంవత్సరాల మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 254 మతపరమైన దాడులు జరిగాయని పేర్కొన్నారు. మతపరమైన దాడుల్లో 91 మంది ప్రాణాలు కోల్పోగా 579 మంది గాయాలబారిన పడ్డారని వారు తెలిపారు. 

మూకదాడులలో బలవుతున్న వారిలో ముస్లింలు, దళితులు, క్రిస్టియన్లే కావడం దురదృష్టకరమన్నారు. ఇకపోతే ఈ దాడులలో 90 శాతం 2014 తర్వాతే జరగడం బాధాకరమన్నారు. అప్పుడే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు సెలబ్రిటీలు.

దేశంలో జరుగుతున్న మూకదాడులపై పార్లమెంట్ లో కూర్చుని చర్చ జరిపి వాటిని ఖండిస్తే సరిపోదన్నారు. దాడులకు కారణమవుతున్న వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలో అన్న దానిపై ఆలోచించాలని సూచించారు. 

దాడులకు పాల్పడిన వారు బయటకు రాకుండా జైల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వారికి జీవిత ఖైదీ విధించాలని పెరోల్ రాకుండా చూడాలని కోరారు. భవిష్యత్ లో దాడులకు దిగే వారు భయపడేలా శిక్షలు అమలు చేయాలని కోరారు. 

ఇకపోతే జై శ్రీరామ్ అంటూ దాడులకు పాల్పడటం బాధాకరమన్నారు. దేశ్యాప్తంగా జరుగుతున్న దాడులలో జై శ్రీరామ్ పేరు ప్రస్తావించడం దురదృష్టకరమన్నారు. జై శ్రీరామ్ అనే నినాదాన్ని వింటుంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొందన్నారు. 

దేశంలో ఏ పౌరుడు భయంతో బతకాల్సిన అవసరం లేదన్నారు. జై శ్రీరామ్ నినాదం ఇప్పుడు కొందరి మూకదాడులకు ఊతపదమైపోయిందని లేఖలో పేర్కొన్నారు.  ఈ దాడులను చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. 

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలను జాతి ద్రోహులుగా, అర్బన్ నక్సైలైట్ల పేరుతో హింసించడం తగదన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకార దేశంలోని ప్రతి ఒక్క పౌరుని భావప్రకటనా స్వేచ్ఛను తెలియజేసే హక్కు ఉందని లేఖలో పేర్కొన్నారు. అంతే కానీ అసమ్మతిని కారణంగా చూపించి అమాయక ప్రజలకు శిక్షలు వేయకూడదంటూ లేఖలో చెప్పుకొచ్చారు. 

తాము రాసిన లేఖను పరిగణలోకి తీసుకుని దాడులను అరికడతారని ఆశిస్తున్నట్లు లేఖలో కోరారు. అనంతరం లేఖలో 49 మంది సెలబ్రెటీల పేర్లు నమోదు  చేశారు. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన వారిలో సినీఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతోపాటు పాత్రికేయులు, మానసిక వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, క్రీడాకారులు, పర్యావరణ నిపుణులు, డిజైనర్స్ ఉన్నారు. 

click me!