ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమెరికాలో ఉద్యోగాలకు కోత పెడుతున్నది. మే నెలలో ఈ కృత్రిమ మేధ కారణంగా 4,000 ఉద్యోగాలను తొలగించినట్టు ఓ నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ: సాంకేతిక అభివృద్ధి మానవ జీవితాన్ని సుఖవంతం, సౌకర్యవంతం చేస్తున్నా.. దాని నుంచి సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ టెక్నాలజీ యాజమాన్యాలకు, బడా బాబులకు ప్రయోజనాలు చేకూర్చినా.. లాభార్జన పెంచగలిగినా.. ఉద్యోగులకు మాత్రం శరాఘాతంగా మారుతున్నది. చిన్న దేశం, పెద్ద దేశం అనే తారతమ్యం లేకుండా ఉద్యోగాలను ఈ టెక్నాలజీ మింగేస్తున్నది. తాజాగా చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ రిపోర్ట్ అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపాధి పై వేసిన దెబ్బను ప్రస్ఫుటం చేసింది.
అమెరికాలోని యాజమాన్యాలు స్పష్టంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా 3,900 మందిని ఉద్యోగాల నుంచి తొలగించామని చెప్పినట్టు ఈ రిపోర్టు వెల్లడించింది. ఇది మే నెలలో అమెరికాలో చోటుచేసుకున్న మొత్తం ఉద్యోగాల కోతలో 4.9 శాతం.
ఈ రిపోర్టు గురువారం విడుదలైంది. ఈ ఏడాది జనవరి, మే నెలల మధ్య 4.175 లక్షల ఉద్యోగాలు గల్లంతైనట్టు తెలిపింది. కరోనా దెబ్బకు 14 లక్షల ఉద్యోగాలు కొండెక్కిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అంటే 2020 నుంచి మళ్లీ అత్యధిక ఉద్యోగ కోతలు ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో జరిగాయి. కరోనా మహమ్మారి పరిస్థితులు మినహాయిస్తే 2023లో మళ్లీ గరిష్ట కోతలు పడ్డాయి.
గత ఆరు నెలల్లో వినియోగదారుల ఆత్మవిశ్వాసం స్వల్పానికి చేరాయి. ఉద్యోగ నియామకాలు కుచించుకుపోయాయి. మాంద్యం ముప్పు ఉన్నదనే అంచనాలతో కంపెనీలు నియామకాలను అటకెక్కించాయని ఆండ్రూ చాలెంజర్, లేబర్ ఎక్స్‌పర్ట్ వెల్లడించారు.
ఏఐ (కృత్రిమ మేధ) తప్పిస్తే బిజినెస్ క్లోజర్‌లతోనూ మే నెలలో అత్యధిక ఉద్యోగ కోతలు ఏర్పడ్డాయని ఈ నివేదిక తెలిపింది. ఈ కారణంగా 19,600 ఉద్యోగాలు ఊడిపోయాయి. మార్కెట్ లేదా ఎకనామిక్ కండీషన్ వల్ల 14,600 ఉద్యోగాలు పోయాయి.
Also Read: ట్రైన్ ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు విద్య అందిస్తాం: అదానీ గ్రూప్
సీబీఎస్ న్యూస్ ఈ నివేదికను రిపోర్ట్ చేసింది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు అధునాతన ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. క్రియేటివ్ వర్క్, రైటింగ్, అడ్మినిస్ట్రేటివ్, క్లరికల్ వర్క్ సహా అనేక పనులను ఏఐ ద్వారా చేయించుకుంటున్నాయి. గత వారం వాషింగ్టన్ పోస్టు ఇద్దరు కాపీ రైటర్లను తొలగించిందని, చీపర్ ప్రైస్‌తో పని చేయించుకుంటున్న చాట్ జీపీటీని వారికి బదులుగా ఎంచుకున్నట్టు పేర్కొంది. మీడియా కంపెనీ సీనెట్ కూడా ఆర్టికల్స్ రాయడానికి ఏఐని ఉపయోగించుకుని రిపోర్టర్లను తొలగించింది.
ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఫుల్ టైమ్ జాబ్‌లను ఏఐ మింగేస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ మార్చి నెలలో అంచనా వేసింది.