బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

By Sumanth KanukulaFirst Published Nov 26, 2022, 4:28 PM IST
Highlights

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించినట్టుగా పోలీసులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించినట్టుగా పోలీసులు తెలిపారు. మరణించినవారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా చెప్పారు. మిర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొమ్రా గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో ఉదయం 7.30 గంటలకు భద్రతా బలగాల సంయుక్త బృందాలు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో ఉండగా కాల్పులు జరిగాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌ రాజ్ తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సిబ్బంది పాల్గొన్నారని సుందర్ రాజ్ చెప్పారు. మావోయిస్టుల డివిజనల్ కమిటీ సభ్యులు మోహన్ కడ్తి, సుమిత్రల రాజధాని రాయ్‌పూర్‌కు 400కిలోమీటర్ల దూరంలో ఉన్న పొమ్రా-హల్లూర్ అడవుల్లో 30 నుంచి 40 మంది సహచర మావోయిస్టులతో ఉన్నట్లుగా వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభమైందని చెప్పారు. 

డీఆర్‌జీ పెట్రోలింగ్ బృందం పోమ్రా అడవిలో ఉన్నప్పుడు కాల్పులు జరిగాయని తెలిపారు. ఎదురుకాల్పులు నిలిచిన తర్వాత ఘటనా స్థలం నుంచి 303 రైఫిల్, .315 బోర్ రైఫిల్ సహా మూడు ఆయుధాలతో పాటు నలుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరణించిన మావోయిస్టుల వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే.. ఒడిశాలోని బలంగీర్ జిల్లా గంధమార్ధన్ కొండల్లో భద్రతా సిబ్బందికి, మావోయిస్టుల మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు  జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారులు ధ్రువీకరించారు. ఒడిశాలోని ఎలైట్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌వోజీ), బోలంగీర్ జిల్లా స్వచ్ఛంద దళం (డీవీఎఫ్) భద్రతా సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్‌లో ఉండగా ఖప్రఖోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్ మహాదేవ్ ఆలయానికి సమీపంలోని అడవిలో మావోయిస్టుల శిబిరాన్ని గుర్తించారు. ఆ  తర్వాత అక్కడ కాల్పులు జరిగాయి.

భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు కాల్పులు జరపగా.. ఎస్‌వోజీ, డీవీఎఫ్ సిబ్బంది ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఇందులో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారని తెలిపారు. మావోయిస్టుల శిబిరం నుంచి కొన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
 

click me!