బొగ్గు దొంగలకు, సీఐఎస్‌ఎఫ్ జవాన్లకు మధ్య ఘర్షణ.. కాల్పుల్లో నలుగురు దొంగల మృతి

By Sumanth KanukulaFirst Published Nov 20, 2022, 2:46 PM IST
Highlights

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో సీఐఎస్‌ఎఫ్ జవాన్లకు, బొగ్గు దొంగలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే జరిగిన కాల్పుల్లో నలుగురు బొగ్గు దొంగలు మరణించారు

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో సీఐఎస్‌ఎఫ్ జవాన్లకు, బొగ్గు దొంగలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే జరిగిన కాల్పుల్లో నలుగురు బొగ్గు దొంగలు మరణించారు. మరో ఇద్దరు బొగ్గు దొంగలు గాయపడ్డారు. బొగ్గు దొంగలను ఆపేందుకు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది యత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని జిల్లాలోని బగ్మారా పోలీస్ స్టేషన్ పరిధిలోని డెనిడిహ్ కోల్ సైడింగ్ ఏరియాలో తెల్లవారుజామున 12.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

‘‘డ్యూటీలో ఉన్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో గుమిగూడిన బొగ్గు దొంగలను ఆపడానికి ప్రయత్నించారు. అయితే వారు జవాన్లపై దాడికి దిగారు. దీంతో  సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు’’ అని ధన్‌బాద్ ఎస్పీ (రూరల్) రీష్మా రమేశన్ పీటీఐకి చెప్పారు. నలుగురు బొగ్గు దొంగలు చనిపోయారని వెల్లడించారు. ఇద్దరు గాయపడ్డారని.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని వెల్లడించారు. 

ఇక, ఈ ఘటనపై మృతుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. 

click me!