'రాముడు అందరివాడు...'మతపరమైన విభజనపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు  

By Rajesh KarampooriFirst Published Nov 20, 2022, 1:59 PM IST
Highlights

పార్టీలో మతపరమైన విభజన సృష్టించి బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని , అలాగే రాముడు అందరి వాడని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి , నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో మతపరమైన విభజన సృష్టించి బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని , అలాగే రాముడు అందరి వాడని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి , నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో నేషనల్ కాన్ఫరెన్స్ (NC) కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రసంగిస్తూ..  కేంద్రపాలిత ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విరుచుకుపడ్డారు. ఈ ప్రాంతంలో  50 వేల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ.. అవి ఎక్కడ ఉన్నాయని కేంద్రంపై విమర్శలు గుప్పించారని అన్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పిల్లలు అందరూ నిరుద్యోగులని అన్నారు. గవర్నర్ దీన్ని చేయలేరని, దీనికి ఆయనను బాధ్యులను చేయలేమని  ఫరూక్ అన్నారు. అదే సమయంలో ఎన్నికలే కీలకమని అన్నారు.
 
తరచు విపక్షలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. తాను ఎప్పుడూ పాకిస్థాన్‌తో చేతులు కలపలేదని, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ఎప్పుడూ పాకిస్తాన్‌ పక్షం వహించలేదని స్పష్టం చేశారు. జిన్నా మా నాన్నను కలవడానికి వచ్చారు, కానీ మేము అతనితో కరచాలనం చేయడానికి నిరాకరించాము. అని  చెప్పారు.  మేము సంతోషిస్తున్నాము, పాకిస్తాన్‌లో ప్రజలకు అధికారం లేదని అన్నారు. ఏ మతం చెడ్డది కాదనీ.. అవినీతిపరులకు మతంతో సంబంధం లేదని అన్నారు.

బీజేపీని టార్గెట్ చేస్తూ.. ఎన్నికల సమయంలో హిందువులు ప్రమాదంలో ఉన్నారనే ప్రచారం చేస్తున్నారనీ,ఈ అపోహాలు, అసత్యప్రచారాలను లెక్క చేయకూదని ప్రజలను అభ్యర్తించారు. పార్టీలో మత పేరిట విభజన తీసుకోవస్తున్నారని.. అలాంటి చర్యలను సహించమని అన్నారు.  రాముడు ప్రతి ఒక్కరికీ చెందాడని, కేవలం హిందూ మతానికి చెందిన వారికే కాదు. రాముడు అందరికీ చెందినవాడనీ, కేవలం హిందూ మతానికి చెందిన వారే కాదు అందరూ ఆరాధిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా పోటీ 

నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని శనివారం ప్రకటించారు. వచ్చే నెలలో ఎన్‌సీ చైర్మన్‌ పదవిని వదులుకుంటానని అబ్దుల్లా శుక్రవారం ప్రకటించారు. బాధ్యతల నుంచి తప్పించుకోవడం లేదని, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని అన్నారు. పార్టీలోకి కొత్త వారిని స్వాగతం పలికారు. నగ్రోటాకు చెందిన గుర్జిత్ శర్మతో సహా పలువురు ప్రముఖ రాజకీయ కార్యకర్తలు NC చీఫ్ అబ్దుల్లా ,జమ్మూ ప్రావిన్షియల్ ప్రెసిడెంట్ రతన్ లాల్ గుప్తా సమక్షంలో నేషనల్ కాన్ఫరెన్స్‌లో చేరారు.

నేషనల్ కాన్ఫరెన్స్ ప్రజాస్వామ్య పార్టీ: ఫరూక్

పార్టీ తదుపరి అధ్యక్షుడి గురించి ఫరూక్ అబ్దుల్లా ను  ప్రశ్నించగా..  నేషనల్ కాన్ఫరెన్స్ ప్రజాస్వామ్య పార్టీ అని, కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి డిసెంబర్ 5 న పార్టీ ఎన్నికలు జరుగుతాయని అబ్దుల్లా చెప్పారు. ప్రజలు నామినేషన్లు వేస్తారని, తదుపరి పార్టీ అధ్యక్షుడిని ఎవరనేది పార్టీ ప్రతినిధులే నిర్ణయిస్తారని అన్నారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, జమ్మూకశ్మీర్‌ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తమ పార్టీ విజేతగా నిలుస్తుందని తెలిపారు. యువత పార్టీ నాయకత్వాన్ని చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని అబ్దుల్లా అన్నారు. తనకు సాధ్యమైనదంతా చేశానని, పార్టీ నుంచి పారిపోనని, పార్టీ విజయానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.

జమ్మూ-కాశ్మీర్ , లడఖ్ మరోసారి ఒకే రాష్ట్రంగా మారే సమయం ఎంతో దూరంలో లేదని జమ్మూ & కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని అబ్దుల్లా వాదించారు. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దానిని జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ మొదటి ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్నాయి.

click me!