
నోయిడా : ఐటీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళ మంగళవారం మధ్యాహ్నం సెక్టార్ 70లోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించింది. ప్రాథమికంగా దీనిని ఆత్మహత్యగా పోలీసులు తెలిపారు. కానీ ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని.. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి హోటల్ గది సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసినట్లుగా ఆమె తండ్రి ఆరోపించారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. తండ్రి ఆమె దగ్గర దొరికిన ఒక వీడియోను తన వాదనకు ఆధారంగా చెబుతున్నారు. ఆ వీడియోలో ఆమె ఒక వ్యక్తిని 'అర్జున్' అని పిలుస్తూ.. తనను 'ఆకాష్' నుండి రక్షించమని కన్నీళ్లతో విజ్ఞప్తి చేస్తుంది. అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ రికార్డ్ చేశారనేది స్పష్టంగా లేదు. ఇక సోమవారం రాత్రి ఆ మహిళ ఒంటరిగానే హోటల్‌లోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అదనపు DCP (సెంట్రల్ నోయిడా) అంకితా శర్మ మాట్లాడుతూ “సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమె ఒంటరిగానే హోటల్ లోకి చెక్ ఇన్ అయ్యింది’ అని తెలిపారు.
చెక్అవుట్ సమయం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు, టైం దగ్గరపడుతుండడంతో హోటల్ సిబ్బంది ఆమెకు విషయం గుర్తు చేయడానికి ఫోన్ చేశారు. కానీ అటు నుంచి స్పందన రాలేదు. కొంత సేపు వేచి చూసిన హోటల్ సిబ్బంది ఆ తరువాత ఆమె రూం దగ్గరికి వెళ్లి.. తలుపులు తట్టారు. అయినా ఏమీ ప్రయోజనం లేకపోవడంతో వారు తలుపు పగులగొట్టారు. అక్కడ ఆమె, గదిలోని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తల్లిదండ్రులతో కలిసి ఘజియాబాద్‌లో ఉంటుండేది. నోయిడాలోని టెక్ MNC కార్యాలయంలో పని చేస్తుంది. ఆమె తండ్రి మాట్లాడుతూ, ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ఒక కేఫ్‌లో ఆమె ఒక కానిస్టేబుల్, మరో ముగ్గురిని కలిసిందని ఆమె మృతిలో వారి ప్రమేయం ఉందని తాను అనుమానిస్తున్నట్లు చెప్పారు. “నా కుమార్తెపై అత్యాచారం జరిగింది. దానిని ఆత్మహత్యగా చూపించడానికి, ఆమెను సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశారు. దీని వెనుక యూపీ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నాం. అతనితోపాటు మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఉంది. ఆదివారం రాత్రి, నా కుమార్తె సీపీలోని ఒక కేఫ్‌కి వెళ్లిందని మాకు తెలిసింది, అక్కడ కానిస్టేబుల్ కూడా ఆమెను కలిశాడు”అని ఆయన చెప్పుకొచ్చారు.
స్కూటర్ పై స్మృతి ఇరానీ, భలే ఫిట్ గా ఉన్నావన్న ఏక్తాకపూర్.. వైరల్ అవుతున్న వీడియో..
“ఆమె డ్రింక్‌లో ఏదో కలిపి హోటల్‌కి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ క్రమంలో స్పృహలోకి వచ్చిన ఆమె అర్జున్ సహాయం కోరుతూ ఓ వీడియోను రికార్డింగ్ చేసింది. దాన్ని షేర్ చేసింది. మా కూతురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు. అయితే ఆమె పోస్టు మార్టం నివేదికలో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. ఉరికారణంగానే మెడచుట్టూ గాయాలయ్యి చనిపోయిందని తేలింది. దీనిమీద పోలీసులు మాట్లాడుతూ.. పోస్టుమార్టం నివేదికలో అయితే ఉరివల్లే చనిపోయిందని, అత్యాచారం జరగలేదని తెలుస్తోంది. కానీ కుటుంబసభ్యుల ఆరోపణల నేపథ్యంలో.. మృతదేహంనుంచి స్వాబ్ సాంపిల్స్ తీశాం వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపుతున్నాం”అని అదనపు డిసిపి చెప్పారు.
డిసిపి (సెంట్రల్) రాజేష్ ఎస్ మాట్లాడుతూ, “ఆమె కుటుంబం చేసిన వాదనలను తేల్చేందుకు.. నిందితులందరినీ ప్రశ్నిస్తాం. ఆమె తండ్రి షేర్ చేసిన వీడియోను కూడా పరిశీలిస్తున్నాం. దీనిమీద తగిన చర్యలు తీసుకుంటాం'' అన్నారు. జాయింట్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) లవ్ కుమార్ మాట్లాడుతూ, అర్జున్, ఆకాష్‌తో సహా మహిళ తండ్రి పేర్కొన్న నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. “సెక్షన్ 302 (హత్య), 376 (అత్యాచారం) కింద కేసు నమోదు చేయబడింది. విచారణ నిమిత్తం అర్జున్‌ని అదుపులోకి తీసుకున్నాం. పరారీలో ఉన్న ఆకాష్ ఆచూకీ కోసం బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసును డిసిపి మహిళా భద్రత, అదనపు డిసిపి మహిళల భద్రత కింద నిశితంగా పర్యవేక్షిస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాం”అని కుమార్ చెప్పారు.
(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి గోప్యతను కాపాడేందుకు బాధితురాలి గుర్తింపును వెల్లడించలేదు)