
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లోని డైమండ్ సిటీ పన్నాల్లో చిన్న ఇటుకల బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి పంటపండింది. అతడికి దొరికన డైమండ్ అంచనాలను మించి వేలంపాటలో రికార్డు ధరను సొంతం చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని పట్టణంలోని కిషోర్‌గంజ్ లో నివసిస్తున్న సుశీల్ శుక్లా తవ్వకుండా వదిలేసిన నిస్సార గనిలో చిన్న తరహా ఇటుక బట్టీల వ్యాపారం చేసుకుంటున్నారు. అదే సమయంలో అతను ఆయన కుటుంబంతో కలసి 20 సంవత్సరాలుగా వజ్రాల మైనింగ్ పనిని కూడా చేస్తున్నాడు. ఎప్పటి లాగానే.. సోమవారం కూడా మైనింగ్ పనుల్లో ఉండగా.. గత సోమవారం (ఫిబ్రవరి 21) అనుకోకుండా.. ఓ మెరిసే రాయి కనిపించింది. దానిని తీరా గమనించి చూస్తే.. ఓ సారిగా అవాక్కయారు. అది మెరిసే రాయి కాదు... 26.11 క్యారెట్ల వజ్రం అని తెలుసుకున్నాడు. దాని విలువ దాదాపు రూ.1.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
తాజాగా నిర్వహించిన వేలం పాటలో పన్నాలో ఇటుక బట్టీ నిర్వాహకుడు కనుగొన్న 26.11 క్యారెట్ల వజ్రం అంచనాలకు మించి ఏకంగా రూ. 1.62 కోట్లకు ధర పలికింది. అలాగే, మరో 87 వజ్రాలు మొత్తం రూ.1.89 కోట్ల ధరను పలికాయి. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంపీ 'డైమండ్ సిటీ' పన్నా (Panna) లో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఈ వజ్రాల వేలం నిర్వహించారు. వేలపాట నిర్వహించిన తొలిరోజు ఏకంగా 82.45 క్యారెట్ల బరువున్న 36 వజ్రాలు రూ.1.65 కోట్లకు విక్రయించినట్లు పన్నా జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా ఆదివారం తెలిపారు. అంతేకాకుండా 78.35 క్యారెట్ల బరువున్న 52 వజ్రాలు రెండో రోజు రూ.1.86 కోట్లు పలికాయి.
ఈ వేలంలో మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని పట్టణంలోని కిషోర్‌గంజ్ లో నివసిస్తున్న సుశీల్ శుక్లాకు దొరికిన డైమండ్ ( 26.11 క్యారెట్ల వజ్రం) అత్యధికంగా రూ.1.62 కోట్ల ధర పలికిందని తెలిపారు. ఇది ఫిబ్రవరి 21న ఇక్కడి గనిలో లభ్యమైందని అధికారి తెలిపారు. ఈ విలువైన రాయికి వేలం క్యారెట్‌కు రూ.3 లక్షల నుంచి ప్రారంభమై రూ.6.22 లక్షలకు చేరిందని, చాలా కాలం తర్వాత ఇంత పెద్ద వజ్రం పన్నాలో లభించిందని చెప్పారు. కృష్ణ కళ్యాణ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఒక నిస్సార గనిలో చిన్న తరహా ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న సుశీల్ శుక్లా కనుగొన్న ఈ వజ్రాన్ని స్థానిక వ్యాపారి కొనుగోలు చేశాడు. చాలా ఏళ్ల తర్వాత అంత విలువైన వజ్రం దొరికిందని.. అది 1.62 కోట్లకు అమ్ముడుపోవడం ఒక రికార్డు అంటూ వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ డైమండ్ మీద వచ్చిన డబ్బులో ప్రభుత్వం రాయల్టీ, ట్యాక్సులు పోను.. మిగితా డబ్బును సుశీల్‌కు వేలం నిర్వాహకులు అందజేశారు.
ఇదిలావుండగా, మధ్యప్రదేశ్ లోని పన్నా డైమండ్ సిటీగా పేరుగాంచింది. డైమండ్స్‌కు పన్నా పెట్టింది పేరు. ప్రభుత్వమే అక్కడ డైమండ్స్ వెతికేందుకు స్థానికులకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఎవరికి డైమండ్ దొరికినా.. దాన్ని వేలం వేస్తారు. దాని మీద వచ్చిన డబ్బును డైమండ్ తెచ్చి ఇచ్చిన వాళ్లను అందజేస్తారు. పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల విలువైన వజ్రాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానికులతో మైనింగ్ చేయిస్తూ.. వజ్రాలను సేకరిస్తున్నారు.