5 రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా.. థర్డ్ వేవ్ అలర్ట్

By telugu teamFirst Published Aug 11, 2021, 1:58 PM IST
Highlights

బెంగళూరులో గడిచిన ఐదు రోజుల్లోనే 242 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డట్టు ప్రభుత్వ వివరాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మూడు రెట్లకు పెరగవచ్చునని, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. 

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆందోళనకర పరిణామం ఎదురవుతున్నది. గత ఐదు రోజులుగా చిన్నపిల్లలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ వివరాల ప్రకారం గడిచిన ఐదు రోజుల్లో 242 మంది పిల్లలు కరోనా బారిన పడ్డట్టు తేలింది. థర్డ్ వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం వేస్తుందన్న ఇటీవలి విశ్లేషణలు కలవరపెడుతున్నాయి.

గత ఐదు రోజుల్లో 19ఏళ్లలోపున్న 242 మంది పిల్లల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్టు బృహత్ బెంగళూరు మహానగర పాలికే వెల్లడించింది. ఇందులో తొమ్మిదేళ్లలోపు వారు 106 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో చిన్నపిల్లల్లో కరోనా కేసులు మరిన్ని పెరిగే ముప్పు ఉన్నదని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్ర ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి తాజా పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. వచ్చే రోజుల్లో ఈ కేసులు మూడింతలకు పెరిగే అవకాశముందని అంచనా వేశారు. పిల్లలను ఇంటి నుంచి బయట  అడుగుపెట్టకుండా చూసుకుని వైరస్ బారి నుంచి కాపాడుకోవడమే మన చేతులో ఉన్నదని సూచించారు. పెద్దలతో పోల్చితే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, కాబట్టి పిల్లలను ఇంటికే పరిమితం చేయాలని అన్నారు.

వచ్చే వారం నుంచి పాక్షిక లాక్‌డౌన్
కరోనా మహమ్మారిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కట్టడి చర్యలు అమలు చేస్తున్నది. అన్ని జిల్లాల్లో నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నది. మహారాష్ట్ర, కేరళ నుంచి ప్రయాణాలను నిలిపేసింది. స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాక్షిక లాక్‌డౌన్ అమలు చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి.

click me!