యూపీలో భారీ వర్షాల బీభత్సం.. 23 మంది మృతి.. స్థంభించిన జనజీవనం  

By Rajesh KarampooriFirst Published Sep 17, 2022, 6:41 AM IST
Highlights

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో జరిగిన వివిధ సంఘటనల్లో  23 మంది మరణించారని అధికారులు తెలిపారు. 
 

గత మూడు రోజులుగా  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో జరిగిన వివిధ సంఘటనల్లో  23 మంది మరణించారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. లక్నోలో తొమ్మిది మంది మరణించగా, ఉన్నావ్‌లో ఐదుగురు, ఫతేపూర్‌లో ముగ్గురు, ప్రయాగ్‌రాజ్‌లో ఇద్దరు, ఝాన్సీ, రాయ్‌బరేలీ, సీతాపూర్, కన్నౌజ్‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అంతేకాకుండా, అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా లక్నోలోని పాఠశాలలు మూసివేయబడ్డాయి. శుక్రవారం లక్నో విశ్వవిద్యాలయం పరీక్షలను రద్దు చేసింది, 

తూర్పు ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో సగటున 32.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే, గురువారం, శుక్రవారం మధ్య లక్నోలో 160.1 మిమీ వర్షపాతం నమోదైంది. వాతావ‌ర‌ణ శాఖ ప్రకారం.. గ‌త 36 సంవత్సరాలలో సెప్టెంబర్‌లో ఈ స్థాయిలో వ‌ర్షం కుర‌వ‌డం ఇదే అత్యధికం. భారీ వర్షాల దృష్ట్యా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యా సహాయక చర్యలను పర్యవేక్షించాలని,  బాధితులకు  ఆర్థిక సహాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. 

లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలోని విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని గౌర్ ఎన్‌క్లేవ్ సమీపంలో రాత్రిపూట కురిసిన వర్షాలకు సరిహద్దు గోడ కూలిపోవడంతో ముగ్గురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు.  సంఘటన మృతులు చెందిన వారు ఝాన్సీకి చెందిన కూలీలని అధికారులు తెలిపారు.  మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది . క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

ఇదే స‌మ‌యంలో ఉన్నావ్ జిల్లాలోని అసోహా ప్రాంతంలో  ఇల్లు కూలి నలుగురు మృతి చెందినట్లు సహాయ కమిషనర్ రణవీర్ సింగ్ తెలిపారు. అలాగే.. రాయ్‌బరేలీలోని సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మురయ్యపూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఇంటి పైకప్పు కూలడంతో ఒక చిన్నారి  మరణించగా, ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఇది కాకుండా.. పిడుగుపాటు కారణంగా కనౌజ్‌లో ఒకరు మృతి చెందగా, కుషినగర్ జిల్లాలో మరో నలుగురు గాయపడ్డారు. సోన్‌భద్ర జిల్లాలో పాము కాటు కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారని రిలీఫ్ కమిషనర్ తెలిపారు.

ఆదిత్యా నాథ్‌తో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ లు ప్రాణ‌న‌ష్టంపై సంతాపం వ్యక్తం చేశారు. ట్రామా మేనేజ్‌మెంట్ యూనిట్లతో పాటు పలు ఆసుపత్రులు, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేసినట్లు లక్నో జిల్లా మేజిస్ట్రేట్ ఎస్పీ గంగ్వార్ తెలిపారు.  అలాగే అంబులెన్స్ సర్వీసులు 108, 102లను అప్రమత్తం చేశామని చెప్పారు.

డివిజనల్ కమీషనర్ రోషన్ జాకబ్, ఇతర ఉన్నతాధికారులు లక్నోవాస్‌లోని లోత‌ట్టు ప్రాంతాల‌ను   పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో సర్వే నిర్వహించి సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వ‌ర‌ద బాధితుల‌కు త్వరగా సహాయ ధనాన్ని అందజేయాలని అధికారులను కోరారు.

ఇదిలాఉంటే.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్  రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు, వర్షపాతం దాని అభివృద్ధి పథకాలన్నింటినీ కడిగివేయబడింద‌ని అన్నారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో జనజీవనం  అస్తవ్యస్తమైంది. ప్రభుత్వ వాదనలు, స్థానిక సంస్థల పనితీరు బహిర్గతమైందని విమ‌ర్శించారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఇంత న‌ష్టం జ‌రిగింద‌నీ, జనజీవనం స్తంభించిపోయింద‌ని మండి ప‌డ్డారు.

click me!