
ఓ యువతికి బాలుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహానికి దారి తీసింది. దీంతో వారిద్దరూ తరచూ చాటింగ్ చేసుకునేవారు. ఒకరి విషయాలు మరొకరితో పంచుకునే వారు. దీనిని ఆ బాలుడు స్నేహం అనుకున్నాడు. కానీ ఆ యువతి ఇదంతా ప్రేమ అని అనుకుంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక్క సారిగా ఆ బాలుడికి యువతి లవ్ ప్రపోజ్ చేసింది. దీనిని బాలుడు తిరస్కరించాడు. అయినా అతడిని వదిలిపెట్టలేదు. ప్రేమ పేరుతో ఇబ్బంది పెట్టింది. పలు మార్లు లైంగిక దాడికి పాల్పడింది. దీంతో విసిగిపోయిన ఆ మైనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి. ముంబాయిలోని ధారావి ప్రాంతానికి చెందిన ఓ యువతికి (20) ఓ బాలుడి (17) తో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. 2020 సంవత్సరంలో వీరి మధ్య సోషల్ మీడియాలో స్నేహం చిగురించింది. వీరు ఇద్దరూ తరచూ చాటింగ్ చేసుకుననేవారు. ఇదంతా ప్రేమగా భావించిన యువతి ఆ బాలుడికి ప్రపోజ్ చేసింది. కానీ ఆమె ప్రపోజల్ ను ఆ మైనర్ రిజెక్ట్ చేశాడు. దీంతో పాటు ఆమె నుంచి కాల్స్ రాకుండా ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేశాడు. అలాగే సోషల్ మీడియా అకౌంట్లను కూడా బ్లాక్ లో పెట్టాడు.
కానీ ఆ యువతి మాత్రం మైనర్ ను విడిచిపెట్టలేదు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించింది. వాటి ద్వారా అతడిని వేధించడం మొదలు పెట్టింది. ఇలా ఇబ్బందులు పెడుతున్న క్రమంలో ఆ బాలుడు జాబ్ కోసం అని ఈ ఏడాది జనవరి 19వ తేదీన ముంబాయికి వచ్చాడు. జాబ్ ప్రయత్నాలు కొనసాగించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తనను కలవాలని కోరింది. ధారవిలో ఉన్న తన ఇంటికి రావాలని అడిగింది. ఆమె మాటలు నమ్మి ఆ మైనర్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆ యువతి బాలుడిపై లైంగిక దాడి చేసింది.
ఈ ఘటన తరువాత కూడా ఆ బాలుడిని వాషిలోని ఓ లాడ్జికి పిలిపించుకుంది. అక్కడ కూడా లైంగిక దాడికి పాల్పడింది. ఆ తరువాత కూడా వివిధ చోట్లకు తీసుకెళ్లి లైంగికంగా వేధించింది. దీనిని తట్టుకోలేక వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో మైనర్ ఫిర్యాదు మేరకు యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా.. ఆ యువతి బాలుడి కుటుంబంపై కేసు పెట్టింది. మైనర్, అతడి తండ్రి తో పాటు నలుగురు మేనమామలు, ఓ బంధువు కలిసి తనను రేప్ చేశారని ఆరోపించింది. ఈ విషయంలో నవీ ముంబైలోని పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఆ కేసును ధారవి పోలీసులకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ రెండు కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి.