
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రెండేళ్ల కాలంలో రెండు ప్రధాన పార్టీలను దెబ్బతీయడంలో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. శివసేనలో ఏక్ నాథ్ షిండే వర్గం పార్టీ నుండి బయటకు వచ్చింది. తాజాగా అజిత్ పవార్ వర్గంలో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతును ప్రకటించారు. అజిత్ పవార్ కు చెందిన సుమారు 9 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి.
ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సుప్రియా సూలే, ప్రపుల్ పటేల్ కు శరద్ పవార్ కేటాయించారు. కానీ పార్టీలో అజిత్ పవార్ కు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో అజిత్ పవార్ అసంతృప్తితో ఉన్నారు. అదను చూసి శరద్ పవార్ కు చుక్కలు చూపించారు. ఇవాళ తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం నుండి రాజ్ భవన్ కు వెళ్లి అజిత్ పవార్ సహా 9 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే (శివసేన), ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి రెండేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఉద్దవ్ ఠాక్రే పై ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. బీజేపీ, ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలతో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుంది.
ఎన్సీపీలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. అజిత్ పవార్ ను తన వైపునకు తిప్పుకుంది. శరద్ పవార్ పై అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు.ఏక్ నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అజిత్ పవార్ వర్గానికి షిండే కేబినెట్ లో చోటు దక్కింది.
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందని రెండు రోజుల క్రితమే ఫడ్నవీస్ ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే అజిత్ పవార్ వెంట 40 మంది ఉన్నారని చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం నుండి కింద అనర్హత నుండి తప్పించుకోవాలంటే పవార్ కు 36 మందికి పైగా ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది.
మహారాష్ట్రలో రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను బీజేపీ తీవ్రంగా దెబ్బతీసింది. శివసేన, ఎన్‌సీపీలలోని పరిణామాలను చూసి బీజేపీ కదిపిన పావులు కమలం పార్టీకి కలిసి వచ్చాయి. శివసేన (ఉద్దవ్ ఠాక్రే), ఎన్‌సీపీల్లో చీలికలు ఏర్పడ్డాయి.
వచ్చే ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు విపక్షాలకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారనున్నాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా బీజేపీకి కలిసి వచ్చే అవకాశం లేకపోలేదు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. దీంతో బీజేపీ త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రీకరించింది. అంతేకాదు తాము బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై కూడ కమలదళం ఫోకస్ పెట్టింది.