
New Delhi: సమాజంలో రోజురోజుకూ మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయని ఇటీవల చోటుచేసుకుంటున్న అనేక ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆడపిల్లలను పుట్టకముందే చంపుతున్న ఘటనలు మొదలుకొని.. పసికందులుగా ఉన్న సమయంలో సొంతవారే వారి ప్రాణాలు తీస్తున్న ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. ఈ తరహాలోనే ఆడపిల్ల పుట్టిందని సొంతవారే అతి క్రూరంగా ఓ ఆడబిడ్డ ప్రాణాలు తీశారు. రెండు నెలల పాప అని చూడకుండా మైక్రోవేవ్ ఓవెన్ (Microwave Oven) లో పెట్టి ప్రాణాలు తీశారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం నాడు దక్షిణ ఢిల్లీలోని చిరాగ్ డిల్లీ ప్రాంతంలో మైక్రోవేవ్ ఓవెన్‌లో రెండు నెలల పసికందు శవమై కనిపించింది. మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో ఆడ శిశువు మృతి చెందినట్లు తమకు సమాచారం అందిందని, అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) బెనిటా మేరీ జైకర్ తెలిపారు. "పాప తల్లిదండ్రులు గుల్షన్ కౌశిక్ మరియు డింపుల్ కౌశిక్‌లను పోలీస్ స్టేషన్‌లో (Delhi Police) విచారిస్తున్నామని మరియు తదుపరి విచారణ జరుగుతోందని జైకర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేశారు.
అయితే, ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పాప తల్లి ఆడపిల్ల పుట్టడంపై కలత చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. "అనన్య (రెండు నెలల పాప) ఈ ఏడాది జనవరిలో జన్మించింది. అయితే, ఆడపిల్ల పుట్టడంపై మానసికంగా ప్రభావితమైందనీ, ఈ విషయంపై ఆమె తన భర్తతో కూడా పలుమార్లు గోడవపడినట్టు తెలిపారు. కాగా, ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
పసికందు మృతి గురించి పోలీసులకు సమాచారం అందించిన ఇరుగుపొరుగు వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాప తల్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపల నుంచి లాక్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె అత్త ఇంటి తలుపు తెరవడానికి ప్రయత్నించింది. లోపల నుంచి లాక్ వేసుకున్న విషయం గుర్తించి.. ఆందోళనకు గురైన ఆమె.. చుట్టుపక్కల వారి సాయం కోసం అరిచింది. స్థానికులు అక్కడి చేరుకుని అద్దాలు పగలగొట్టి గదిలోకి ప్రవేశించారు. లోపల ఆమె కొడుకుతో పాటు అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను (తల్లి) గుర్తించామని తెలిపారు. అయితే, అక్కడ రెండు నెలల పాప అనన్య కనిపించలేదని చెప్పారు.
కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారు కలిసి ఇంటిని మొత్తం వెతికారు. రెండు నెలల చిన్నారి శవమై కనిపించింది. అది కూడా ఇంట్లోని రెండో అంతస్తులోని ఓ గదిలో అత్యంత క్రూరంగా మైక్రోవేవ్ ఓవెన్ (Microwave Oven) లో శవమై చిన్నారి కనిపించింది. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన సమయంలో పిల్లల తండ్రి సమీపంలోని అతను నడుపుతున్న డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో ఉన్నాడని పోలీసులు (P0lice) తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసుకున్నామనీ, విచారణ జరుపుతున్నామని తెలిపారు.