
Srinagar Encounter: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పోలీసులు ఘన విజయం సాధించారు. బెమీనా ప్రాంతంలో పోలీసులు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ క్రమంలో ఓ పోలీసుకు కూడా గాయాలయ్యాయి. ఇది పెద్ద విజయమని కశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ అభివర్ణించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. దొరికిన పత్రాల ప్రకారం.. మృతి చెందిన ఉగ్రవాదిని పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ నివాసి అబ్దుల్లా ఘోరీగా గుర్తించామని చెప్పారు. మరొకరిని అనంతనాగ్ జిల్లాకు చెందిన ఆదిల్ హుస్సేన్ మీర్ అలియాస్ సుఫియాన్‌గా గుర్తించారు. పోలీసు రికార్డుల ప్రకారం.. ఆదిల్ 2018లో వీసాతో వాఘా నుంచి పాకిస్థాన్‌కు వెళ్లాడు.
అమర్‌నాథ్ యాత్ర లక్ష్యంగా
అనంత్‌నాగ్‌లోని పహల్‌గామ్‌లో నివసిస్తున్న ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ మీర్‌తో పాటు ఇద్దరు పాకిస్థానీ లష్కర్ ఉగ్రవాదులను పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లు పంపించారని ఆయన చెప్పారు. వీరంతా 2018 నుంచి పాకిస్థాన్‌లో ఉండి అమర్‌నాథ్ యాత్రపై దాడి చేసే పనిలో ఉన్నారు. ముగ్గురూ చనిపోయారని తెలిపారు. జూన్ 7న, పాకిస్తాన్‌లోని లాహోర్‌లోని హంజాలాలో నివసిస్తున్న ఒక ఉగ్రవాదిని సోపోర్‌లో భద్రతా దళాలు హతమార్చాయి. సోపోర్ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న ఉగ్రవాదుల గుంపు ఇదేనని పోలీసు అధికారి తెలిపారు. వారి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
తీవ్రవాదంపై దాడి
ఈ క్రమంలో కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో ఇప్పటికే 100 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టున్నట్టు తెలిపారు. వీరిలో పాకిస్తాన్‌కు చెందిన ముష్కరులు 63 మంది ఉన్నారని తెలిపారు. జూన్ 12న పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు లష్కరే తోయిబా సభ్యులతో కలుపుకుని.. ఈ ఏడాది ఇప్పటిదాకా పలు ఎన్ కౌంటర్లలో 100 మంది ముష్కరులను ఏరివేసినట్లు తెలిపారు.
సరిహద్దుల్లోకి అక్రమ చొరబాట్లు, రిక్రూట్‌మెంట్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో సరిహద్దులకు సమీపంలో పాక్ ఆర్మీ 12కు పైగా ఉగ్ర శిక్షణ శిబిరాలను తిరిగి ప్రారంభించిందన్నారు. అనేక మంది అమాయకుల హత్యల్లో లష్కర్‌కు కీలకంగా వ్యవహరించిందని , ఈ ఉగ్రవాది హతంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఐజీపీ తెలిపారు.
గతేడాది ఇదే కాలంలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య కంటే ఇది రెట్టింపు అని వారు తెలిపారు. గత సంవత్సరం మొదటి ఐదు నెలల 12 రోజుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో 50 మంది ఉగ్రవాదులు హతమయారని అధికారులు తెలిపారు. ఈ మొత్తం ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల్లో 63 మంది నిషేధిత లష్కరే తోయిబాకు చెందినవారు కాగా, మరో 24 మంది జైషే మహ్మద్ (జేఈఎం)కి చెందిన వారని తెలిపారు.
కాశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రకారం.. ఈ సంవత్సరం ఇప్పటివరకు భద్రతా దళాల చర్యలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో 71 మంది స్థానికులు కాగా 29 మంది పాకిస్థానీలు. గతేడాది ఇదే సమయంలో 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.