గణతంత్ర దినోత్సవానికి ముందు.. కెనడా ఉగ్రవాదికి చెందిన ఇద్దరు సహచరుల అరెస్ట్

By Rajesh KarampooriFirst Published Jan 21, 2023, 2:59 AM IST
Highlights

గణతంత్ర దినోత్సవానికి ముందు.. కెనడా గ్యాంగ్‌స్టర్‌, ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ లాండాకు చెందిన ఇద్దరు సహచరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మరో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీరిని పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన జగ్బీర్ అలియాస్ జగ్గా, గురుప్రీత్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ లాండాకు అనుచరులు . పంజాబ్‌లో ఉగ్రవాద ఘటనకు పథకం పన్నారు. పంజాబ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడిని కూడా వీరు టార్గెట్ చేశారు. ఢిల్లీ పోలీసులు వారిని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారిద్దరిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. 

సమాచారం ప్రకారం.. శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్వీందర్ సింగ్ అలియాస్ సంధు హత్య కేసులో గుర్విందర్ సింగ్, అతని ఇద్దరు సహచరులు సందీప్ సింగ్ , గురుప్రీత్ సింగ్‌లను పంజాబ్ పోలీసులు గత ఏడాది ఆగస్టు 9న అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆర్డీఎక్స్, ఐఈడీ, హ్యాండ్ గ్రెనేడ్, రూ.37 లక్షలు, 634 గ్రాముల హెరాయిన్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పంజాబ్ పోలీసులు సుల్తాన్‌పూర్ లోధి పోలీస్ స్టేషన్‌లో ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. గుర్విందర్‌ సహచరులు జగ్‌బీర్‌, గుర్‌ప్రీత్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఉగ్రకుట్రకు ప్లాన్ 

స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వారిద్దరినీ ఢిల్లీ నుంచి గత వారం అరెస్టు చేసింది. అరెస్టయిన అనుమానిత ఉగ్రవాదులు గత ఏడాది ఆగస్టు 15న పంజాబ్‌లో పెద్ద ఉగ్రవాద ఘటనను నిర్వహించాలనుకుంటున్నట్లు విచారణలో చెప్పారు. పంజాబ్ పోలీసులు ఈ  కుట్ర విఫలం చేయడంతో వారికి మరో టాస్క్ ఇచ్చారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఉగ్రవాద ఘటనలకు పాల్పడాలని కోరారు. పంజాబ్‌లోని ఓ రాజకీయ నాయకుడిని టార్గెట్ చేసినట్టు తెలిపారు. 

పాకిస్థాన్‌తో సంబంధాలు 

నిందితులిద్దరూ పాకిస్థాన్‌లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అదే సమయంలో.. సరిహద్దు అవతల నుండి వారికి ఆయుధాలు అందుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అనుమానితులను విచారించగా.. ఇటీవల వారి హ్యాండ్లర్ పాకిస్తాన్ నుండి డ్రోన్ ద్వారా పంజాబ్‌కు ఆర్‌డిఎక్స్-ఐఇడిలు, హ్యాండ్ గ్రెనేడ్‌లను పంపినట్లు కూడా వెలుగులోకి వచ్చింది.

అయితే వారు పంజాబ్‌లోని పాకిస్తాన్ సరిహద్దులో ఏజెన్సీలకు పట్టుబడ్డారు. గతంలో జహంగీర్‌పురి నుంచి పట్టుబడిన నౌషాద్‌ అలీ, జగ్‌జీత్‌సింగ్‌ అలియాస్‌ జగ్గాతో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా అనే విషయంపై కూడా ప్రస్తుతం అరెస్టయిన నిందితుల నుంచి పోలీసులు ఆరా తీస్తున్నారు.

click me!