
Tamil Nadu Table Tennis Player died: తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల యువ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వదీనదయాళన్ (Vishwa Deenadayalan) దుర్మరణం చెందాడు. గౌహతి నుంచి షిల్లాంగ్ కు కారులో వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగి.. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు ప్రమాదం జరిగినప్పుడు కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం.
సోమవారం నుంచి మేఘాలయ రాష్ట్ర వేదికగా జరగనున్న 83వ జాతీయ, అంతర్రాష్ట్ర టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఆయన తన సహ క్రీడా కారులతో కలిసి గౌహతి నుండి షిల్లాంగ్‌కు ప్రత్యేక వాహానంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
@ విశ్వ దీనదయలన్ వర్ధమాన స్టార్, U-19 జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ ఆదివారం గౌహతి నుండి షిల్లాంగ్‌కు టాక్సీలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు అని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రమాదంలో.. విశ్వ దీన దయాళన్ తో పాటు, డ్రైవర్ కూడా సంఘటన స్థలంలోనే చనిపోయారు. ఇదే కారులో ప్రయాణిస్తున్న మిగతవారికి.. రమేష్ సంతోష్ కుమార్, అబినాష్ ప్రసన్నాజీ శ్రీనివాసన్, కిషోర్ కుమార్ తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరికి చికిత్స చేస్తున్న వైద్యులు వీరి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఘటనలో టాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
విశ్వ చనిపోయినట్లు నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. మేఘాలయ ప్రభుత్వం సహాయంతో నిర్వాహకులు విశ్వ, అతని ముగ్గురు సహచరులను ఆసుపత్రికి తరలించారు. విశ్వ, అనేక జాతీయ ర్యాంకింగ్ టైటిళ్లు, అంతర్జాతీయ పతకాలు సాధించాడు. ఏప్రిల్ 27 నుంచి ఆస్ట్రియాలోని లింజ్‌లో జరిగే WTT యూత్ కంటెండర్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
విశ్వ దీనదయాళన్ మృతి పట్ల మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సంతాపం తెలిపారు. "తమిళనాడు ఆటగాడు దీనదయాళన్ విశ్వ.. మేఘాలయలో జరుగుతున్న 83వ సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి.. షిల్లాంగ్‌కు వెళుతుండగా రి భోయ్ జిల్లాలో ప్రమాదంలో మరణించారని తెలుసుకున్నందుకు విచారంగా ఉంది" అని అతను ట్వీట్ చేశాడు. ఈ ప్రమాదంలో టాక్సీ డ్రైవర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. అలాగే... హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఆయన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.