కేరళలో అర్జెంటినా విజయాన్ని వేడుక చేసుకుంటూనే 16 ఏళ్ల బాలుడి హఠాన్మరణం

By Mahesh KFirst Published Dec 19, 2022, 4:59 PM IST
Highlights

కేరళలో అర్జెంటినా విజయాన్ని వేడుక చేసుకుంటూనే ఓ 16 ఏళ్ల బాలుడు హఠాన్మరణానికి గురయ్యాడు. తన ఫేవరేట్ టీమ్ అర్జెంటినా విజయాన్ని వేడుక చేసుకుంటూ ఉండగానే మధ్యలోనే అతడు నేలకూలిపోయాడు. వెంటనే అతడిని హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, ప్రాణాలు దక్కలేవు.
 

తిరువనంతపురం: ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటినా ఉత్కంఠ విజయాన్ని వేడుక చేసుకుంటూనే కేరళకు చెందిన 16 ఏళ్ల బాలుడు కుప్పకూలిపోయాడు. సంబురాల మధ్యలోనే అతడు నేలకూలిపోయాడు. అతడిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, అతని ప్రాణాలను రక్షించలేకపోయారు. 

కేరళలోని కొల్లాంలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో స్క్రీనింగ్ వేశారు. అర్జెంటినాకు వీరాభిమాని అయిన ఆ 16 ఏళ్ల బాలుడు అక్షయ్ మ్యాచ్ ఆసాంతం ఆసక్తిగా తిలకించాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటికి బయల్దేరి తన ఫేవరేట్ టీమ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒంట్లో కొంత నలతగా అనిపించిన అక్షయ్ కుమార్ సెలబ్రేషన్స్ చేసుకుంటూనే కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఆయన ప్రాణాలు దక్కలేవు. కొల్లాంకు చెందిన అజయ్, సీనాల దంపతుల కుమారుడే అక్షయ్.

Also Read: కేరళలో ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేడుకలు హింసాత్మకం.. వ్యక్తిపై కత్తితో దాడి.. పోలీసులపైనా దాడి

అయితే, అక్షయ్ మరణానికి గల స్పష్టమైన కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. అతని మృతదేహానికి చేసిన అటాప్సీ రిపోర్టు విడుదలైన తర్వాత స్పష్టమైన కారణం వెల్లడి కానుంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నది.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించింది. అర్జెంటినా విజయ వేడుకను అందరూ జరుపుకున్నారు. మన దేశంలో కేరళ ఫుట్‌బాల్‌‌‌ ఫ్యాన్స్‌కు హాట్‌స్పాట్‌ వంటిది. ఇక్కడ ఫుట్ బాల్ అంటే ప్రాణమిస్తారు. మ్యాచ్‌కు ముందే అర్జెంటినా టీమ్ సారథి లియోనల్ మెస్సీ ఫొటోను సముద్రంలోపల ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా స్క్రీన్‌లు ఏర్పాటు చేసి చూశారు. అర్జెంటినా విజయం మెస్సీ ఫ్యాన్స్‌కు అంతులేని సంతోషాన్ని తెచ్చింది. ఈ సంబురాలు పలుచోట్ల హద్దుమీరాయి. కేరళలో ఈ సంబురాలు జరుపుకునే చోటే ఓ వ్యక్తిని కత్తితో పొడిచారు. మరో చోట రోడ్డును దిగ్బంధించి సెలబ్రేట్ చేసుకుంటున్న యువతను వారించబోయిన పోలీసుపై దాడి చేశారు.

click me!