కేంద్రానికి 16 రాజకీయ పార్టీల షాక్... రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ

By Siva KodatiFirst Published Jan 28, 2021, 4:37 PM IST
Highlights

బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా రేపు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 పార్టీలు ప్రకటించాయి. 

బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా రేపు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

ప్రతిపక్షాల అంగీకారం ఏమాత్రం లేకుండా , ఏకపక్షంగా వ్యవసాయ చట్టాలు ఆమోదం చేసుకున్నారని ఆ పార్టీలు ఆరోపించాయి. ఈ కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా దేశంలో ఆహర భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం దేశంలోని 16 ప్రతిపక్ష పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి.

ఈ లిస్ట్‌లో కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్ పార్టీలు ఉన్నాయి.

కొత్త వ్యవసాయ చట్టాలతో ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం నిలిచిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దీని వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

నరేంద్ర మోడీ సర్కార్ ఉభ‌య స‌భ‌ల్లో సాగు చ‌ట్టాల‌ను బ‌ల‌వంతంగా ఆమోదం చేయించిన‌ట్లు ఆజాద్ ఆరోపించారు అందుకే రైతులు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 64 రోజులుగా ఆందోళన చేస్తున్నారని గులాంనబీ ఆజాద్ గుర్తుచేశారు.

ఈ ఆందోళనల్లో 155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రిపబ్లిక్ డే రోజున జరిగిన హింసాత్మక ఘటనలు ఖండిస్తున్నట్లు ఆజాద్ ప్రకటించారు. ఈ దుశ్చర్యల వెనుక అసలు సూత్రదారులెవరో తేల్చాలని 16 పార్టీలు పేర్కొన్నాయి. 

click me!