ఉత్తరప్రదేశ్ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు వరదలు 16 మంది మృతి

By rajesh yFirst Published 3, Sep 2018, 2:08 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల ప్రభావానికి ఇప్పటి వరకు 16 మంది మృతిచెందగా...12 మంది గాయాల పాలయ్యారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసింది. 
 

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల ప్రభావానికి ఇప్పటి వరకు 16 మంది మృతిచెందగా...12 మంది గాయాల పాలయ్యారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసింది. 

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునగడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కేరళ వరదల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ లిఫ్ట్ విధానం ద్వారా వేలాదిమంది ప్రాణాలను కాపాడింది. 

అదే తరహాలో ఉత్తరప్రదేశ్ లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎయిర్ లిఫ్ట్ విధానం ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటుంది. ఇప్పటికే ఝాన్సీ జిల్లా లలిత్ పుర్ లో 14 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

భారీ వర్షాలు, వరదల  కారణంగా ఇప్పటి వరకు 16 మంది చనిపోయినట్లు ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ స్పష్టం చేశారు. షాజన్ పూర్ లో ఆరుగురు, సితాపూర్ జిల్లాలో ముగ్గురు, అరుయ్య మరియు ఆమేథీలో ఇద్దరు చొప్పన చనిపోగా...లక్కీంపుర్ ఖేరీ, రాయబరేలిలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు తెలిపారు. వాటితోపాటు 18 పశువులు చనిపోగా...461 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని స్పస్టం చేశారు. 

సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. షాజన్ పూర్ జిల్లా మెజిస్ట్రేట్ అమ్రిత్ త్రిపాఠీ శంషేర్ పూర్ గ్రామంలో శనివారం కొంతమంది యువకులు గల్లంతయ్యారని తెలిపారు.  మోహిత్, బబ్లూ, అన్మోల్, డబ్లూ పిడుగు ధాటికి మృతిచెందినట్లు తెలిపారు. వారితో పాటు నాభిపూర్ గ్రామానికి చెందిన వందన, సిఖిందర్ పూర్ జిల్లాకు చెందిన అశోక్ పిడుగుపాటికి మృతిచెందినట్లు స్పష్టం చేశారు. 

పిడుగుపాటు మృతికి చెందిన వారి కుటుంబాలను సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ రామ్ జీ మిశ్రా పరామర్శించారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు షాజపూర్ ఆస్పత్రికి తరలించారు. 

వర్షాల ధాటికి వేరు వేరు ప్రాంతాల్లో గల్లంతైన 14 మందిని ఐఏఎఫ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. వారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మోగిఆదిత్యనాథ్ అభినందించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడటంతోపాటు పునరావాస కేంద్రాలకు తరలించడంలో వారు చేస్తున్న కృషిని కొనియాడారు. 
 

Last Updated 9, Sep 2018, 2:03 PM IST