సీఎం అథితిగా కార్యక్రమం.. విందులో బిర్యానీ తిని 145 మందికి అస్వస్థత

By telugu news teamFirst Published Feb 4, 2021, 11:18 AM IST
Highlights

 దాదాపు 8వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా.. వీరందరికీ బిర్యానీ ప్యాకెట్లు పంచిపెట్టారు. అవి తిన్నతర్వాత పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉన్నారు. 
 

బిర్యానీ తిని దాదాపు 145 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అస్వస్థతకు గురైన వారిలో రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉండటం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే...  అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా డిపు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అకాడమిక్ సెషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిరవ్హించారు. దాదాపు 8వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా.. వీరందరికీ బిర్యానీ ప్యాకెట్లు పంచిపెట్టారు. అవి తిన్నతర్వాత పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉన్నారు. 

ఈ సందర్భంగా హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ‘‘కార్యక్రమానికి వచ్చిన వారందరికి బిర్యానీ ప్యాకెట్స్‌ ఇచ్చాం. నేను కూడా అదే బిర్యానీ తిన్నాను. కాసేపటి తర్వాత అనారోగ్యానికి గురయ్యాను. చికిత్స తీసుకున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. నాతో పాటు మరో 145 మంది అస్వస్థతకు గురయ్యారు. అందరిని ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నాం. వీరిలో 28 మందిని డిశ్చార్జ్‌ చేయగా.. మరో 118మందికి చికిత్స కొనసాగుతోంది. అందరూ బాగానే ఉన్నారు’’ అని తెలిపారు. 


ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు కర్బీ ఆంగ్లాంగ్ డిప్యూటీ కమిషనర్ ఎన్‌జీ చంద్ర ధ్వాజా సింఘా తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి మంగళవారం రాత్రి ఆసుపత్రిలో మరణించాడు. అయితే అతను ఫుడ్‌ పాయిజన్‌ వల్ల చనిపోయాడా లేక వేరే కారణమా అనేది ఇంకా తెలియలేదు. అతడు తీసుకున్న ఆహార నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపారు. ఆసుపత్రిలో చేరిన వారు కడుపు నొప్పి, వాంతులతో బాధ పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

click me!