వాయు కాలుష్యం నుండి తమను కాపాాడాలంటూ బెంగళూరుకు చెందిన ఓ 13 ఏళ్ల స్కూల్ విద్యార్థిని ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
బెంగళూరు : మారుతున్న జీవనవిధానం మనిషి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా సౌకర్యాలు, విలాసాల కోసం మనిషి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. దీంతో పర్యావరణం బ్యాలెన్స్ కోల్పోయి మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇలా ఇప్పటికే అభివృద్ది పేరుతో ప్రకృతిని నాశనం చేసి కాంక్రీట్ జంగల్ గా మార్చేసాము. చివరకు పరిస్థితి ఎలా తయారయ్యిందంటే స్వేచ్చగా గాలికూడా పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాలినాణ్యత పూర్తిగా క్షీణించి ప్రజలు ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుండి కాపాడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ఓ 13 ఏళ్ల బెంగళూరు బాలిక లేఖ రాసింది.
దేశ రాజధానికి డిల్లీతో పాటు ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరిగిన విషయం తెలిసిందే. ఇలా కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా గాలి స్వచ్చత క్షీణించింది. సంపూర్ణ ఆరోగ్యంతో వున్నవారే ఈ కాలుష్యపూరిత గాలిని పీల్చి ఇబ్బందిపడుతుంటే శ్వాస సంబంధిత రోగాలతో బాధపడేవారు పడే నరకం ఎలావుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా ఆస్తమా, డస్ట్ ఎలర్జీతో బాధపడుతున్న చిన్నారి బాలిక అస్మి సప్రే బెంగళూరు వాయు కాలుష్యంపై ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
ఊపిరి పీల్చుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి ప్రస్తుతం వుంది... ఇది 13 ఏళ్ళ చిన్నారి అభిప్రాయం కాదు యావత్ దేశప్రజల అభిప్రాయమని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది బెంగళూరు బాలిక. భూమిపై జీవించే ప్రతి జీవికి స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే హక్కు వుంటుంది... కానీ ఇప్పటికే జంతువులు ఆ హక్కును కోల్పోయాయని బాలిక తెలిపింది. కాలుష్యం కారణంగా కోట్లాది మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయని... త్వరలోనే ఈ పరిస్థితి మనుషులకు కూడా వస్తుందని బాలిక ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read అమ్మోనియా గ్యాస్ లీక్.. 12 మందికి తీవ్ర అస్వస్థత..
కరోనా సమయంలో దేశవ్యాప్తంగా షట్ డౌన్ విధించడంతో ప్రజలెవ్వరూ ఇళ్లలోంచి బయటకు రాలేదు... దీంతో వాయుకాలుష్యం చాలా తగ్గిందని బెంగళూరు బాలిక పేర్కొంది. అంటే వాయు కాలుష్యాన్ని తగ్గించడం మన చేతుల్లోనే వుందని అర్ధమవుతోందని తెలిపింది. ఇక డిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. అంటే పాలకులు తలచుకుంటే ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేయవచ్చని తెలుస్తోందన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. అవసరం అయితే పర్యావరణ పరిరక్షణకు కఠిన చట్టాలు తీసుకువచ్చి స్వచ్చమైన గాలిని ప్రజలకు అందించి అరోగ్యకరమైన భారతదేశాన్ని తీర్చిదిద్దాలని బెంగళూరు బాలిక ప్రధాని మోదీని కోరింది.
కేవలం తనకోసమే కాదు దేశంలోని లక్షలాదిమంది చిన్నారుల ఆరోగ్యం కోసం ఈ లేఖ రాస్తున్నట్లు ప్రధానికి తెలిపింది బెంగళూరు చిన్నారి. కాబట్టి తమకు స్వేచ్చగా స్వచ్చమైన గాలి పీల్చుకునే హక్కు కల్పించాలని... అందుకోసం వాయు కాలుష్యం తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరింది. రేపటి తమ భవిష్యత్ అద్భుతంగా వుండేలా చూస్తారని భావిస్తున్నానంటూ బెంగళూరు బాలిక లేఖను ముగించింది.