డీజీపీతో భగవంత్ మన్ భేటీ.. 122 మంది నేత‌ల‌కు సెక్యూరిటీ కట్, పంజాబ్‌‌లో వేడెక్కిన రాజకీయం

Siva Kodati |  
Published : Mar 12, 2022, 09:46 PM IST
డీజీపీతో భగవంత్ మన్ భేటీ.. 122 మంది నేత‌ల‌కు సెక్యూరిటీ కట్, పంజాబ్‌‌లో వేడెక్కిన రాజకీయం

సారాంశం

ఆప్ నేత భగవంత్ సింగ్ మన్ ప్రమాణ స్వీకారానికి ముందే పంజాబ్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డీజీపీతో కాబోయే సీఎం భేటీ తర్వాత.. అక్కడ 122 మంది రాజకీయ నేతలకు సెక్యూరిటీని ఉపసంహరిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.   

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ వంటి దిగ్గజాలను మట్టికరిపించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ పాల‌న ప్రారంభం కాక‌ముందే ప‌లు కీల‌క నిర్ణ‌యాలు జ‌రిగిపోతున్నాయి. పంజాబ్ పోలీసు శాఖ శుక్ర‌వారం నాడు జారీ చేసిన ఆదేశాల ప్ర‌కారం ఆ రాష్ట్రానికి చెందిన 122 మంది కీల‌క రాజ‌కీయ నేత‌ల‌కు భ‌ద్ర‌తను ఎత్తేశారు. ఇలా సెక్యూరిటీ ర‌ద్దు అయిన నేత‌ల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉండ‌టం చర్చనీయాంశమైంది.

ఈ మేర‌కు ఆ రాష్ట్ర అడిష‌న‌ల్ డీజీ (సెక్యూరిటీ) శుక్ర‌వారం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న భగవంత్ మాన్ రాష్ట్ర డీజీపీ వీకే భావ్రాను కలిసిన కొద్దిసేపటికే ఈ ఉత్తర్వులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న భ‌గ‌వంత్ త్వరలో ఇంకెలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటారోనని ప్రజలు, రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నాయి.

ఇకపోతే.. పంజాబ్ (punjab) రాష్ట్రానికి కాబోయే సీఎం భ‌గ‌వంత్ మాన్ (Bhagwant Mann) చండీగఢ్‌ (Chandigarh) లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ (Governor Banwarilal Purohit)ను శనివారం కలిశారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన సంఖ్యా బలం తనకు వుందని భగవంత్ మాన్ లేఖలో తెలిపారు. ఇటీవల ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చారిత్రాత్మకమైన అధికారాన్ని సాధించిన రెండు రోజుల తర్వాత మాన్ గవర్నర్ ఆఫీసుకు చేరుకున్నారు. 

గవర్నర్‌తో భేటీ అనంతరం భ‌గ‌వంత్ మాన్ మీడియాతో మాట్లాడారు. త‌న ప్ర‌మాణ‌స్వీకార షెడ్యూల్ ను ప్ర‌క‌టించారు. ‘‘ నేను గవర్నర్‌ను కలిశాను. మా ఎమ్మెల్యేల నుంచి మద్దతు లేఖను ఆయ‌న‌కు అంద‌జేశాను. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను అందించాను. ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎక్కడ చేప‌ట్టాల‌ని భావిస్తున్నామో చెప్పాల‌ని గ‌వ‌ర్న‌ర్ నన్ను అడిగారు. 

అయితే ఇది మార్చి 16న మధ్యాహ్నం 12.30 గంటలకు ఖట్కర్ కలాన్‌లోని భగత్ సింగ్ (Bhagat Singh) స్వగ్రామంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపాను. ’’ అని భగవంత్ మాన్ అన్నారు. ‘‘ పంజాబ్ రాష్ట్రంలోని అనేక ఇళ్ల నుంచి ప్ర‌జ‌లు ఈ వేడుక‌కు వ‌స్తారు. వారు కూడా భగత్ సింగ్‌కు నివాళులు అర్పిస్తారు. మనకు మంచి మంత్రివర్గం ఉంటుంది, ఇంతకు ముందెన్నడూ తీసుకోని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి, మీరు వేచి ఉండాలి.’’ అని భగవంత్ మాన్ మీడియాతో తెలిపార. 

ఇకపోతే.. మొహాలీ (Mohali)లో శుక్రవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో భగవంత్ మాన్ ను ఆప్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. పంజాబ్ అసెంబ్లీలో  117 సీట్లు ఉన్నాయి. ఇందులో  92 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ విజ‌యం సాధించింది. అయితే పంజాబ్ లో గ‌త 60 ఏళ్ల‌లో ఏ పార్టీకి ఇంత పెద్ద స్థాయిలో మెజారిటీ రాలేదు. 1962లో పంజాబ్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలు కైవ‌సం చేసుకుంది. త‌రువాత అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో స్థానాలు గెలుపొంద‌లేదు. అయితే 1997లో మాత్రం బీజేపీ-అకాలీదళ్ క‌లిసి 93 స్థానాలు సాధించాయి. కానీ ఒంట‌రిగా ఒకే పార్టీకి ఇంతలా మెజారిటీ రావ‌డం 60 ఏళ్ల‌లో ఇదే తొలిసారి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?