పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో (Parliament Monsoon Session) అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో 12 మంది ప్రతిపక్ష సభ్యులను రాజ్యసభ (Rajya Sabha) నుంచి సస్పెండ్ చేశారు. గత సెషన్‌లో గత సెషన్‌లో నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టగా రాజ్యసభ కార్యాలయం తెలిపింది. శీతకాల సమావేశాలు (parliament winter session 2021) మొత్తం వారిని సస్పెండ్ చేస్తున్నట్టుగా వెల్లడించింది. ‘రాజ్యసభ 254వ సెషన్ చివరి రోజు అంటే ఆగస్టు 11న భద్రతా సిబ్బందిపై ప్రవర్తన, ఉద్దేశపూర్వకంగా దాడులు చేశారు. ఈ సభ సభాపతి అధికారాన్ని పూర్తిగా విస్మరించడం, సభ నియమాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం, దుష్ప్రవర్తన, ధిక్కార, హింసాత్మక, వికృత ప్రవర్తన ద్వారా సభ కార్యకలపాలను ఉద్దేశపూర్వకంగా నిరోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది’ అని అధికారిక నోటీసుల్లో పేర్కొన్నారు.
సస్పెండ్ చేయబడిన ఎంపీల జాబితా...
1. ఎలమరం కరీం (సీపీఎం)
2. ఫూలో దేవి నేతమ్ (కాంగ్రెస్)
3. ఛాయా వర్మ (కాంగ్రెస్)
4. రిపున్ బోరా (కాంగ్రెస్)
5. బినోయ్ విశ్వం (సీపీఐ)
6. రాజమణి పటేల్ (కాంగ్రెస్)
7. డోలా సేన్ (టీఎంసీ)
8. శాంత ఛెత్రి (టీఎంసీ)
9. సయ్యద్ నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్)
10. ప్రియాంక చతుర్వేది (శివసేన)
11. అనిల్ దేశాయ్ (శివసేన)
12. అఖిలేష్ ప్రసాద్ సింగ్ (కాంగ్రెస్)
వర్షకాల సమావేశాల్లో ఏం జరిగింది..
పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో పెగసస్ స్పైవేర్ వివాదం, వ్యవసాయ చట్టాలు, పెట్రో ధరలు పెంపు వంటి అంశాలపై విపక్ష పార్టీల సభ్యులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందే ముగిసిపోయాయి. అయితే సమావేశాల చివరి రోజు.. కొత్త సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనపై సభలో చర్చ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు అధికారుల టేబుల్‌పైకి ఎక్కి నల్ల గుడ్డ ఊపుతూ ఫైళ్లను విసిరారు. భద్రతా సిబ్బందిపై కూడా వారు దాడికి పాల్పడ్డారు.
అయితే వర్షకాల సమావేశాల్లో మార్షల్స్‌తో ఎంపీలకు మధ్య తోపులాట జరిగింది. మార్షల్స్ తమతో దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆరోపించారు. అయితే వీటిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. ప్రతిపక్ష సభ్యులే మార్షల్‌ను తోసివేశారని ఆరోపించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన అనంతరం.. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశమయ్యారు. ఉభయసభల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ఇరువురు చర్చించారు. సభల్లో జరిగిన ఘటనలు దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. వెంకయ్యనాయుడు స్పందిస్తూ, కొందరు ఎంపీల ప్రవర్తన మరీ ఆందోళనకరమని పేర్కొన్నారు. సభలో పరిధి దాటిన ప్రవర్తనను ఇకపై సహించబోమని స్పష్టం చేశారు. బాధ్యులైన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.