
పశ్చిమ బెంగాల్ మరోసారి రణరంగమైంది. శనివారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ, టీఎంసీ నేతల మధ్య జరిగిన ఘర్షణల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో పలువురు తృణమూల్ కార్యకర్తలు కూడా వున్నారు. రేజీ నగర్, తుపాన్ గంజాగ్, ఖర్‌గ్రామ్ ప్రాంతాల్లో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా.. దోమ్‌కోల్‌లో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయని తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్‌లో ప్రకటించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను నిలబెట్టేందుకు గాను కేంద్ర బలగాలను మోహరించాలని బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి.
శనివారం పోలింగ్ ప్రారంభమైన నాటి నుంచి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కూచ్‌బెహార్‌లోని ఓ పోలింగ్ కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఆందోళనకారులు.. బ్యాలెట్ పత్రాలను తగులబెట్టారు. రాణినగర్‌లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. డైమండ్ హార్బర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో .. ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఓట్లు వేశారని బీజేపీ ఆరోపించింది. ఘర్షణల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నిషేధాజ్ఞలు జారీ చేశారు. 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70 వేల మంది రాష్ట్ర పోలీసులను మోహరించారు.
ALso Read: హింసాత్మకంగా మారిన బెంగాల్ పంచాయతీ ఎన్నికలు.. ఘర్షణల్లో 9 మంది మృతి, బ్యాలెట్ బాక్సులు దగ్ధం
ఇదిలావుండగా.. పశ్చిమబెంగాల్‌లోని 73,887 పంచాయతీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2.06 లక్షల మంది అభ్యర్ధులు ఈ ఎన్నికల బరిలో వున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మరికొద్దినెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఎంసీ ప్రభంజనం సృష్టించింది.