కాంగ్రెస్ (Congress)సీనియర్ నాయకుడు, ఎంపీ మనీష్ తివారీ (manish tiwari)కూడా బీజేపీ (BJP)లో చేరుతున్నారని వార్తలు జోరందుకున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (kamalnath) దారిలోనే ఆయన కూడా పయనిస్తారని సమాచారం.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మనీష్ తివారీ బీజేపీలో చేరుతున్నారని తెలుస్తోంది. ఆయన బీజేపీతో టచ్ లో ఉన్నారని, పంజాబ్ లోని లుధియానా లోక్ సభ స్థానం నుంచి ఆ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయం రాజకీయ వర్గాల్లో శనివారం నుంచి జోరుగా సర్క్యూలేట్ అవుతోంది. అయితే దీనిపై ఆయన ఆఫీసు ఆదివారం స్పందించింది. ఎంపీ మనీష్ తివారీ బీజేపీలో చేరుతారనే వార్తలు నిరాధారమైనవని తెలిపింది.
‘‘ ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు నిరాధారమైనవి, నిరాధారమైనవి. మనీష్ తివారీ తన నియోజకవర్గంలోనే ఉంటూ అక్కడ అభివృద్ధి పనులు చూసుకుంటున్నారు. నిన్న రాత్రి ఆయన కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో బస చేశారు’’ అని ఆయన ఆఫీసు ఓ ప్రకటన విడదల చేసింది.
అయితే అంతకు ముందు తివారీ బీజేపీతో టచ్ లో ఉన్నట్లు ‘ఇండియా టుడే’ కథనం పేర్కొంది. లూధియానా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల గుర్తుపై పోటీ చేసేందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపుతున్నారు
ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, కుమారుడు నకుల్, ఇతర ఎంపీలు కూడా ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఈ పుకార్లు నిరాధారమైనవని కొట్టిపారేశారు, కమల్ నాథ్ బిజెపిలో చేరతారని తాను కలలో కూడా ఊహించలేదని అన్నారు.
కాంగ్రెస్ నుంచి ఆయన రాజ్యసభ సీటు కోరారని, కానీ ఆ బెర్త్ దక్కకపోవడంతో కమల్ నాథ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. శనివారం కమల్ నాథ్ ఢిల్లీకి చేరుకోవడంతో ఈ ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. అయితే దీనిపై మీడియా ఆయనను ప్రశ్నించింది. తాను బీజేపీలో చేరడం లేదని, అలాంటివి ఏమైనా ఉంటే ముందుగానే తెలియజేస్తానని చెప్పారు.
కాగా.. గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో కమల్ నాథ్ ను మధ్యప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో పట్వారీని నియమించారు. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ 163 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 2018లో 114 స్థానాలకు గాను 66 స్థానాలు మాత్రమే గెలుచుకుంది.