*కల్కి* మూవీ రివ్యూ: ఓర్పు తో చూడాల్సిన ..

By Prashanth M  |  First Published Jun 28, 2019, 2:20 PM IST

ఒక టైమ్ లో హీరోగా రాజశేఖర్ కెరీర్ ముగిసిపోయింది, ఇంక విలన్ వేషాలు వేస్తే బాగుంటుంది అని అంతా ఫిక్సై పోయే సిట్యువేషన్ వచ్చేసింది.  ఆ  సమయంలో గరుడ వేగ చిత్రం వచ్చి రాజశేఖర్ ని నిలబెట్టింది. అందులో రాజశేఖర్ చేసిన ఇన్విస్టిగేషన్ అధికారి పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే రాజశేఖర్  సెకండ్ ఇన్నింగ్స్ కు దారి వేసింది. దాంతో ఆ దారిలోనే ముందుకు వెళ్లి మరోసారి ఇన్విస్టిగేషన్ ఆఫీస్ గా కల్కి పాత్రలో మన ముందుకు వచ్చారు. ఈ సారి అ సినిమాతో అందరిని తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ చేత డైరక్షన్ చేయించటం కలిసొచ్చింది. క్వాలిటీ మేకింగ్ తో క్లవర్ ట్విస్ట్ లతో సినిమా రూపొంది ఉంటుందని అంతా భావించేలా టీజర్, ట్రైలర్ కట్ చేసారు.  మరి సినిమా పెరిగిన అంచనాలకు తగినట్లు ఉందా..రాజశేఖర్ కు ఈ సినిమా మరో గరుడవేగ అవుతుందా, సినిమా కథేంటి,పురాణాల్లో చెప్పబడ్డ కల్కికు ఈ సినిమా కల్కికి ఏమన్నా సంభందం ఉందా  వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 


--సూర్య ప్రకాష్ జోశ్యుల

కథేంటి:

Latest Videos

undefined

1980 బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌ గా ఈ కథ ని మనం చూస్తాం. కొల్లాపూర్ సంస్దానం స్వతంత్ర్య భారతంలో విలీనం అయ్యినప్పుడు ఎలక్షన్స్ వస్తాయి. నర్సప్ప (అశుతోష్ రాణా) కు పోటీగా రాజమాత నిలబడి గెలుస్తుంది. దాంతో ఇది తట్టుకోలేని నర్శనప్ప పెరుమాండ్లు (శత్రు)సాయిం తీసుకుని రాజమహల్ ని తగలెట్టేసి, అధికారం హస్తగతం చేసుకుంటారు.అరాచకాలు మొదలెడతారు. ఇది నర్శప్ప తమ్ముడు  శేఖ‌ర్‌బాబు (సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌)కు గిట్టదు.  దాంతో ఇతనూ కొంతమందికి నచ్చడు. వాళ్లలో ఒకరు శేఖర్ బాబుని దారుణంగా  చెట్టుకు కట్టేసి కాల్చి చంపేస్తారు.

ఎవరు శేఖర్ బాబుని చంపేరన్నది మాత్రం తేలదు. అప్పుడు ఆ కేసుని తేల్చటానికి ఐపీయస్ అధికారి కల్కి (రాజశేఖర్)వస్తాడు. అక్కడనుంచి తనదైన శైలిలో ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఒక్కో చిక్కుముడి ని విప్పుతున్న  ప్రాసెస్ లో అనేక నిజాలు వెలుగులోకి వస్తాయి. కేసులో ఇంకా డెప్త్ కు వెళ్ళేసరికి  మర్డర్ మిస్టరీని మించిన అంశం ఉంటుంది. అదేమిటి...కల్కి ఎలా హ్యాండిల్ చేసాడు. కొల్లాపూర్ రాజమాత నిజంగానే చనిపోయిందా , అసలు అక్కడ బయిటపడ్డ విషయం ఏమిటి..శేఖర్ బాబుని చంపిందెవరు, న‌వ‌భార‌త్ జర్నలిస్ట్ దేవ‌ద‌త్తా (రాహుల్ రామ‌కృష్ణ ) క్యారక్టర్ ఏమిటి,  వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

కథ,కథనం

ఈ సినిమా మొదటినుంచి స్క్రీన్ ప్లే సాగే థ్రిల్లర్ అని ప్రచారం చేసారు. అయితే అంత సీన్ లేదు.  క్లైమాక్స్ ముందు కొన్ని ట్విస్ట్ లు పెట్టుకుని వాటిని జస్టిఫై చేయటానికి మిగతా కథనం అంతా రాసుకున్నారని అర్దమవుతుంది. దాంతో ఫస్టాఫ్ లో అసలు కథే ప్రారంభం కాక ఇంటర్వెల్ దాకా ఏదో ఒకటి జరగకపోతుందా అని  ఓపిక పట్టాల్సి వస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభమైన చాలా సేపు నత్తనడక నడుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ అనే పేరుకి తగినట్లు పరుగెట్టదు.

ప్రశాంత్ వర్మ తన గత చిత్రం అ మాదిరిగానే కూల్ గా ఓ ట్విస్ట్ ఇచ్చి షాక్ ఇవ్వాలనుకున్నారు. కానీ రాజశేఖర్ వంటి హీరోతో, కమర్షియల్ సినిమా చేసినప్పుడు తెరపై ఏమీ జరగకపోతే పరమ బోర్ గా ఉంటుందనే విషయం మర్చిపోయాడు. దాంతో సినిమా చివరికి వచ్చి, ట్విస్ట్ లు బాగున్నాయనిపించినా అప్పటిదాకా విసిగించిన విసుగుని మర్చిపోవటం కష్టమే.  అలాగే హీరోయిన్ అదా శర్మ పాత్రని బలవతంగా ఇరికించారని తెలుస్తుంది. 

టైటిల్ మ్యాటరేంటి

కలియుగాంతములో విష్ణువు ‘కల్కి’ అవతారమెత్తి దుష్టులను శిక్షిస్తాడని హిందూమతం విశ్వసిస్తుంది. దాంతో  ఆ పేరు వినగానే చేతిలో ఖడ్గంతో, తెల్లటి అశ్వం మీద వచ్చి దుష్టశిక్షణ చేస్తాడని ఇమేజ్ మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇప్పుడు అదే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం  పురాణాలకు సంభంధం లేకపోయినా ఆ థీమ్ ని ఏమన్నా రిప్రజెంట్ చేస్తుందా.. రాజశేఖర్  ...కల్కిలా దుష్ణ శిక్షణ చేస్తాడా అనే సందేహం వస్తుంది. అయితే అటువంటిదేమీ లేదు. కేవలం కల్కి అనే టైటిల్ పవర్ ఫుల్ గా ఉంటుందని పెట్టారని అర్దమవుతుంది.  

టెక్నికల్ టీమ్ వర్క్ ఎలా ఉందంటే

దర్శకుడుగా ప్రశాంత్ వర్మ  మేకింగ్, విజువల్ సెన్స్ బాగుంది. ఫైట్స్ కూడా బాగా రొటీన్ కాకుండా కొత్తదనంగా ఉండేలా డిజైన్ చేసారు. అయితే ఐటం సాంగ్ వంటివి చాలా రొటీన్ గా అనిపించాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా  ప్లస్ అయ్యింది. చాలా చోట్ల టెర్రిఫిక్ గా ఉంది. సినిమా మూడ్ ని కరెక్ట్ గా క్రియేట్ చేసింది. కానీ అదే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగా లౌడ్ గా ఉంది.

సినిమాటోగ్రఫి సైతం సూపర్బ్ గా ఉంది. విజువల్ గా గ్రాండియర్ గా ఉంది. స్లో నేరషన్ అనేది ప్రక్కన పెడితే ఎడిటింగ్ కొన్ని ఎపిసోడ్స్ లో సీన్స్  ని హైలెట్ చేసింది.  అలాగే ఎనభైల నాటి వాతావరణం తీసుకురావటంలో ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్ కష్టం కనపడుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల్లో రాజశేఖర్ ఎప్పటిలాగే బాగా చేసారు. అయితే ఆయనలో వయస్సు మీద పడిన ఛాయిలు స్పష్టంగా కనపడుతున్నాయి. మేకప్ పూర్తి స్దాయిలో కవర్ చేయలేకపోయింది. మిగతా వాళ్లలో అశుతోష్ రాణా, శ‌త్రులు రొటీన్ పాత్రలో. సిద్ధు జొన్నలగడ్డ  బాగా చేసారు. 

ఫైనల్ థాట్
ఎంత ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ అయినా మనలోని పేషన్స్ (ఓర్పు) ఏమాత్రం ఉందో ఇన్విస్టిగేట్ చేసే పోగ్రాం పెట్టుకుంటే లా.

రేటింగ్: 2.5/5

తెర ముందు వెనక..
నటీనటులు: రాజశేఖర్‌, అదా శర్మ, నందితా శ్వేత, నాజర్‌, అశుతోష్‌ రాణా, శత్రు, సిద్ధు జొన్నల‌గ‌డ్డ, రాహుల్ రామ‌కృష్ణ, చరణ్‌ దీప్‌, పూజిత పొన్నాడ తదితరులు
సంగీతం: శరవణన్‌ భరద్వాజ్‌
కూర్పు: గౌతమ్‌ నేరుసు
సినిమాటోగ్రఫీ: దాశ‌ర‌థి శివేంద్ర
సమర్పణ: శివానీ, శివాత్మిక ఫిలింస్‌
నిర్మాత: సి. కల్యాణ్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌ వర్మ
విడుదల తేదీ: 28-06-2019

click me!