ఎప్పుడైతే 'పెళ్లి చూపులు' ఘన విజయం సాధించిందో ఆ క్షణమే ...సినిమా పిచ్చి ఉన్న కుర్రాళ్లంతా తమ ఆలోచనలను స్క్రిప్టుగా సర్దటం మొదలెట్టారు. ఓ నిర్మాతను పట్టుకుని సినిమాని సృజించి,తమ ప్రతిభను ప్రపంచ వ్యాప్తం చేయటంలో విజయం సాధిస్తున్నారు. అలా కొత్త నీరు తెలుగు సినిమాని వరదలా ముంచెత్తుతోంది. పాత నీరు ప్రక్కకు వెళ్లిపోతోంది. అయితే కొత్త నీరు ఎప్పుడూ మంచిదే అని చెప్పలేం. కొత్త నీరు వచ్చినప్పుడు వాటిని శుభ్రం చేసి వాడుకోవాలి.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎప్పుడైతే 'పెళ్లి చూపులు' ఘన విజయం సాధించిందో ఆ క్షణమే ...సినిమా పిచ్చి ఉన్న కుర్రాళ్లంతా తమ ఆలోచనలను స్క్రిప్టుగా సర్దటం మొదలెట్టారు. ఓ నిర్మాతను పట్టుకుని సినిమాని సృజించి,తమ ప్రతిభను ప్రపంచ వ్యాప్తం చేయటంలో విజయం సాధిస్తున్నారు. అలా కొత్త నీరు తెలుగు సినిమాని వరదలా ముంచెత్తుతోంది. పాత నీరు ప్రక్కకు వెళ్లిపోతోంది. అయితే కొత్త నీరు ఎప్పుడూ మంచిదే అని చెప్పలేం. కొత్త నీరు వచ్చినప్పుడు వాటిని శుభ్రం చేసి వాడుకోవాలి. అలాగే కొత్త దర్శకుల ఆలోచనలను కూడా. ఈ రోజు ఓ కొత్త దర్శకుడు హుషారు..హుషారుగా తెలుగు తెరపై లాంచ్ అయ్యాడు. చిన్న సినిమాలను పెద్ద సినిమాలుగా మార్చే బెక్కం వేణుగోపాల్ చేతిలో పడటం అతని అదృష్టమే. అయితే ఈ అవకాశాన్ని తన కెరీర్ కు మెట్టుగా వాడుకున్నాడా...ఎలాంటి కథతో సినిమా తీసాడు. యూత్ కు మాత్రమేనా లేక అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్టుని డీల్ చేసాడా వంటి విషయాలను రివ్యూలో చూద్దాం.
కథేంటి
ఈ జనరేషన్ కుర్రాళ్లు ఆర్య (తేజస్ కంచర్ల), చై (అభినవ్), బంటి (తేజ్ కూరపాటి), ధ్రువ్ (దినేష్ తేజ్) . చిననాటి స్నేహితులు అయిన వీళ్లు పెద్దయ్యినా విడిపోని క్లోజ్ ఫ్రెండ్స్ . చదువు విషయం ప్రక్కన పెట్టి బీర్లు కొట్టడం, పార్టీలు, పబ్ లు అంటూ హ్యాపిగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటారు. ఈ క్రమంలో వాళ్లలో ఇద్దరికి అమ్మాయిలు కూడా సెట్ అవుతారు. అయితే అందులో చై గర్ల్ ఫ్రెండ్...అతన్ని యుఎస్ రమ్మని పట్టుబడుతుంది. అతను ఒప్పుకోడు. దానితో బ్రేకప్ అంటుంది. ఆ డిప్రెషన్ లో అతను ఓ యాక్సిడెంట్ చేస్తాడు. ట్రీట్మెంట్ కోసం హాస్పటిల్ కు వెళ్తే లైఫ్ ని మలుపు తిప్పే ఓ ట్విస్ట్ పడుతుంది. చై కు కాన్సర్ అని తెలుస్తుంది. వైద్యానికి దాదాపు ముప్పై లక్షలు దాకా ఖర్చు అవుతుంది. ఏం చేయాలి...ఏదో ఒకటి చేయాలి..అని ఆలోచిస్తూంటే వారికి ఓ ఐడియా వస్తుంది. ఆ ఐడియాతో స్నేహితుడుని రక్షించుకుందాం అనే ఆలోచన వాళ్లను ఏ ఇబ్బందులకు గురి చేసింది. ఇంతకీ ఏమిటా ఐడియా...అనేది తెరపైన చూస్తేనే బాగుంటుంది. అలాగే ఈ సినిమాలో హైలెట్ గా నిలిచిన రాహుల్ రామకృష్ణ పాత్ర ఏమిటనేది సైతం తెలియాలన్నా సినిమా చూడండి.
టైటిల్ కు తగ్గట్లే ఉందా...
నిజానికి ఇలాంటి హైకాన్సెప్టు కథలు హాలీవుడ్ లో తెరకెక్కుతూంటాయి. సింగిల్ థ్రెడ్ తో సబ్ ప్లాట్స్ పెద్దగా లేకుండా నడిచే ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లేనే ప్రాణం. అదే ఈ సినిమాకు మైనస్ గా మారిందని చెప్పాలి. ఫస్టాఫ్ బాగానే ఉన్నా..కథ ఎక్కడా మొదలైనట్లు అనిపించదు. ఇంటర్వెల్ దాకా కథ కాంప్లిక్ట్ లో పడదు. సెంటర్ పాయింట్ అయిన ...హీరోలు తమ సమస్యనుంచి బయిటపడేందుకు చేసే ఇన్వెక్షన్ అనేది ..సెకండాఫ్ సగంలో కానీ ప్రారంభం కాదు. దాంతో కథ అక్కడదాకా మొదలైనట్లు అనిపించదు. పోనీ అప్పుడైనా కథలో కాంప్లిక్ట్ ఉంటుందా అంటే పెద్దగా ఉండదు. సోసోగా వెళ్లిపోతుంది.
బ్రేకప్ అనే సమస్య.. ఆ తర్వాత కాన్సర్ అనే సమస్య..ఆ తర్వాత కాన్సర్ చికిత్స కోసం డబ్బులు సంపాదించాలనే సమస్య..ఆ తర్వాత ఆ డబ్బులు కోసం చేసే ప్రయత్నం అనే సమస్య...ఇలా లింక్ సర్వీస్ గా కథ నడుస్తుంది కానీ ఒకే సమస్యను హైలెట్ చేస్తూ కథనం నడవదు...అదే ఈ సినిమా ఎంత బాగున్నా..అంతగా బాగోలేదనిపించటానికి కారణం.
ఇక ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లే ఉందా అంటే చాలా భాగం వరకూ అనే చెప్పాలి. సెకండాఫ్ స్టార్టైన కొద్దిసేపటికి రిపీట్ సీన్స్ ఎదురవుతూ విసిగించినా...పెద్దగా కాంప్లిక్ లేక బోర్ కొట్టినా దర్శకుడు తనదైన ఫన్ తో లాగటానికి ప్రయత్నించాడు. అదే ఈ దర్శకుడుకి ప్లస్ పాయింట్..ఈ సినిమాకు కలిసొచ్చిన విషయం. అయితే కొంత అతి కూడా ఇదే పాత్రకు చొప్పించారు.
ఊపొచ్చింది ఇక్కడే
సాదాగా నడిచిపోతున్న సినిమాకు రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ ఎంట్రీ కిక్ ఇచ్చింది.ఫెరఫెక్ట్ టైమ్ లో ఫెరఫెక్ట్ టైమింగ్ తో ఈ క్యారక్టర్ ని ప్రవేశపెట్టారు. ఫ్రస్టేటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పిచ్చ అసహనంతో ఊగిపోయే క్యారెక్టర్ ఇది. అలాగే పిచాక్ సాంగ్ సైతం సినిమాకు హుషారు తెచ్చిపెట్టింది. ప్రీ క్లైమాక్స్ ఈ సినిమా జానర్ కు సరిపడని సెంటిమెంట్ తో సాగిందనిపించింది.
టెక్నికల్ గా ..
కొత్త డైరక్టర్ పాత ఫార్ములాతో వచ్చినా ఫన్ ని నమ్ముకోవటం ప్లస్ అయ్యింది. అలాగే టెక్నీషియన్స్ నుంచి మంచి అవుట్ పుట్ తీసుకోవటంలో డైరక్టర్ చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. అలాగే ఈ సినిమాకు అందరికన్నా బాగా హెల్ప్ అయ్యింది రాధన్ మ్యూజిక్. ‘ఉండిపోరాదే’ సాంగ్ యూత్ లోకి బాగా వెళ్లిపోయింది. అతనికి మంచి భవిష్యత్ ఉందని అర్దమవుతోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్,కెమెరా వర్క్ కూడా బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చిన్న సినిమాకు సరిపడా ఉన్నాయి. కొత్త కుర్రాళ్లు తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్‌లు ఎక్కడా వంక పెట్టలేని విథంగా కథకు కలిసొచ్చారు.
ఫైనల్ ధాట్
చిన్న సినిమాలు ఎంత ఫన్ తో నడిచినా ...స్క్రిప్టే సినిమాని నిలబెట్టే అంశం. ఆ విషయంలో పెద్ద సినిమాలకు పోటీ ఇవ్వగలిగితేనే పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లు వస్తాయి.
రేటింగ్ : 2.5/5
ఎవరెవరు
నటీనటులు: రాహుల్ రామకృష్ణ, తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి, దినేష్ తేజ్, అభినవ్ మేడిశెట్టి, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్
కూర్పు: విజయ్ వర్ధన్ కావూరి
ఛాయాగ్రహణం: రాజ్‌తోట
సంగీతం: రథన్
కళ: మరేష్ శివన్
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, రియాజ్
రచన, దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి
సంస్థ: లక్కీ మీడియా
విడుదల: 14-12-2018