
2024లో విడుదలై భారీ విజయం సాధించిన "కల్కి 2898 ఏ.డి" చిత్రం తాజాగా ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజన్‌రీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ సినిమా పాన్-ఇండియా స్థాయిలో రూపొందించబడింది. ఇందులో ప్రబాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనె తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
చిత్రం విడుదలై ఏడాది పూర్తైన సందర్భంలో వైజయంతి మూవీస్ చేసిన ఒక పోస్టును అమీతాబ్ బచ్చన్ తన ఎక్స్ ( ట్విట్టర్) ఖాతాలో రీపోస్టు చేశారు. ఈ సందర్భంగా బిగ్ బి భావోద్వేగంగా స్పందిస్తూ, "ఇంత గొప్ప చిత్రంలో భాగంగా ఉండటం నాకు గౌరవంగా ఉంది. వైజయంతి ఫిలింస్, ఈ చిత్రంలో భాగమైన పెద్దవారు ఇచ్చిన ఆశీస్సులు చిరస్మరణీయంగా ఉంటాయి. వారు మళ్లీ ఎప్పుడు అడిగితే అప్పుడు ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ ట్వీట్ చేశారు.
అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ తో.. కల్కి సీక్వెల్ కల్కి 2 పై ఊహాగానాలు పెరిగాయి. తాను కల్కి 2లో భాగం కాబోతున్నట్లు అమితాబ్ బచ్చన్ హింట్ ఇచ్చారు. వాస్తవానికి ఆయన కల్కి 2లో నటించడం అనివార్యం. ఎందుకంటే కల్కి 2898 ఎడి చిత్రం ఆ విధంగా ఎండ్ అయింది. ప్రభాస్ కర్ణుడి పాత్ర గురించి, అమితాబ్ అశ్వథామ పాత్ర గురించి చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. వాటన్నింటికి సీక్వెల్ లో సమాధానం రావాల్సి ఉంది.
అయితే, ఆయన ట్వీట్ మరో కారణంగా అభిమానుల ట్రోలింగ్‌కు గురైంది. సాధారణంగా అమీతాబ్ తన ప్రతి ట్వీట్‌కు ఒక నంబర్ ను జత చేస్తుంటారు. ఈసారి మాత్రం ట్వీట్ నెంబర్ లేకపోవడంతో అభిమానులు కామెంట్స్ విభాగంలో సందేహాలు వ్యక్తం చేశారు. కొందరు ఆయనకు ట్వీట్ తొలగించి తిరిగి నంబర్‌తో పోస్టు చేయాలని సలహాలు కూడా ఇచ్చారు.
"కల్కి 2898 ఎడి" చిత్రం నాగ్ అశ్విన్ కెరీర్ లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టుగా నిలిచింది. ఇది "కల్కి సినిమాటిక్ యూనివర్స్"కి తొలి భాగంగా తెరకెక్కింది. భవిష్యత్తులో ప్రపంచం ఎలా మారబోతోంది అనే విషయాన్ని సరికొత్త వరల్డ్ క్రియేట్ చేసి నాగ్ అశ్విన్ అద్భుతంగా చూపించారు. పురాణాలకి సంబంధించిన మహాభారతంతో కథని ప్రారంభించి ఆ తర్వాత సరికొత్త ప్రపంచంలోకి కథని తీసుకెళ్లి.. క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణుడిగా చూపించిన విధానం ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
విడుదల తర్వాత కల్కి 2898 ఎడి 2024లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే.కల్కి 2 చిత్ర స్క్రిప్ట్ పై ప్రస్తుతం నాగ్ అశ్విన్ వర్క్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక చిత్రంలో, అదే విధంగా మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ మూవీలో నటిస్తున్నారు. త్వరలో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రం కూడా ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో కల్కి 2 ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు.