కాంగ్రెసుతో దోస్తీకి కేసీఆర్ రాయబారాలు: జగన్ తోనూ సంప్రదింపులు

By telugu teamFirst Published May 10, 2019, 11:18 AM IST
Highlights

కాంగ్రెసుతో దోస్తీకి కేసీఆర్ రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత టీఆర్‌ఎస్ కు చెందిన పార్లమెంటు సభ్యుడొకరుకాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నేతతో సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వ్యూహం మార్చి కాంగ్రెసుతో దోస్తీకి ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ముఖ్య నేత ఒకరు కాంగ్రెసు ముఖ్య నేతతో సమావేశమై రహస్య చర్చలు సాగించినట్లు సమాచారం. ఈ మేరకు హిందూస్తాన్ టైమ్స్ ఓ వార్తాకథనం ప్రచురితమైంది.

కాంగ్రెసుతో దోస్తీకి కేసీఆర్ రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత టీఆర్‌ఎస్ కు చెందిన పార్లమెంటు సభ్యుడొకరుకాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నేతతో సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రెండు పార్టీలకు చెందిన నేతలూ ఈ భేటీని ధ్రువీకరించినట్టు హిందుస్థాన్‌ టైమ్స్‌ తన కథనంలో స్పష్టం చేసింది. 

ఎన్నికల తర్వాత కలిసి పనిచేసే అవకాశాలపై ఆ భేటీలో చర్చించినట్టు టీఆర్‌ఎస్‌ నేతను ఉటంకిస్తూ ఆ వార్తాకథనాన్ని రాసింది. కేంద్రంలో ఏర్పడే ఏ కూటమి అయినా జాతీయ పార్టీ మద్దతులేనిదే మనుగడ సాగించలేదని, 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ తరహాలో విఫలమయ్యే అవకాశం ఉందనే అంతర్గత సమాచారం ఆధారంగానే టీఆర్‌ఎస్‌ వైఖరిలో మార్పు వచ్చినట్టు రాసింది

నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్‌ పార్టీ యూపీఏ భాగస్వామ్య పక్షాలతో, అందులో లేని ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాను ప్రధాని రేసులో లేనని చంద్రబాబు ప్రకటించిన తర్వాతే టీఆర్ఎస్, కాంగ్రెసు పార్టీ నేతల మధ్య చర్చలు నడిచాయి. 

కేసీఆర్‌ ఈ మేరకు జగన్‌తో కూడా రహస్యంగా చర్చలు జరుపుతున్నారని సమాచారం. చంద్రబాబు ప్రధాని రేసులో లేనని ప్రకటించడం వల్ల జగన్‌ కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు సులువవుతాయని ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ తన కథనంలో విశ్లేషించింది. 

కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్‌ గతవారం ఫోన్‌ చేసినప్పుడే ఆయన కాంగ్రెస్ తో దోస్తీకి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. జేడీఎస్ కు చెందిన ఒక నేత మాత్రం కుమారస్వామి జోక్యం చేసుకోబోరని తేల్చిచెప్పేశారు. 

click me!