చంద్రబాబు వ్యూహానికి మమతా బ్రేక్: 21వ తేదీ భేటీకి నో

By telugu teamFirst Published May 11, 2019, 6:52 AM IST
Highlights

విపక్షాలన్నీ కలిసి ఓ ఉమ్మడి వ్యూహాన్ని రచించుకుని ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి ముందస్తు కార్యాచరణకు నడుం బిగించాలనేది రాహుల్, చంద్రబాబుల వ్యూహంగా కనిపించింది. అయితే, ఈ నెల 21వ తేదీన సమావేశాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించారు.

హైదరాబాద్: ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చల్లో ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యూహానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బ్రేకులు వేశారు. లోకసభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే ఈ నెల 21వ తేదీన విపక్షాల సమావేశం నిర్వహించాలని చంద్రబాబు తలపెట్టారు. 

విపక్షాలన్నీ కలిసి ఓ ఉమ్మడి వ్యూహాన్ని రచించుకుని ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి ముందస్తు కార్యాచరణకు నడుం బిగించాలనేది రాహుల్, చంద్రబాబుల వ్యూహంగా కనిపించింది. అయితే, ఈ నెల 21వ తేదీన సమావేశాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబుతో మమతా ఆ విషయం చెప్పారు. 

గురువారం రాత్రి ఇరువురు ముఖ్యమంత్రులు ముఖాముఖి చర్చలు జరిపారు. ఇరువురు నేతలు 45 నిమిషాల పాటు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడినట్లు టీడీపి నేత కంభంపాటి రామ్మోహన్ రావు చెప్పారు. ఫలితాలు వెలువడడానికి రెండు రోజుల ముందు ప్రతిపక్షాల సమావేశం జరగాలనే ప్రతిపాదనపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. 

ఈవీఎంల భద్రతపై దృష్టి సారించాల్సి ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేయాలని మమతా బెనర్జీ చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం. ఇతర పార్టీలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ప్రధాని పీఠంపై కన్నేసిన మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా 21వ తేదీ సమావేశాన్ని వ్యతిరేకించినట్లు ప్రచారం జరుగుతోంది.

click me!