
న్యూఢిల్లీ: త్రిపుర (తూర్పు) పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఈ నెల 18వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ను ఈ నెల 23వ తేదీకి మార్చారు. శాంతి భద్రతల సమస్య కారణంగా ఈ పోలింగ్ తేదీ మార్చినట్టుగా ఈసీ ప్రకటించింది.
తొలుత ప్రకటించిన సమయంలో రెండో విడతలోనే ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు ఎన్నికల పరిశీలకులు ఏప్రిల్ 18వ తేదీన ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని భావించారు. దీంతో ఈ నెల 18వ తేదీకి బదులుగా ఈ నెల 23వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని తలపెట్టారు.
ఇంటలిజెన్స్ నివేదిలక ప్రకారంగా పోలింగ్ నిర్వహణకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని నివేదికలు రావడంతో ఈ నెల 23 తేదీన ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఈసీ అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలో తొలి దశలో ఎన్నికలు జరిగిన 460 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
త్రిపుర(పశ్చిమ) ఎంపీ స్థానానికి ఈ నెల 11వ తేదీన జరిగిన పోలింగ్‌లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ చోటు చేసుకొందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.