హేమా‌హేమీలు: పురంధేశ్వరీ పోటీతో హీటెక్కిన విశాఖ

By narsimha lodeFirst Published Mar 22, 2019, 3:28 PM IST
Highlights

విశాఖ‌పట్టణం ఎంపీ నియోజకవర్గం నుండి  హేమా హేమీలు పోటీ చేస్తున్నారు. దీంతో  ఈ సీటులో ప్రజలు ఎవరిని గెలిపిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 

విశాఖపట్టణం: విశాఖ‌పట్టణం ఎంపీ నియోజకవర్గం నుండి  హేమా హేమీలు పోటీ చేస్తున్నారు. దీంతో  ఈ సీటులో ప్రజలు ఎవరిని గెలిపిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

విశాఖపట్టణం ఎంపీ సీటు నుండి టీడీపీ అభ్యర్ధిగా ఎంవీవీఎస్ మూర్తి మనమడు, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నాడు. విశాఖ ఎంపీ స్థానం నుండి ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ అభ్యర్ధిగా బరిలో దిగారు.

ఇక మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ ఇదే స్థానం నుండి  బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి పురంధేశ్వరీ కాంగ్రెస్ అభ్యర్ధిగా   పోటీ చేసి విజయం సాధించారు.2014 ముందు కేంద్ర మంత్రిగా పురంధేశ్వరీ ఉన్న సమయంలో ఇదే పార్లమెంట్ స్థానం నుండి  ఆమె ప్రాతినిథ్యం వహించారు.

మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుండి విశాఖ ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. పలువురు కీలకమైన నేతలు ఈ స్థానం నుండి పోటీ చేస్తున్నందున ఈ స్థానంపై  పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు.

బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ రాజకీయాలకు కొత్త. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడ రాజకీయాలకు కొత్త. శ్రీభరత్ తాత ఎంవీవీఎస్ మూర్తి పలు దఫాలు ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా ఎంపీగా విజయం సాధించాడు.

మూర్తి వారసత్వాన్ని కొనసాగించేందుకుగాను శ్రీభరత్ రాజకీయాల్లోకి వచ్చాడు. మామా బాలకృష్ణ చొరవతో పాటు విశాఖ జిల్లాకు చెందిన నేతలు కూడ శ్రీభరత్‌కు టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబును కోరడంతో ఆయనకు టిక్కెట్టు దక్కింది.

ఇదిలా ఉంటే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్‌కు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీకి మధ్య బంధుత్వం ఉంది. బాలకృష్ణకు పురంధేశ్వరీ సోదరి. వీరిద్దరి మధ్య బంధుత్వాలు ఉన్నప్పటికీ వేర్వేరు పార్టీల నుండి విశాఖ ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. మరోవైపు పురందేశ్వరీ భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్ధిగా ప్రకాశం జిల్లా పర్చూరు నుండి పోటీ చేస్తున్నారు.

రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచననను విరమించుకొన్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. తొలుత లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. ఈ సమయంలో వైసీపీ నేతలు జేడీ లక్ష్మీనారాయణతో పాటు టీడీపీపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. దీంతో జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. అయితే తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నం చేయలేదని లక్ష్మీనారాయణ మీడియాకు చెప్పారు.

జనసేనలో చేరిన  వెంటనే  మాజీ జేడీ లక్ష్మీనారాయణకు విశాఖ ఎంపీ టిక్కెట్టును కేటాయించారు పవన్ కళ్యాణ్.  వైసీపీ నుండి బరిలోకి దిగిన ఎంవీవీ సత్యనారాయణ కూడ కొత్త అభ్యర్ధి.  

విశాఖ పట్టణం పార్లమెంట్ స్థానంలో  ఇప్పటివరకు ఎక్కువగా స్థానికేతరులే విజయం సాధించారు. ఇదే స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించిన పురంధేశ్వరీ ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా  ఈ స్థానం నుండి పోటీకి దిగుతోంది. గతంలో తాను కేంద్ర మంత్రిగా, ఎంపీగా పనిచేసిన అనుభవం ఆమెకు ఈ ఎన్నికల్లో కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని  విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తట్టుకొని ఆమె ప్రజల మద్దతు కూడగడితే రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది.  ఏపీకి అన్యాయం చేయడంలో బీజేపీది ప్రముఖ పాత్ర అంటూ టీడీపీ నేతలు తీవ్రంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం నామమాత్రంగానే ఉండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. పాత పరిచయాలను తనకు అనుకూలంగా మలుచుకొంటే ఆమెకు  ప్రయోజనం దక్కే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు.

జనసేన ప్రధానంగా పవన్ కళ్యాణ్ అభిమానులపై ఆధారపడుతోంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ  లెఫ్ట్ పార్టీలతో పొత్తుతో పోటీ చేస్తోంది. విశాఖపట్టణంలో పారిశ్రామిక వాడ. ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణకు లెఫ్ట్ పార్టీల పొత్తు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది.ఇక ఈ ప్రాంతంలో కాపు సామాజిక వర్గం కూడ జనసేనకు కలిసివచ్చే అకవాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

టీడీపీకి చెందిన శ్రీభరత్ పార్టీ నాయకులపై ఆధారపడాల్సి ఉంటుంది. రాజకీయాలకు కొత్త కావడంతో ఆయన ఈ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలపై ఆధారపడాల్సిన పరిస్థితులు లేకపోలేదు. ప్రచారం ఎలా నిర్వహించాలి... పోల్ మేనేజ్ మెంట్ ఎలా చేసుకోవాలనే విషయాలపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.  వైసీపీ అభ్యర్థి కూడ కొత్తవాడే. ఇతను కూడ పార్టీపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితులు లేకపోలేదు.

గత ఎన్నికల్లో  ఈ స్థానం నుండి వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోటీ చేశారు. విజయమ్మపై బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు టీడీపీ మద్దతుతో పోటీ చేసి విజయం సాధించారు. విజయమ్మ ఓటమి పాలు కావడం వైసీపీకి  ఆ ఎన్నికల్లో  తీరని దెబ్బే. 

విశాఖకు రైల్వే జోన్ అంశం కూడ  ఈ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వం రైల్వేజోన్ ను ప్రకటించింది. అయితే రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు లేకుండా జోన్ ప్రకటించడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. బీజేపీ నేతలు విశాఖ రైల్వే జోన్‌‌ను తమకు అనుకూలంగా ప్రచారం చేసుకొనే అవకాశం ఉంది.

అయితే విపక్షాలు మాత్రం రైల్వే జోన్ తో పాటు ప్రత్యేక హోదా విషయమై బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయనున్నాయి. అయితే విశాఖ ప్రజలు ఎవరిని ఆదరిస్తారోననేది మే 23న తేలనుంది.


 

click me!
Last Updated Mar 25, 2019, 3:52 PM IST
click me!