బిగ్ న్యూస్: వారణాసిలో మోడీపై ప్రియాంక గాంధీ పోటీ

By telugu teamFirst Published Apr 13, 2019, 4:22 PM IST
Highlights

 మోడీపై పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీ అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. 

న్యూఢిల్లీ: జాతీయ మీడియాలో శనివారం బిగ్ న్యూస్ వెలుగు చూసింది. వారణాసిలో ప్రధాని నరేంద్రమోడీతో కాంగ్రెసు నేత ప్రియాంక గాంధీ వాద్రా తలపడబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మోడీ వారణాసి నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 

తీవ్రమైన పరిశీలన తర్వాత మోడీపై పోటీ చేసేందుకు ప్రియాంక గాంధీ అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాయబరేలీ నుంచి గానీ అమేథీ నుంచి గానీ పోటీ చేయాలని పార్టీ మద్దతుదారులు మార్చిలో ఆమెను కోరారు. అయితే, వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదని ఆమె నవ్వుతూ అన్నారు. పార్టీ కోరితే తాను లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రియాంక గాంధీ ఇంతకు ముందు అన్నారు. 

గత ఎన్నికల్లో ప్రధాని మోడీ 3,71,784 ఓట్ల తేడాతో వారణాసి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై విజయం సాధించారు.  ప్రియాంక గాంధీ మార్చిలో మూడు రోజుల పాటు ప్రయాగ్ రాజ్ నుంచి వారణాసి వరకు గంగా యాత్ర చేపట్టారు. సాంచీ బాత్ ప్రియాంక కే సాత్ అనే అంశంపై ఆ యాత్ర దృష్టి కేంద్రీకరించింది. 

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

click me!