వారణాసిలో మోడీపై తెలంగాణ రైతుల పోటీ: కవిత హస్తం

By telugu teamFirst Published Apr 25, 2019, 10:44 AM IST
Highlights

వారణాసిలో రైతులు పెద్ద యెత్తున నామినేషన్లు వేయాలని నిర్ణయించుకోవడం వెనక కల్వకుంట్ల కవిత హస్తం ఉందని నిజామాబాద్ బిజెపి లోకసభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపించారు. 

హైదరాబాద్‌: తమ సమస్యల పరిష్కారం కోసం నిజామబాద్ జిల్లాకు చెందిన రైతులు వినూత్నమైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పోటీ చేసిన నిజామాబాద్ లోకసభ సీటు నుంచి పెద్ద సంఖ్యలో పసుపు రైతులు పోటీకి దిగారు. అదే రీతిలో ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో కూడా వారు నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. 

వారణాసిలో రైతులు పెద్ద యెత్తున నామినేషన్లు వేయాలని నిర్ణయించుకోవడం వెనక కల్వకుంట్ల కవిత హస్తం ఉందని నిజామాబాద్ బిజెపి లోకసభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపించారు. తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కవిత విఫలమయ్యారని, దాంతో నిజామాబాద్ రైతులను ఆమె రెచ్చగొడుతున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 

జిల్లాకు కవిత చేసిందేమీ లేదని, జలాలను మళ్లిస్తున్నా ఆమె పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న రైతులందరూ నామినేషన్లు వేయడానికి వారణాసి బయలుదేరినట్లు ఆయన తెలిపారు. నామినేషన్లు ఉపసంహరించుకుంటే రూ. 10 లక్షల జరిమానా చెల్లించాలని ప్రతి గ్రామంలో తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. 

click me!