ప్రముఖ రచయిత డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు రచించిన వ్యాసాల సంకలనం ‘వ్యాస గవాక్షం’ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాదులోని రవీంద్రభారతిలో అట్టహాసంగా జరిగింది.
హైదరాబాద్: విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో గ్రంథాల పాత్ర ప్రధానమైందని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షులు డా. అయాచితం శ్రీధర్ అన్నారు. రచయితలు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ప్రముఖ రచయిత డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు రచించిన వ్యాసాల సంకలనం ‘వ్యాస గవాక్షం’ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు తాజా పరిణామాలతో రికార్డు చేయడంలో రచయిత రాయారావు సూర్యప్రకాశ్ రావు ముందు వరుసలో ఉంటారని ప్రశంసించారు. వర్తమాన సాహితీ ప్రపంచంలో వ్యాస మహర్షిగా సూర్యప్రకాశ్ రావును చెప్పుకోవచ్చని ఆయాచితం శ్రీధర్ కొనియాడారు.
undefined
రాయారావు సూర్యప్రకాశ్ రావు విస్తృత సమాచారాన్ని కలిగి ఉండడమే కాకుండా పఠనీయ లక్షణాన్ని కలిగిఉంటాడని గ్రంథాన్ని ఆవిష్కరించిన తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి అభిప్రాయపడ్డారు. చాలామందికి తెలియని అనేక అంశాలు ‘వ్యాస గవాక్షం’ గ్రంథంలో పొందుపర్చారని ఆయన పేర్కొన్నారు. లోతైన సమాచారం, విశ్లేషణ, స్పష్టమైన వాక్య నిర్మాణం పాఠకుడిని చదివిస్తాయని ఆయన అన్నారు. కాంపిటీటివ్ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే సమాచారం ఈ గ్రంథంలో ఉందని డా. సిధారెడ్డి చెప్పారు.
read more సూర్యప్రకాశ్ రావు 'వ్యాస గవాక్షం', హనీఫ్ 'నాది దుఃఖం వీడని దేశం' పుస్తకావిష్కరణకు సర్వ సిద్దం
వ్యాసాలతో పాటు కవిత్వం, అనువాదం వంటి ఇతర ప్రక్రియల్లోనూ రాయారావు సూర్యప్రకాశ్ రావు రాణిస్తున్నారని ఆకాశవాణి వివిధభారతి వాణిజ్య ప్రసార విభాగ పూర్వ అధిపతి చెన్నూరి సీతారాంబాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ ను సులభ గ్రాహ్యమయ్యే విధంగా తెలుగులో సూర్యప్రకాశ్ రావు అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు.
వ్యాసాలను ఆసక్తికరంగా మలచడంలో రాయారావు సూర్యప్రకాశ్ రావు ప్రత్యేకత కనబరుస్తారని సభకు అధ్యక్షత వహించిన తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు, ప్రముఖ కవి డా. చెన్నకేశవరెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యాస శీర్షికలను కూడా విభిన్నంగా పెట్టడం ఈ వ్యాసాలలో కనబడుతుందని ఆయన చెప్పారు.
రచయితలకు సామాజిక దృక్కోణం తప్పనిసరిగా ఉండవలసిన లక్షణమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్య పూర్వ అదనపు సంచాలకులు పి. లక్ష్మారెడ్డి అన్నారు. ఈ లక్షణం సూర్యప్రకాశ్ వ్యాసాలలో కనబడుతుందని ఆయన పేర్కొన్నారు. జిజ్ఞాసువులైన పాఠకులకు ఈ గ్రంథం చాలా ఉపకరిస్తుందని ఆయన చెప్పారు. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు అవసరమైన సమాచారాన్ని ఈ గ్రంథం ద్వారా అందజేశారని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
read more మౌనంగా ఉండలేక పాటైనా కవిత్వం : ఇప్పుడొక పాట కావాలి
తాను పాఠశాల దశ నుండే సృజనాత్మక రచనలు చేస్తున్నానని ఈ సమావేశంలో ప్రసంగించిన ‘దర్పణం’ సాహిత్యవేదిక అధ్యక్షులు డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు అన్నారు. సాహిత్యంలో విశేష కృషి చేసిన సాహితీ మూర్తుల రచనల విశ్లేషణ ‘వ్యాస గవాక్షం’లో కన్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.
‘దర్పణం’ సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి డా. చీదెళ్ల సీతాలక్ష్మి సమావేశకర్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాహిత్యవేదిక సభ్యులు రామకృష్ణ చంద్రమౌళి, గుండం మోహన్ రెడ్డి, నక్క హరికృష్ణ, సంతోష్, డా. కావూరి శ్రీనివాస్, సత్యమూర్తి, నారాయణరావు, అరుణజ్యోతి తదితరులు కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములుగా పాల్గొన్నారు. ప్రముఖ రచయితలు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, డా.జె. చెన్నయ్య, డా. గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, కందుకూరి శ్రీరాములు, తూర్పు మల్లారెడ్డి తదితరులు సభకు హాజరయ్యారు.