మౌనంగా ఉండలేక పాటైనా కవిత్వం : ఇప్పుడొక పాట కావాలి

By Pratap Reddy Kasula  |  First Published Dec 20, 2021, 12:44 PM IST

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం బిల్ల మహేందర్ కవిత్వం  "ఇప్పుడొక పాట కావాలి " అందిస్తున్నారు వారాల ఆనంద్.


‘వస్తూవున్నప్పుడు
పిడికెడు మట్టిని తెండి
మొలకెత్తడం నేర్చుకుందాం....’ - అంటూ బిల్ల మహేందర్ పంపిన “ఇప్పుడొక పాట కావాలి” కవితా సంకలనం అందుకున్నాను.

‘దుఖం ఇవ్వాల్టిది కాదు
యేండ్లతరబడి మోస్తూనే వున్నాను
వెనుక పేజీ తిరగేసిన
కన్నీళ్ళతో తడిసి బరువెక్కుతుంటాయి...’ - అన్నాడు మహేందర్..అవును ‘ఇప్పుడొక పాట కావాలి’ చదివిన తర్వాత గుండె బరువెక్కింది.  మంచి కవిత్వం చదివిన అనుభవంతో పాటు ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఆస్వాదించిన అనుభూతి కూడా మిగిలింది.

Latest Videos

.......

‘ఇది ఆకాంక్షల్ని రక్తగతం చేసుకుని, అక్షరాల్ని జీవితంగా మలుచుకుని కాలం నిర్దేశించిన దారిలో విచ్చుకుంటూ సాగిపోతున్న బిళ్ళ మహేందర్ నాలుగేళ్ళుగా సాగిన ప్రయాణాన్ని, రాసిన కవిత్వాన్ని ఒక చోట ప్రకటించిన సంపుటి ఈ ‘ఇప్పుడొక పాట కావాలి’ అని అన్నారు  డాక్టర్ నందిని సిద్దారెడ్డి తన ముందు మాటలో.

ఆయన అభిప్రాయ పడ్డట్టుగానే గొప్ప అనుభవం, మంచి అనుభూతి, ఆర్ద్రతలతో పాటు మంచి వ్యక్తీకరణ కూడా కలిగిన కవి మహేందర్.  ఈ సంపుటి నిండా సాంద్రమయిన కవిత్వంతో పాటు వస్తు వైవిధ్యమూ మనకు కనిపిస్తుంది.

“అప్పుడప్పుడు
తను నువ్వు నేను కలిసి
మొలిచిన మాటల్ని కుప్పలుగా పోసి
దారి పొడువునా మాటల పందిరిని నిండుగా పరచాలి” - అన్నాడు మహేందర్ తన ‘నాలుగు’ కవితలో... అట్లా ఆయన కుప్పపోసిన మాటల వెంట నడుస్తూ నడుస్తూ ఈ సంపుటి చదువుతున్నంత సేపూ మంచి కవిత్వాన్ని అస్వాదిస్తాం.

‘ఉత్తిగనే రాస్తూ కూర్చుండలేను  
నడువాల్సిన తొవ్వెంబడి నడవకపోతే
కాళ్ళు గుంజుతుంటయి
ఎత్తాల్సినకాడ పిడికిలి ఎత్తకపోతే
చేతులు బరువెక్కుతాయి’ - అన్న మహేందర్ వరంగల్ జిల్లా వేలేరు గ్రామంలో పుట్టాడు.  మలిదశ తెలంగాణా ఉద్యమ ఉధృతిలో ముందుకు సాగిన తను ఇప్పటికి ఆరు పుస్తకాలు వెలువరించారు.  దివ్యాంగ అనాధ విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ కేవలం రాయడమే కాకుండా చైతన్యవంతమయిన కార్యశీలతతో కృషి చేస్తున్నాడు.

“బిళ్ళ మహేందర్ కవిత్వం చదువుతుంటే ప్రతి కవితలోనూ ప్రతి పంక్తిలోనూ ప్రతి పదంలోనూ నాకు కనబడినదీ వినబడినదీ హోరేత్తినదీ సార్ద్ర సంభాషణే. ఈ కవిత్వమంతటినీ మాధ్యమంగా పెట్టుకుని మహేందర్ సమకాలీన సమాజంతో, నిత్య సన్నివేశాలతో నిరంతర సంభాషణ జరిపాడు” అని ఎన్.వేణుగోపాల్ అన్నాడు.

నిజమే మహేందర్ అట్లా సంభాషిస్తూనే ‘నేను మాట్లాడుతున్నాను’ అన్నాడు ఓ కవితలో.   అందులో

‘మౌనంగా ఉండడమంటే మాట్లాడలేకపోవడం కాదు
మనస్సు పొరల్ని బందించి జీవచ్చవంలా బతకడం
మనిషి తనాన్ని పూర్తిగా కోల్పోవడం’  - అని అన్నాడు మహేందర్.  అనడమే కాదు వ్యక్తిగా మనిషితనాన్ని పూర్తిగా నిలుపుకుంటూ సాటి మనిషి పట్ల బాధ్యతతో నిలబడుతున్నాడు.

‘చివరికి
చీకట్లో కలసిపోయిన మీ అడుగుల్ని నిలబెట్టేందుకు
నేను ప్రతీ రాత్రి అడవిలో సింధూరమై మొలకెత్తుతాను’
అనీ అంటున్నాడు మహేందర్.

....

‘అది ఒక యుద్ధ క్షేత్రం / ఓ ఆత్మ గౌరవ పతాకం’ అని ధర్నాచౌక్ గురించి కవిత్వం చెప్పిన మహేందర్

“రాజ్యమేలేటోడు
వస్తూనే ఉంటడు పోతూనే వుంటడు                 
చివరిదాకా నిలిచేవాడే వీరుడు’ 
అని కూడా స్పష్టంగా అంటాడు.

అంతేకాదు -

"నిజంగా ఒట్టేసి చెబుతున్న
ఒక్క సారి మీ సాయంకాలాన్ని కాసేపు నాకివ్వండి
ఇక ప్రతి సాయంకాలం
మీకు అందమయినదిగా సంతకం చేసిస్తాను’ - అని కూడా హామీ ఇస్తున్నాడు.

....

ఒక్కోసారి  మహేందర్ కవిత్వం నిండా ఒక విషాద జీర ధ్వనిస్తూ వుంది.

“ఇప్పుడు కాళ్ళు రెక్కలు తెగి
చక్రాల మీదికి నెట్టి వేయబడిన నా జీవితానికి
మిగిలిన ఒకే ఒక తోడు ఈ కిటికీనే
ఎన్ని చీకట్లు కాటేసినా ఎన్ని వెలుగులు విరబూసినా
ఏ మాత్రం కదలలేని నా మొండి దేహానికి
ప్రత్యక్ష సాక్షి ఈ కిటికీనే
అప్పుడప్పుడూ
రెక్కలు కట్టుకుని ఊరేగుదామనుకున్న ప్రతిసారీ
ఎగరలేని నా నిస్సహాయతను చూసి
జాలిపడే ఆప్త మిత్రుడు ఈ కిటికీనే”  - కానీ ఆ విషాద స్పందన దగ్గర మహేందర్ నిలబడి పోడు. ఆయన కవిత్వంలో ఆ విషాద ధ్వనికి ప్రతిధ్వనిగా గొప్ప ఆత్మ విశ్వాసం కూడుకున్న ఆశావాదం కూడా వినిపిస్తుంది.  తనకి జాలి అవసరం లేదని..

‘రాళ్లో ముళ్లో పూలదారినో
బతుకు తొవ్వ సాగిపోవాలంటే
అడుగుల్ని ముందుకు కదిలించాల్సిందే
చివరివరకూ నడుస్తూ పోవాల్సిందే’ - అంటూ ముందుకు సాగుతాడు.

అట్లా గొప్ప ఆశావాద దృక్పధంతో కవిత్వం రాయడమే కాదు జీవితమూ అంతే ఆశావాహకంగా గడుపుతున్న మహేందర్ ను మనస్పూర్తిగా అభినదిస్తున్నాను.

కవిగానూ మనసున్న ఆత్మవిశ్వాసం వున్న మనిషిగా మరింత విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.

click me!