డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు రచించిన 'వ్యాస గవాక్షం' వ్యాసాల సంపుటి, హనీఫ్ రచించిన ' నాది దుఃఖం వీడని దేశం' కవితా సంకలనం పుస్తకాలను మంగళవారం ఆవిష్కరించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దర్పణం సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'వ్యాస గవాక్షం' వ్యాసాల సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం(21.12.2021) జరగనుంది. దర్పణం సాహిత్య వేదిక అధ్యక్షులు డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు ఈ సాహిత్య వ్యాసాల సంపుటిని రచించారు. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతి సమావేశ మందిరంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.
పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడేలా సాహిత్య వ్యాసాలను ఈ వ్యాస సంపుటి ద్వారా అందిస్తున్నట్లు రచయిన సూర్యప్రకాశ్ వెల్లడించారు. గతంలో 'అమ్మంగి వేణుగోపాల్ రచనలు - సమగ్ర పరిశీలన' పరిశోధన గ్రంథాన్ని ఆయనే వెలువరించారు.
డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు 'విపంచి' వ్యాస సంకలనం, 'బాల మంజీర' బాలల పత్రిక, 'ధ్వని' సాహిత్య బులెటిన్ లకు సంపాదకత్వం వహించారు. ప్రస్తుత 'సాహితి' లిఖిత పత్రిక సంపాదక బృందంలో ఒకరుగా కొనసాగుతున్నారు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో దేశ ప్రధాని 'మన్ కీ బాత్' హిందీ నుండి తెలుగులోకి అనువాదం చేస్తున్నది కూడా సూర్యప్రకాశ రావే.
మంగళవారం ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం డా.అమ్మంగి వేణుగోపాల్ అధ్యక్షతన జరుగుతుంది. ప్రముఖ రచయిన డా.నందిని సిధారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డా.అయాచితం శ్రీధర్, విశిష్ట అతిథి మామిడి హరికృష్ణ, ప్రధాన వక్త ఆచార్య చెన్న కేశవరెడ్డి, గౌరవ అతిథులు డా.ఏనుగు నరసింహారెడ్డి, ఎ. రమేశ్ కుమార్ పాల్గొననున్నారు. కృతి స్వీకర్తగా డా. ఇరివెంటి వెంకటరమణ (హిమజ్వాల) వ్యవహరించనున్నారు.
ఈ ఆవిష్కరణ సభకు సమన్వయకర్తలుగా ముదిగొండ సంతోష్, నక్కా హరికృష్ణ, డా.కావూరి శ్రీనివాస్, రామకృష్ణ చంద్రమౌళి వ్యవహరిస్తున్నారు.
ఇక ఇదేరోజు (మంగళవారం) 'నాది దుఃఖం వీడని దేశం' కవితా సంకలనాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, కవిసంగమం సహకారంతో హనీఫ్ రచించిన ' నాది దుఃఖం వీడని దేశం' కవితా సంకలన పుస్తక ఆవిష్కరణ జరగనుంది. 21 తేదీన సాయంత్రం 6గంటలకు రవీంద్ర భారతిలోని సమావేశ మందిరం యాకూబ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. కె. శివారెడ్డి పుస్తకావిష్కరణ చేసే ఈ సభకు సతీష్ చందర్, ఎన్. వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా, మామిడి హరికృష్ణ, జయరాజ్, పసునూరు రవీందర్ విశిష్ట అతిథులు హాజరుకానున్నారు.
సామాజిక అవ్యవస్థకు అక్షరరూపం హనీఫ్ సాహిత్యం. హనీఫ్ కలం నుండి గతంలో ఇక ఊరు నిద్రపోదు (కవిత్వం) - 1995, ముఖౌటా (కవిత్వం) - 2002, పడమటి నీడ-కథలు 2009 వెలువడ్డాయి.