‘తెలుగు భాష - ఆధిపత్యాలు’.. హైదరాబాద్ లో రాష్ట్ర సదస్సు..

By SumaBala Bukka  |  First Published Dec 24, 2022, 11:25 AM IST

ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రచయితల సంఘం "తెలుగు భాష- ఆధిపత్యాలు" అంశంపై  రాష్ట్ర సదస్సు  నిర్వహిస్తున్నది. ఆ సదస్సు ఉద్దేశాలను ఇక్కడ చదవండి :


భావవ్యక్తీకరణకు భాష ఒక సాధనం. ఒక భాషా సమూహం ఇతర భాషల ప్రభావంతో తన జ్ఞానం, ఆలోచనలు, అనుభవాలను సుసంపన్నం చేసుకుంటుంది. సాహిత్యంగా నమోదు చేసుకుంటుంది. భాషా సంస్కృతుల వికాసం ఆధారంగా తన అస్తిత్వం, ఔన్నత్యం స్థిరపరచుకుంటుంది. నాగరిక సమాజంగా అవతరిస్తుంది.

తొలి నుంచి భాష విషయంలో భారత ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న వైవిధ్యాలు, వైరుధ్యాలు, తెలంగాణపై కోస్తాంధ్ర  భాషాధిపత్యం మనకు తెలిసిన, అనుభవంలోకి వచ్చిన విషయాలే. భాష వెనుక భావజాలం కూడా ఉంటుందని తరచి చూస్తే అర్థమవుతుంది.

Latest Videos

తెలుగుభాష పై తొలుత సంస్కృత, ప్రాకృత భాషల ప్రభావం పడింది. 11వ శతాబ్దం నుంచి లిఖిత సాహిత్యం దాదాపుగా సంస్కృత భాష, ఛందస్సుల ఛాయల్లోనే వర్ధిల్లింది. పండిత భాషకు అనుగుణమైన వ్యాకరణం రూపొందించబడింది. జాను తెనుగు, అచ్చ తెనుగు కావ్యాలు కొన్ని వెలుగు చూసినా ఆ వారసత్వం నిలదొక్కు కోలేకపోయింది. సామాన్యుల భాష మౌఖికంగా మనుగడ సాగించినా సాహిత్య గౌరవం పొందలేదు. 

నాగరికత విస్తరిస్తున్న క్రమంలో భిన్న భాషా సమూహాల మధ్య ఇప్పటికీ ఆధిపత్యాలు, అణిచివేతలు చోటు చేసుకుంటున్నాయి. బ్రిటిష్ పాలన అంతమైనా ఆ వలసవాదుల భాషనే ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఉత్తరాది హిందీ భాష దక్షిణాదిపై మాధ్యమ భాషగా దూసుకు వస్తున్నది. 

దానికి తోడు పెత్తనాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రాంత భాషా వ్యవహర్తలు మరోప్రాంత భాషను కించపరచడం, అవమానించడం చేస్తున్నారు. భిన్న భాషల సమ్మేళనంతో జ్ఞానం వికసించడానికి బదులు ప్రజల మధ్య అసహనానికి, అశాంతికి కారణమవుతున్నాయి.

తెలుగు భాష మీద సాహిత్య ప్రభావం, ప్రసార మాధ్యమాల ద్వారా ఆధిపత్యం నెలకొల్పడం, సుస్థిరం చేసుకోవడం, భాషాధిపత్యం ఉద్యమాలకు దారి తీయడం వంటి అంశాలు ఇప్పటికీ ప్రాసంగికత కలిగి చర్చనీయాంశాలై ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో వాటిని ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన, చేస్తున్న భాషా, సాహిత్యకారుల ఆలోచనలను పంచుకోవాలని, చర్చించుకోవాలని తెలంగాణ రచయితల సంఘం భావిస్తున్నది. అందుకోసం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రచయితల సంఘం "తెలుగు భాష- ఆధిపత్యాలు" అంశంపై  రాష్ట్ర సదస్సు  నిర్వహిస్తున్నది.

తెలంగాణ రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షులు డా. నాళేశ్వరం శంకరం అధ్యక్షతన జరగనున్న ఈ సభలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, డా. నలిమెల భాస్కర్, డా. కె. శ్రీనివాస్, డా. నందిని సిధారెడ్డిలు ప్రసంగిస్తారు.

click me!