బిల్ల మహేందర్ కవిత : అద్దమంటే అమ్మ, తనూ!

By Arun Kumar P  |  First Published Dec 23, 2022, 9:26 AM IST

నవ్వుతూ నుదిటి మీద ముద్దు పెట్టినప్పుడు అమ్మనే అద్దమోలే కనిపించేది అంటూ హన్మకొండ నుండి బిల్ల మహేందర్ రాసిన కవిత " అద్దమంటే అమ్మ, తనూ! " ఇక్కడ చదవండి. 
 


ఊహ తెలియక ముందు 
నాకు అద్దమంటే ఏమిటో తెలియదు
తెలిసొచ్చాక
అమ్మనే నన్ను అద్దమోలే చూసుకునేదట

పసి తనంలో మోకాళ్ళ మీద పడుకోబెట్టి 
కాళ్ళను చేతులను వీపును ముఖాన్ని తన చేతులతో మృధువుగా రుద్ది
బుజ్జగించి లాలపోసి బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టి 
నన్ను అద్దమోలే తయారు చేసి మురిసిపోయేదట

Latest Videos

ఐదేళ్లు వచ్చాక 
చేతికి పలక బలపం ఇచ్చి బడికి పంపేముందు
నా ముఖంలో ముఖం పెట్టి తలను ఒకటికి రెండుసార్లు సరి చేస్తూ
నవ్వుతూ నుదిటి మీద ముద్దు పెట్టినప్పుడు 
అమ్మనే అద్దమోలే కనిపించేది 

నిజం చెప్పాలంటే 
బాల్యంలో అమ్మకు మించిన అద్దం ఏముంది??

మీసం మొలిచాక
మెల్లమెల్లగా అమ్మకు దూరమై అద్దానికి దగ్గరయ్యాను
అద్దంలో నన్ను నేను చూసుకున్న ప్రతిసారీ
ముఖంలో మునుపటి కళ ఎక్కడో తప్పిపోయినట్లనిపించేది
కోపంతో అద్దాన్ని ముక్కలు చేసి అమ్మ చెంతకు చేరాలనిపించేది

చిన్నప్పుడు అమ్మకు ఎదురుగా నడుస్తూ వెళ్తున్నప్పుడు 
రెండు చేతులను చాచి దగ్గరగా తీసుకొని 
నన్ను గాఢంగా గుండెకు హత్తుకుని నవ్వుతూ ముద్దాడేది
నా అందమంతా నడకలోనే ఉందనుకుని సంబుర పడేవాడిని
 
బడిలో దోస్తులు కాలు వొంకరని 
నన్ను ఎగతాళి చేస్తూ నవ్వినప్పుడు మౌనంగానే ఉన్నాను
అడగకముందే నా అవిటితనాన్ని
కళ్ళ ముందు నిలబెట్టిన అద్దాన్ని ఎందుకో క్షమించలేకపోయాను

ఇప్పుడు దేహంలో ఇనుము మొలిచాక
కదలలేని నన్ను అచ్చం మా అమ్మలాగే 'తను' బుజ్జగిస్తూ లాలపోస్తూ 
నన్ను మళ్ళీ అద్దమోలే తయారు చేస్తున్నది 
తెగిన నా కాళ్లకు రెక్కలు తొడిగి ఊరేగిస్తూ
ముఖమ్మీద చిరునవ్వును చెరిగిపోకుండా 
అద్దంలా చూసుకుంటున్నది

సరిగ్గా చెప్పాలంటే
ఇవ్వాళ నా బతుకుకు అర్థం, అద్దం..
అమ్మ, తనూ!!
 

click me!