మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్ లకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు..

By SumaBala Bukka  |  First Published Dec 23, 2022, 9:04 AM IST

ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు ఇద్దరు తెలుగు రచయితలు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు మధురాంతకం నరేంద్ర కాగా, మరొకరు వారాల ఆనంద్ ఉండడం విశేషం. 


ఢిల్లీ : ఇద్దరు తెలుగు రచయితలను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు వరించాయి.  ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రాగా, అనువాద విభాగంలో తెలంగాణకు చెందిన మరో రచయిత కవి వారాల ఆనంద్ కు సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. మధురాంతకం నరేంద్ర రచించిన ‘మనోధర్మపరాగం’ నవలకు గాను 2022 వ సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఈ నవలలో మధురాంతకం నరేంద్ర వందేళ్లకు పూర్వం దక్షిణ భారతదేశంలో ఉన్న దేవదాసీల వ్యవస్థ, ఆ వ్యవస్థ ఎలా పెరుగింది, ఎలా క్షీణించింది…  దేవదాసీలుగా ఉండి ప్రముఖులైన మహిళలు.. వారి జీవితాలను విశ్లేషణాత్మకంగా ఈ ‘మనోధర్మపరాగం’ నవలలో మధురాంతకం నరేంద్ర వివరించారు. 

ఇక మరో కవి వారాల ఆనంద్.. ప్రముఖ హిందీ కవి గురజాడ రచించిన ‘గ్రీన్ పోయెమ్స్’ ను హిందీ నుంచి తెలుగులోకి  ‘ఆకుపచ్చ కవితలు’ అని  అనువాదం చేశారు. దీనికి కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం లభించింది.  గురువారం కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు ఢిల్లీలో ఈ మేరకు ప్రకటిస్తూ.. మొత్తం ఇరవై మూడు భాషల సాహితీకారులను సాహిత్య అకాడమీ పురస్కారాలు ఎంపిక చేసినట్లు తెలిపారు. అవార్డు గ్రహీతలకు లక్ష రూపాయల నగదు, శాలువ,  తామ్ర ఫలకం, ఓ జ్ఞాపిక  ప్రధానం చేస్తారు. అనువాద పురస్కారానికి కూడా ఇవన్నీ ఉంటాయి.అయితే, నగదు బహుమతి లక్ష కు బదులు రూ.50000 ఉంటుంది.

Latest Videos

ఈ సాహిత్య అకాడమీ పురస్కారానికి  డాక్టర్ నందిని సిద్ధారెడ్డి,  డాక్టర్ సి ఎల్ ఎల్ జయప్రద,  ప్రొఫెసర్ పి కుసుమకుమారి జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. డాక్టర్ ఎల్ ఆర్ స్వామి,  ప్రొఫెసర్ అల్లాడి ఉమా,  నలిమెల భాస్కర్ లు  అనువాద పురస్కార  జ్యూరీ సభ్యులుగా  ఉన్నారు. 

మనోధర్మపరాగం…
‘మనోధర్మపరాగం’ నవలకు  కు గతంలో ఆట బహుమతి కూడా లభించింది.  ఈ నవల రచయిత  మధురాంతకం నరేంద్ర  తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం  ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేశారు.  మధురాంతకం నరేంద్రకు  ఇంగ్లీష్,  తెలుగు భాషలో  చాలా ప్రావీణ్యం ఉంది.  ఆయన ఈ రెండు భాషల్లో రచయిత అనువాదకుడు. 1957 లో చిత్తూరు జిల్లా పాకాల మండలం  రమణయ్య పల్లెలో  మధురాంతకం నరేంద్ర  జన్మించారు.  నరేంద్ర తండ్రి  ప్రముఖ రచయిత మధురాంతకం రాజారాం, తల్లి నాగభూషణమ్మ. 

మధురాంతకం నరేంద్ర పాలిటెక్నిక్ చదువుకుంటున్న సమయంలోనే ‘చివరికి దొరికిన జవాబు’ అని  మొదటి కథ రాశారు. ఆ తర్వాత తెలుగు, ఇంగ్లీష్లో అనేక కథలు  రాశారు. ‘మోడల్ మిలియనీర్’ అనే ఆస్కార్ వైల్డ్  ప్రజలను  తెలుగులో పెళ్లి కానుక అనే పేరుతో అనువదించారు. ‘టెల్ టేల్ హార్ట్’ అనే  ఎడ్గార్ అలెన్ పో  రచనను..  నినదించే గుండెగా..  తెలుగులోకి అనువదించారు.  ఇక ‘ ఇండియన్ క్యాంప్’  అనే ఎర్నెస్ట్ హెమింగ్వే రచనను అదే పేరుతో తెలుగులోకి అనువదించారు.

ఆయన మొత్తం తెలుగులో 14,  ఇంగ్లీష్ లో 12 రచనలు చేశారు.  అనేక పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.  ఇంగ్లీష్ కథలు,  పుస్తకాలను  తెలుగులో,  కొన్ని తెలుగు రచనలను ఇంగ్లీషులోకి అనువదించారు, ఆయన కృషికి గాను అనేక అవార్డులు అందుకున్నారు.

ఆకుపచ్చని కవితలు..
ఇక అనువాద పురస్కారం అందుకుంటున్న  వారాల ఆనంద్..  రచించిన ఆకుపచ్చ కవితలు.. పుస్తకం ప్రకృతిని కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది. వారాల ఆనంద్  1958లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో  జన్మించారు. తల్లిదండ్రులు అంజయ్య, అనురాధలు వారాల ఆనంద్ చిన్నతనంలోనే కరీంనగర్ కు వచ్చి స్థిరపడ్డారు. అక్కడ ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు. 1978 లో ఏర్పాటుచేసిన కరీంనగర్ ఫిలిం సొసైటీ సభ్యునిగా సినిమా రంగంపై దృష్టి సారించారు. వీటితో పాటు డాక్యుమెంటరీ ఫిల్ములను కూడా నిర్మించారు.

ఈ అవార్డు నేపథ్యంలో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం మరిచిపోలేని అనుభూతి అని వారాల ఆనంద్ అన్నారు.  గుల్జార్ రచనల నుంచి తాను ఎంతో ప్రేరణ పొందానని, ఈ అవార్డు గుల్జార్ కవితలకు దక్కిన గొప్ప గౌరవమని  అన్నారు. గుల్జార్ కవితల్లో నాకు గ్రీన్ పోయెమ్స్ బాగా నచ్చింది.  దీంతో తెలుగులోకి అనువదించడానికి  ఆయన అనుమతి తీసుకున్నాను.  ఇందులో మొత్తం 58 కవితలు ఉన్నాయి.  వీటిని మూడున్నర నెలల్లో పూర్తి చేశా.

ఇతర భాషా రచనలను పరిశీలించే క్రమంలో వాటిని అనువాదం పై నాకు ఇష్టం,  ఆసక్తి పెరిగింది. అలా ఏషియా నెట్ న్యూస్ తెలుగు అనే ఆన్లైన్ వేదికగా 17 భాషలలో నుంచి 70 కవితలను తెలుగులోకి అనువదించాను  అని చెప్పుకొచ్చారు. 

click me!