పని మనుషులు అంటే డబ్బులు పడేస్తే పని చేసే వారేనా !? పని చేస్తున్న కుటుంబ సంబంధాలపై వారి ప్రభావం ఎలా ఉంటుంది ? డెట్రాయిట్ నుండి సంధ్యారాణి ఎరబాటి రాసిన 'స్మృతిపథం' కథలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలను చదవండి.
ఇన్నేళ్లయిన కాలం మారినా అప్పుడప్పుడు గుర్తుకువస్తుంది ఆమె. కారణం ఏదైతేనేం... రాధమ్మ అని పిలిచే ఆమె కనుల ముందు నిలుస్తుంది. నాలుగో తరగతిలో ఉన్నానేమోఅపుడు. రోజూ అంతే... ఆమె హడావిడికే నిద్రలేచేదాన్ని. ఇల్లు ఊడుస్తూ; గిన్నెలు కడిగే ధ్వనులు ఈ రోజూ అంతే ...లేవగానే ముందు పెరట్లోకి పరుగెత్తాను. నాబుజ్జి కుక్కని వారం క్రితం పుట్టిన లేగ దూడని ముద్దుచేస్తే గాని..మనసాగదు నాకు. మూలన ఇత్తడి బోళ్లను రాచిరాచి తోముతూ కడుగుతూ నన్ను చూసినవ్విoది మల్కి.
లేవoగానే వాటి ఎoట పడ్తావు. ఇసుకూలుకు పోవా ఏంది ? ముందు మొఖo కడుక్కుని పాలు తాగు రాధమ్మ అంటూ మెత్తగా విసుక్కుంది. ఆమె కూడా నానమ్మ లాగే మాట్లాడుతుంది . కాస్త ప్రేమ, పెత్తనం చేలాయిస్తుంది. ఇంట్లో పనిచేసినా ఇంటి మనిషిలానే ఉంటుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఇంట్లోనే పనిచేస్తూ ఉంది మరి.
Also Read: డాక్టర్ సిద్దెంకి యాదగిరి తెలుగు కథ: పీడ
ఆమెకి టీని పీకలదాకా తాగించిపిచ్చి అలవాటు చేసింది మా అమ్మ. ఎన్ని మార్లు టీ ఇచ్చినా ఇష్టంగా తాగుతుంది. అమ్మoటే చాలా ఇష్టం ఆమెకి. నానమ్మ అంటే భయం. నాన్న ముందుకు మట్టుకు వొచ్చేది కాదు. అప్పడప్పుడు నేనేసే చిక్కుప్రశ్నలకు కళ్ళతోనే జవాబు ఇచ్చేది. ఆమె బావి నుండి తెచ్చిన నీళ్లను ఎక్కువ చల్లేసి తనని విసిగిస్తూ
ఉండేదాన్ని .
ఒక్కోసారి ఎంతో కోపం వొచ్చేది నాకుతలుపు లేని స్నానాల గదిలో స్నానము చేస్తుంటే వెనక నుండి వొచ్చేది. వొచ్చి వీపు రుద్దేది. కాస్త సిగ్గుపడ్డా ఇష్టం అనిపించేది సుమా!.
స్కూల్ కి వెళ్ళే దారిలో ఉండేది ఆమె గుడిసె. అప్పుడప్పుడు ఆమె జొన్న రొట్టెలు చేస్తుంటే దగ్గర కూర్చొని కాస్త తిందామంటే పెద్దమ్మ (అంటే మా నానమ్మ) తిడుతుంది రాధమ్మ వొద్దు అనేది. ఆమె జీవితం చివరి వరకు మా ఇంటికే అంకితమైన ఆమె లేదు అన్న మాట విన్నపుడు ఏదో సొంత వారిని కోల్పోయిన భావం. మల్కి అంటే నాకు ప్రాణం. నల్లటి రంగులో, చక్కటి మోముతో కుంచె గీసిన చిత్రంలా ఉండేది మా మల్కి. పనివాళ్ళు అంటే డబ్బు పడేస్తే పనిచేసే వాళ్ళు అనే ఆలోచన చాలా మoదిలో ఉంటుంది. కానీ ఓ ఇంటిలో చాలా కాలం పనిచేస్తూ ఆ ఇంటితో ఆ మనుషులతో అనుబంధం వాళ్ళు కూడా పెంచుకుoటారు. ఆ కుటుంబంలో అంతర్భాగం అయిపోతారు. అన్నం పెట్టిన చేతులకి విశ్వాసం చూపిస్తారు. వాళ్ళ ఇళ్ళు చిన్నవైనా పెద్ద మనసుతో ఉంటారు. మనకలతలు తీరుస్తారు. ఆనందాలు పంచుకుంటారు. మానవ సంబంధాలకు చేసే పనులు అడ్డుకావేమో. మనకి కొన్ని అనుభూతుల స్పర్శలు మిగులుస్తారు. పనివాళ్ళు దొరకని ఈదేశంలో రోజు ఒక్కసారయిన గుర్తొస్తుంది మా మల్కి.
చిన్నపుడు ఆమె పనిచేస్తుంటే నేను కూడా సహాయం చేస్తుంటే అనేది నీకెందుకు దొరసాని పని చేయడం, ఇవన్నీ మా పనులు అనేది. ఆమెకు తెలియదు అప్పుడు ఆమె చేసే పనులు చూసి నేను నేర్చుకున్న జ్ఞానం. పని చేయడం కాకుండా ప్రేమని కూడా పంచే మా మల్కి నా స్మృతిపథం లో చెరగని ఓ అపురూప ఆకృతి. జారుముడితో కడవ తలపై పెట్టుకొని నడిచొచ్చే మా మల్కి నా మనసులోఎప్పటికి చెరగని చిత్రం.