Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ సిద్దెంకి యాదగిరి తెలుగు కథ: పీడ

డాక్టర్ సిద్దెంకి యాదగిరి పీడ అనే తెలుగు కథ రాశారు. కథలో ఆయన బక్క రైతులు రెవెన్యూ సిబ్బంది నుంచి ఎదుర్కునే చిక్కులను, సమస్యలను సిద్దెంకి యాదగిరి తన కథలో చిత్రించారు.

Dr Siddenky Yadagari Telugu short story Peeda
Author
Hyderabad, First Published Jun 11, 2020, 4:54 PM IST

వీఆర్వో సైకిల్‌ మోటరు గాలిలా దూసుకొచ్చి ఇంటి ముంగట ఆగింది. సప్పుడు విన్న నర్సవ్వ ‘గింత పొద్దుగాల మా ఇంటికి వొచ్చెటోల్లు ఎవలుంటరు?అని మతిలో అనుకుంటూ గమిట్లదిక్కు సూసింది. బండి ఆగుడు ఆల్షమే లేదు. మస్కూరి దిగి అడుగువోయిన కడముంతోలే డొల్లుకుంట ఉరికొస్తూ ‘‘లింగయ్య, లింగయ్య’’ అని పిలుస్తండు. 
    
రాకడను గుర్తుపట్టిన నర్సవ్వ ‘వీనింట్ల పీనుగెల్ల. పొద్దుపొద్దుగాల్నే మస్కూరోడు వొస్తుండేంది? ఓ’ అనుకుంటూ అన్నం కలుపుతుంది. మస్కూరికి వినఫల్లేదు.
     
‘‘పిలుత్తుంటే సప్పుడు జెయ్యరేందవ్వా? మనుసులు ఉన్నట్లా? లేనట్టా.’’ అని మస్కూరి అన్నడు. 
    
‘‘ఓ అన్ననే అన్న.’’ అని సమాధానం చెప్పింది. 
    
‘‘ఇనవల్లే సెల్లే. ఇనొచ్చినంక ఇట్లందునా?’’ అని మారు జవాబిచ్చిండు. మాట్లాడుతున్నపుడు పెద్దలు  చేతుల తెల్ల కాగితం మెరుస్తుంది. 
    
‘‘మా మాటలు నీకు ఇనవడెటట్టు ఉన్నయా? ఏపాటోల్లమ్ మేం. పైసల్లేవ్వాయే. ఫలం లేదాయే. సట్టుంటే సుట్టు దిరుగుదురు. తిండిపెట్టెటోన్ని సూసి కుక్కతోక ఊపుతది. లోట్ల లద్దగూల్లకు లోకమే ఊగుతందిగని వొచ్చిన ముచ్చటేందో చెప్పు?’’ అని నిదీసింది. 
    
పెద్దులు మొకం జంపర్లు వొయిన ట్రాన్స్‌ఫరమోలే అయింది. ఎంతసేపు అన్నట్లు దూరంగా వీఆర్వో మోటర్‌ కికీక్‌ అంటూంది. 
    
‘‘ఇగవటు నర్సవ్వా! పాటిగడ్డకు లేదా మీ బూమి? అది మీదికాదట. మీరు కబ్జామీదున్నరటా? హక్కుదార్లు ఏరేటోల్లట. గదే ముచ్చట గీ కాయిదం ఉన్నదని ఎమ్మార్వో పంపిండు. గా కాయిదం ఇచ్చేతందుకు నేను, వీఆర్వో కలసివొచ్చినం. ఇగవటు.’’అని బీరిపోయి నిలవడ్డ నర్సవ్వ మీద పారేసి ఎనుకకు మర్రి సూడకుంట వెళ్లిపోతనే వున్నడు. 
    
నర్సవ్వ కోపంతో ఓ నల్లమొకపోడా! నిలవడు? తెలిపి చెప్పకుండా తాడు తెంపుకున్న దొంగ బర్రోలే ఎటో ఉరుకుతున్నవు? మా జాగ మందికియ్యటానికి ఎమ్మార్వో ఎవలు? చెప్పటానికి నువ్వెలు?’’ అనుకుంటూ మస్కూరి వెనుక సర్రన ఉర్కొచ్చింది. 
    
మస్కూరి బండి మీద కూసుండకముందే బండికి అడ్డంగా నివడ్డది. 
    
‘‘ఆ జాగ మాది కాదని ఎట్లంటరు? ఎమ్మార్వోకు ఏమెరుక. నీ కేమెరుక? ఊర్లోనడుగుండ్రి. మా మామ కాన్నుంచి మేమే దున్నుతన్నమా లేదా? మక్కసేనుకు ఇన్సూరెన్సు పైసలు మీరే ఇత్తిరిగదా!. మరిసిపోయిండ్రా? ఇయ్యాల్లొచ్చి మాదిగాదంటెట్ల?’’ అని అంటంది. 
    
‘‘నర్సవ్వా! నా మాట విను. నేను కాదంటలేను. ఎమ్మార్వో పంపించిన కాయిదం ఇచ్చిన. ఆ జాగగురించి మీ లింగయ్యను ఎమ్మార్వో మండలం రమ్మన్నడు? సారుతో మాట్లాడుమను?’’ అని వీఆర్వో చెప్పిండు.
    
‘‘నేను చేయించుకొస్త అని నువ్వంటే ఒగ తాప ఇన్సూరెన్సు పైసలు ఇస్తిమి. ఒగతాప పంట పైసలు నీకే ఇస్తిమి.  కొనాకర్కి నా నల్లపూసల్ల తెల్లపూసల్లేకుంట తెగనమ్మి జాగకోసం అప్పుచేసి నీకే ఇత్తిమి. మళ్ళ గిదేంది?’’ అని ప్రశ్నిస్తున్నపుడు వొచ్చేటోల్లు పోయేటోల్లు కటారకట్టిండ్రు.
    
‘‘ఓ తల్లి మీ లింగయ్య ఎటువోయిండు. గదే ముచ్చట ఎమ్మార్వోకు చెప్పాలే. ఎమ్మార్వో ఇంటే అయిపాయే’’అని వీఆర్వో చెప్పిండు. 
    
‘‘ఎన్నిసార్ల చెప్పితిమి. ఎన్ని సార్లు ప్రజావాణిల దరకాస్త్ ఇత్తిమి’’ అని నర్సవ్వ చెప్పుతనే ఉంది.
    
‘‘అదికాదు. ఇన్నొద్దులు చెప్పింది కాదు. ఇప్పుడు చెప్పాలే.’’అని వీఆర్వో సావు కబరు  సల్లగచెప్పిండు.
    
‘‘సావు కవురు వస్తే ఇంతకు ముందే వోయిండు.’’ అని జవాబిచ్చింది. 
    
‘‘సరేనమ్మా! వొచ్చినంక రమ్మను. నేను మండలంలనే ఉంట. ఎమ్మార్వోను కలిపిస్త. సార్‌ రేపుండడు. రేపు కలెక్టర్‌ మీటింగ్‌కు పోతడు సుమా? పొద్దుంజాములైనా సరే రమ్మను.’’ అని బండి స్టాట్‌ చేసుకుని వీఆర్వో పోయిండు. 
    
బేజారైన మనసుతో నర్సవ్వ వెనుకకు మర్రి పొయికాడ చేరింది. పొయిమంట సల్లారింది. పెయిమంట లేసింది. మోకాళ్ళ సందున మొకం పెట్టి ఆసనం వేసిన రుషిలా పొయిముంగట కూసుండి కుమిలి కుమిలి ఏడుస్తంది. ఓదార్చేటోళ్ళు ఎవరు రారని ఎత్తేసుకొస్తున్న దు:ఖ్ఖాన్ని అరచేయిల కొంగువట్టి ఆపుతూనే వుంది.
    
కొడుకుతోటి లింగయ్యకు ఫోన్‌ చేయించింది. ఎంతసేపు ఫోన్‌ చేసినా రింగయితుంది కాని ఫోన్‌ లిప్టు చేస్తలేడు. సావు సప్పుడు లింగయ్యకు వినపడుతలేదు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు లింగయ్యనే నర్సవ్వకు ఫోన్‌ చేసిండు. నర్సవ్వ పనిమీదుండి ఫోన్‌ ఆలస్యంగా లిఫ్ట్‌చేసి జరిగిన విషయం చెప్పింది. 
    
ఫోన్‌ పెట్టి‘ఎమ్మార్వో ఆఫీసు ఒక్కొక్కలు యముని మూతి కాకులోలే పొడుసుక తినవట్టిరి. వాళ్లయి కడుపులుకాదు కత్తులు. కత్తి కడుపారది. వీల్లకుతి దీరది. ఎంత మోసం. ఎంత దగా? ఎంత కుట్ర చేయవట్టిరి.  మనాదికి  దినదినము నేను బతికి ఉన్న పీనుగు కాలవడ్తి. ఏడేండ్ల పొద్దాయే. పని గాకపాయే. పైసవోతనే వుండే. మూడడుగులు ముందటికీ ఏడడుగులు ఎనుకకు పోవట్టే. ఇగ అయితదాంటే ఇరాం లేకుంట బాకీలు చేసి ఇయ్యనేవడ్తి. 
    
నాయంగా చెయ్యవలసిన పనికి మొన్న యాభైవేలు ఇస్తి. పైసలు పాయే. పనిగాకపాయే. ఇంతకు ముందే ఒగ నోటీసు ఇచ్చిరి. నోటీసు మీద నోటీసు ఇయ్యవట్టిరి. ఇది రెండోది. మూడోది ఇచ్చి వాళ్ల పేరుమీద పహానీ ఎక్కిస్తే బూమి కతం. బతుకు కతం. మనం కలిసినా, కలువకున్నా, ఇచ్చినా, ఇయ్యకున్నా బతుకు నాశనం పదహారు గంటలు చెయ్యవట్టిరి. ఇచ్చీఇచ్చి బతుకు బర్వాతాయే. బూమిపోతే బూమ్మీద వుండెందుకు? సచ్చింది నయం.’ అని నర్సయ్య అనుకుంటుండు. 
    
దప్పు  కొట్టంగ పీనుక్కు దడిగట్టి తానం పోస్తండ్రు. దప్పు కొడుతుంటే గుండె దడదడ కొట్టుకుంటంది. పాడె పెట్టి శవయాత్ర సురువైంది. లింగయ్యకు మనసులో మనసులేదు. ఎప్పుడు పోవాలే. ఎమ్మార్వోతో ఎప్పుడు మాట్లాడాలే అని ఒకటే యావ. ఎక్సెల్‌ మీద సంగాపూర్‌ నుంచి బయుదేరిండు. ములుగు మండలం రామబాణం కొట్టినట్లు సాయంత్రం నాలుగ్గంటకు చేరవోయిండు.     బాధితులు బెల్లమ్మీది ఈగల్లా మండలాఫీసును చుట్టుకున్నరు. ఒక్కొక్కరిది ఒక్కో ఎత. రైతుందరూ బాణం గుచ్చుకున్న పక్షిలా బాధపడుతున్నారు. రైతు ఎగిర్తానికి అధికారుల అసత్వం ఎద్దు పుండు కాకికి ముద్దా అని ప్రశినిస్తూ ఉంది.
    
లింగయ్యకు తనజాగను మలుపుకునేటోల్లు కనవడంగనే ఎక్కడలేని కోపం తన్నుకొచ్చింది. పేదవాడి కోపం పెదవుల తీట అన్నట్లు చేసేదేమి లేక వొస్తున్న కోపాన్ని పంటి బిగువునపట్టి విషం దిగమింగిన గరళకంఠుని తీరుగఉన్నడు. 
    
లింగయ్య వీఆర్వో కోసం రూం రూం తిరుగుతుండు. ఎవరెవరో కనపడుతుండ్రు గని వీఆర్వో కనవడుతలేడు. గప్పుడే ఆఫీస్‌ పనిమీద వీఆర్వోను బయటికి పోయిండు. ఫోన్‌ రింగైతంది. ఫోన్‌ ఎత్తుతలేడు. ఎన్నిసార్లు చేసినా రెస్పాన్స్‌ లేదు. అర్దగంట అయినంక ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేసిండు.     

‘‘ఎక్కుడున్నవు సారూ? నేను లింగయ్యను మాట్లాడుతున్న. నేను ఆఫీసుకు వొచ్చిన. నీ కోసం చూస్తున్న. నువ కనవడుతలెవ్వు.’’ అని లింగయ్య అన్నడు.
    
‘‘లింగయ్యా! నేను వొస్తున్న. ఒక అర్దగంట అయితది. నేను జల్దే వస్తా నువ్వుండు.’’ అని ఫోన్‌ పెటిండు వీఆర్వో.
    
ఇయ్యల్ల మొత్తం జాగ తకరారు తేగ్గోట్టి కొత్త పాస్‌బుక్కులు ఇస్తరట అనే ముచ్చట అక్కడున్న రైతుద్వారా లింగయ్య తెలుసుకున్నడు. వీఆర్వో చెప్పిన టైం దాటింది. ఫోన్‌ కలువది. కలిసినపుడు ఫోన్‌ ఎత్తడు. ఎప్పుడూ బ్యూజీ వస్తది. కాలుగాలిన పిల్లి లెక్క ఆఫీసు ముంగట లింగయ్య తిరుగుతున్నడు. 
    
ఆరైంది. ఆరున్నరైంది. ఏడైంది. వీఆర్వో రాడు. ఏడుంబావు అందాదకు లింగయ్య జాగ మాదనేటోల్లు ఎమ్మార్వో ఆఫీసుకు వోయిండ్రు. వాళ్ళను సూసిన లింగయ్య కరంటి వోయిన బుగ్గతీరుగయిండు.
    
ఊరూరు మంది నిమిషాల మీద అటువోయి ఇటు వత్తుంటే లోపటికి పోయి ఎంతకూ ఎల్లుతలేరు. అర్దగంట దాటంగనే తెల్ల మీసాల ఖద్దరు అంగీ కడక్‌గా వొచ్చింది. ఆ యెనుకాలే విజయ దరహాసంతో నలుగురు నడిచి వస్తున్నారు. ఇవ్వన్నీ సాటుపొంటి గమనిస్తున్నాడు లింగయ్య.
    
‘నా జాగకు నేను దొంగను కావడ్తి. దోచుకునేటోడు దొరలాగా తిరుగవట్టే. నా బతుకు ఎందుకు కొరగాకుంట గావట్టే’ అని లింగయ్య ఆలోచిస్తుండు. వాళ్లు వోతున్నపుడు లింగయ్యకు ఫోన్‌ మోగింది. ఉలికిపడ్డడు. 
    
లింగయ్య ఫోన్‌ ఎత్తి ‘‘సార్‌ ఇక్కన్నే ఉన్న. వొత్తున్న. వొత్తున్న.’’ అనుకుంటూ వీఆర్వో ముందటికి వోయిండు. 
    
‘‘సార్‌ వొద్దంటే వొద్దన్నడు. మాకు దగ్గరోళ్ళుఅని అంటే సరే అన్నడు. సార్‌ దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడకు. దయకుదిరెటట్లు మాట్లాడు. ఏమైతదో సూద్దాం’’అని ముందగానే అన్నీ లింగయ్యకు వీఆర్వో నేర్పుతుండు.         
    
డోరుకాడ నివడ్డరు. వీఆర్వోను సూడంగనే అటెండర్‌ పొమ్మని డోర్‌ తీసిండు. లోపటికి వీఆర్వో వెనుకాల లింగయ్య వోయిండు. అప్పటికే ఎవరితో నిలిచి మాట్లాడుతున్న ఎమ్మార్వో కాళ్లమీదపడ్డడు. 
    
‘‘ఛల్‌ ఎవర్రా నిన్ను రానిచ్చింది. గెటౌట్‌ నాన్సెన్స్‌. పిచ్చిలేసినాది మెంటలోడా? ఇడువురా. పట్టుకొన్న కాళ్ళు ఇడువురా.’’ అని దులుపరిచ్చుకున్నా ఇడుస్తలేడు లింగయ్యా. 
    
‘‘నీ బాంచన్‌ కాల్మొక్తా! నా బాధ ఎల్లవోసుకోనియ్యి. సారూ! పెండ్లాం పిల్లలు కల్గినోన్ని. నాకు న్యాయము చేయ్యిండ్రి. నువ్వు నాకు న్యాయము చెయ్యకపోతే నేను నా పిల్లలము అందరం కల్సి నీ కాళ్ల ముంగట యిసం తాగి సచ్చిపోతం. పిడాత పాణం దీసుకుంటం.’’ అని కాళ్లు ఇడుస్తలేడు. 
    
లొల్లి విన్న అటెండర్‌ సర్రన డోరు తీసుకొని లోపలికి వోయిండు. వీఆర్వో, అటెండర్లు కలిసి పట్టుకున్న కాళ్లను ఇడిపిచ్చిండ్రు. ఎమ్మార్వోకు గుండె దమదమ కొట్టుకుంటంది. కోపం రేగుతుంది. తన టేబిల్‌ మీదున్న వాటర్‌ బాటిల్‌ ఎత్తి గటగట నీల్లు తాగి టక్కున పెడుతున్నపుడు అటెండర్‌ లింగయ్యను మెడ మీద సెయ్యేసి అవుతలికి ఎల్లురా అని నూకుతుండు. లింగయ్య కదుతలేడు. ఇంకొంత మంది మస్కూర్లు, ఫోర్తు క్లాస్‌ ఎంప్లాయిస్‌ వొచ్చిండ్రు. ఎమ్మార్వో కనుసైగతో ఎల్లి పొమ్మన్నడు. 
    
జరుగుతున్న అక్రమాలు ఆరాతీసేతందుకు అప్పట్కే ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ రిపోర్టర్లు వొచ్చిండ్రు. డోర్‌కాడ నిలవడ్డరు. ఈయన బయటికి పోతే ఉన్నది చెప్పుతడు. నా బాగోతం బయట పడ్తది. నా యెవ్వారం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అయితది. స్క్రోలింగ్‌లు, బైట్‌లు ఇంకేమన్న ఉన్నదా? నేను నా పని టాక్‌ ఆప్‌ది టౌన్‌ కాదు టాక్‌ ఆప్‌ ది స్టేట్‌ అయితా? ఎందుకు మరి? ముల్లును ముల్లుతో తీసే ఇగురమున్నోన్ని సల్లపడగొట్టి సాగదోలుతా???’ అని ఎమ్మార్వో అనుకున్నడు. 
    
‘‘నీ బాధేంది? రెండు ముక్కల్లా చెప్పు.’’ అని ఎమ్మార్వో అడిగిండు. 
    
‘‘సారు మాది సింగన్న గూడ. నా పేరు లింగయ్య. మా అయ్య పేరు అయిలయ్య.  నేను పసిపోరనప్పుడు మా అయ్య దొరది ఎనిమిదెకురాల జాగకొన్నడు. కాయిదం రాసుకున్నడు. కాయిదం చేసుకోలే. శానదినాల దాకా మేం కొన్న జాగ దొర పేరు మీదనే పహానీ వొస్తనేవుంది. దొరు పట్నం పోయిండ్రు. మీ పేరు మీదికి ఎక్కాలంటే సాదా బైనామా పత్రముండాన్నరు. మా కర్మ కాలి అది ఎక్కన్నో పోయింది. వాళ్లతోటే రిజిష్టర్‌ చేయించుకొమ్మన్నరు. రిజిష్టర్‌ చెయ్యిమని దొరనడిగితే ఒగ తిరకాసు పెట్టిండు. పొయింది పొట్టు ఉన్నది గట్టి అనుకొని దొరకు సగం జాగ ఇచ్చి రిజష్టర్‌ చేయించుకున్నం. ఇగ నాలుగెకురాలు మా అయ్య పేరు మీదికి ఎక్కింది. అన్నల గడబిడ సురువైంది. అన్ను రాంగనే దొరలు జాగొద్దు ఏమొద్దు మొత్తం మాకే ఇచ్చిండ్రు. అప్పట్నుంచి ఆ బూమిని మేమే కాస్తు జేసినం. 
    
కొన్నొద్దులకు అమ్మిన భీంరావు దొర, కొన్న మా అయ్య కాలం చేసిండు. అన్నలు లొల్లి తగ్గినంక దొర కొడుకు ఊరు మొకాన రాలేదు. ఈ నడ్మ జాగ ధరలు పెరిగినయి. వాళ్ళ జాగ మొత్తం కొన్నం. రిజిష్టర్‌ చేసినందుకు సగం జాగ దీసుకున్నరుకదా! ఆ పాసు బుక్కుల మీద మొత్తం జాగ వాళ్ళ పొంట రాసుకున్నరు. నా పాసు బుక్కుల నా జాగున్నది కదా అనుకున్న. నా పాసు బుక్కు ఉన్నకాడికి నాలుగెకురాలు కుదువపెట్టి బ్యాంకు క్రాప్‌లోన్‌ కూడా తీసుకున్న సార్‌. పహానీ ఏర్పడుకుంట ఎప్పుడో ఎక్కిచ్చుకున్నరు. 
    
వాళ్లదే జాగ అనెతందుకు దొర కొడుకు ఊల్లె కొంత మందిని కట్టుకున్నరు. జాగ వాళ్ళ దగ్గరినుంచే కొన్నం. ఇగో మా దగ్గర పాసుబుక్కుల ఆదారాలున్నయి. సూడుండ్రి అని జిరాక్స్‌ సూపెట్టిండు. కాంగిరేసు గవర్‌మెంటు ఉన్నపుడే జాగ వాళ్ల పేరుమీదికి  మారింది. నియ్యతిగళ్ళ ఎమ్మార్వో తిరుగంగా తిరుగంగా రెండెకురాలు నా పేరు మీదికి రాసిండు. అది రాయంగనే ఆయన బదిలీ అయ్యిండు. 
    
ఇంకో రెండేకూరాలకు అప్పట్నుంచి ఇప్పదాక తిరుగుతనే ఉన్న. కర్సు పెడుతనే ఉన్న. అడుగు ముందుకు పడ్డది లేదు. నాకు రావల్సిన జాగ రాలేదు. ఇప్పుడు ఆ జాగ నా పేరు మీద రాయిండ్రి. కబ్జా మీద నేనే ఉన్న. నాకు రైతుబంధు పైసలు రెండెకరాలకే పడ్డది. మిగతాయి పడాలని కాళ్లకు బట్టకట్టకుండ తిరుగుతనే ఉన్న. ఇవారకు పల్లేదు. 
    
మూడేండ్లు రైతు బంధు పడకపోతే ఆ జాగా నాది కాదని బుగులు సొచ్చింది.
    
నేను కబ్జా మీదున్న జాగ. నాదికాదనీ నువ్వు రెండు సార్లు తాకీదు పంపినవు. నేనేం జెయ్యాలే. కంచె చేను మేస్తే పంట దక్కుతాది సారు? 
    
కంచెను కాపాడు. పంటను కాపాడు. గిది ముచ్చట సారూ! న్యాయం చెయ్యి నీ కాళ్లు మొక్కుత.’’అని మల్లీ కాళ్లు మొక్కవోయిండు. 
    
“వొద్దొద్దు” అని ఎమ్మార్వో వారించిండు. వాన కురిసి ఎల్సినట్లు చెప్పిండు లింగయ్య.
    
‘‘ఏ వీఆర్వో. ఇతను చెప్పేది సర్వే నం మూడువంద ఇరువై ‘ఆ’ అదేనా? సమస్య?’’ అని అడిగిండు.
    
‘‘అవును సార్‌.’’ అని తలూపిండు వీఆర్వో. 
    
“నేను చేస్తా గదా? నువ్వెల్లు?”  నమ్మకం కలిగించి రైతు లింగయ్యను కనుసైగత బయటకి పంపించిండు.
    
పుల్కాశిలా దండం పెట్టుకుంటూ వెళ్లిపోయాడు.
    
‘‘చూడు లింగయ్యాఊ! అది పంచాది లేని జాగ. కుద్దు ఆర్డీవోనే చెప్పిండు మీటింగ్‌. వాళ్ల దగ్గర ఆధారాలున్నయి. ఐనా నేనూ విచారణ చేసిన. ఆ ఆరు ఎకరాజాగ వాళ్లదే అని తేలింది. నేనేం జెయ్యలేను. నీకెవరేం చెయ్యలేరు. వాళ్లకు రాజకీయ అండ పుష్కలంగా ఉన్నది. నేనేం జేస్త చెప్పు. నా మాట విను. ఎక్కన్నన్న బలవంతునితో బలహీనుడు గెల్సిండా? అతను గెలువడు. 
    
ఉన్నది రెండెకురాలే అని ఊరుకో. లేకపోతే అతని యిష్టం. బతికితే అసొంటి భూమి మస్తుగ కొనొచ్చు. చస్తే బూమ్మీదనే ఉండడు కదా! ఆలోచించుమని చెప్పు ’’ అన్నడు ఎమ్మార్వో.
    
లింగయ్యకు వీయర్వో అదే ఆఫీసు దగ్గర ఉన్న ముచ్చట అదే రాత్రి చెప్పిండు.
    
‘‘నేను సావ. సచ్చెటప్పుడు ఒగొన్ని సంపిసత్త’’ అని లింగయ్యమతిల అనుకుంటుండు. ఎమ్మార్వో పోతున్నప్పుడు మళ్ళీ కల్సిండు. 
    
‘‘బ్యాంక్‌ ఆధారాలుంటే నీకే అయితది. ఇంకో ముచ్చట నేను మళ్లీ విచారణ చేస్త. నా మాట విను. నాలుగు రోజులాగు. మీ వీఆర్వోకు అందుబాటులో ఉండు. ఆరైని పిలిసి లింగయ్య ఇచ్చిన ఆధారాలు నిజమేనో కావో పరిశీలించు అని ఆదేశించిండు. నాకు లిఖిత పూర్వకంగా రేపటివరకు మెయిల్‌ చెయ్యి. నేనెక్కడున్నా చూసుకుంటా’’అని ఎమ్మార్వో పురుమాయించిండు.    
    
అప్పటికి విలేకరులు పోలేదు.
    
‘కుదిరిన డీల్‌ను వొదులుకుంటనారా లింగా! నా దగ్గరనా నీ తెలివితేటలు? చెప్తా! బ్యాంక్‌ను మోసం చేసినవని నీ మీద కేసు పెట్టిస్త. కాని వానికి అయిన పెండ్లముంటదా? ఆ జాగ నీకైతదా?’ అని మతిల అనుకుంటూ తియ్యటి మాటలతో సల్లపడగొట్టిండు. 
    
ఎమ్మార్వో మాటలు లింగయ్యకు వెన్నపూసినట్లే అనిపించినయి. 
    
లింగయ్య డోరు దీసుకొని ఇవుతలికి వెళ్లాంగనే కెమరాలు పెట్టిండ్రు. లైట్లు పట్టిండ్రు. ‘‘ఏమైందేమైందని’’ విలేకర్లు కుచ్చికుచ్చి అడుగుతుండ్రు. అప్పట్దాక చెప్పుదామనుకున్న వీఆర్వో దిక్కు చూసిండు. చెప్పొద్దు అనుకొని చెప్పలేదు. లింగయ్య పోతున్నపుడే రావు సంతతికిచ్చిన మాట చొప్పున ఈ సమస్యకు ఎట్లా ముగింపు పలకాలనీ, ఆలోచిస్తున్నడు ఎమ్మార్వో. 
    
మరునాడుదయం అబ్దుల్లాపూర్‌ ఎమ్మార్వో విజయారెడ్డి ఎమ్మార్వో ఆఫీసులోనే సజీవ దహనం అయిందన్న వార్త దేశమంతా దావానంలా వ్యాపించింది. వాట్సాప్ లో  ఫెస్బుక్ లో  కాలుతున్న వీడియో తిరుగుతూనే ఉంది. 
    
అప్పట్దాకా రైతు రక్తం తాగిన రెవెన్యూ ఉద్యోగులకు భయమంటే ఏంటో తెలిసింది. గజగజ వణికిపోతుండ్రు. విధులు చేయాలంటే భయపడుతుండ్రు. రెవెన్యూ ఉద్యోగుల ఇంట పొయిమీద వంట సాగలేదంటే నమ్మబుద్ధి కాదేమో?
    
ఆ వీడియొ  చూస్తుంటే ఎమ్మార్వోను లింగయ్య కాలుస్తున్నట్లే అనిపించింది. తల్లి పిల్లలు భార్య మొత్తు కుంటునట్లు మనసు కకావికలమయ్యింది.  మనసు మరల్చుకుందామని ప్రయత్నించిన కన్ను తెరిస్తే విజయరెడ్డి మంటలు, అట్లాంటి మంటల్లో తను కాలిపోతున్నట్లు. ఎదురుగా బక్క చిక్కిన యమధర్మరాజులాగా కనవడుతున్నాడు. 
    
ఎమ్మార్వో కార్లో వెల్లుతుంటే సావు కండ్ల ముందటనే కనవడుతుంది. కారు వంద మీద వేగమున్నా ఆలోచనలు రాకెట్లా దూసుకెళ్తున్నాయి.
    
ములుగు ఎమ్మార్వో బార్య, తల్లి, ఒక్కగానొక్క కొడుకు అందరు విజయా రెడ్డి మంటలు చూస్తూ తడిసిన పిట్టలోలే గజగజ వణుకుతుండ్రు. పిట్టకువెట్టినట్లు హైద్రాబాద్‌లో ఎదురుసూత్తండ్రు. గేట్లనే కూసున్నరు. కారు ఆగింది. కారులోంచి దిగనివ్వలేదు. కారు విండో డోరును పట్టుకొని తల్లి ఏడుస్తుంది. డోరు తీసుకొని దిగగానే మీదపడి ఏడుస్తూనే ఉంది. 
    
‘‘బిడ్డా... ఓ బిడ్డా... నా బిడ్డా... నీకేం కాలేదు కొడుకా! పెయ్యంతా పునికి సూసుకుంటూ ఎనభై ఏండ్లు నిండిన తల్లి ఒక్కటే తీరుగ వపోస్తుంది. తల్లి ఏడుస్తుంటే ఎమ్మార్వోకు దు:ఖం ఎత్తేసుకొస్తుంది. నిన్ను ఏడిండ్ల పిల్లికూన లెక్క సాదిన కొడుకా... నువ్వు మంచిగా బతుకాలనీ సేను సేనుకు కైకిలి పోయిన.... నీ కడుపు నింప కన్నీళ్లు మింగిన కొడుకా... నాకు కన్నీళ్లు మిగిలియ్యకు బిడ్డా... పేరుకు రెడ్డీలమైనా ఉండ ఇల్లు లేదు బిడ్డా! పండ మంచం లేదు కొడుకా! గండ కరువుల సదివినవు కొడుకా! ఎవనికైనా కడుపుతీపి ఒక్కటే బిడ్డా... ఎవల్నేమనకు బిడ్దా... బతికిన కాడ్కి సాలుగని బిడ్డా! కానిపని చెయ్యకు కొడుకా!. నీ అయ్యలేకున్నా నిన్ను సాదిన కొడుకా!. నీలెక్క నీ కొడుకును చెయ్యకుబిడ్డా!. మంచిగ బతుకాలే బిడ్డా! వాడెవడో కాలవెడ్తే కొడుకా... నా కార్జాలు బోర్ల పడ్డయి కొడుకా... నా మనసు తాయిలలేదు బిడ్డా...’’అని తల్లి కట్టతెగిన చెరువోలే ఏడుస్తుంది. ఏడుసుకుంట ఏడుసుకుంట గేటు  లోపటికి పోయిండ్రు. 
    
అత్త తలుచుక ఏడుస్తుంటే కోడలు ఎగతట్టుకుంట ఏడుస్తుంది. మాట పెకులుతలేదు. ముచ్చటొస్తలేదు. మీ మీదనే పెట్రోలు దాడి జరిగిందనుకున్నమండీ... నువ్వే కాలినం అనుకున్నమండీ! మనసున పడతలేదండీ! మన కొడుకును కలెక్టర్‌ని చెయ్యాలన్నావండీ! మీరు లేకపోతే మీ కొడుకు ఆగమైతడయ్యా! మమ్ముల దేవుడు లేని జాతరచెయ్యకు’’ అని భార్య ఏడుస్తనే వుంది. 
    
కొడుకు ఏడుస్తనే ఉన్నడు. కళ్లు ఎర్రపడ్డయి. కనురెప్పలు ఉబ్బినయి. ఇల్లంత సావుకంపు కొడ్తంది. పెట్రోల్‌ మంట లేదు. మంటలు ఎగసి పడుతున్నాయి. తండ్రి చనిపోతే బాలింత వద్ద పాలుతాగుతున్న పసిపిల్ల బేలచూపుల్ని కుటుంభ సభ్యుల్లో కనవడ్తుంది.  
    
‘‘నాకేమైతదే? నేను అట్లాంటి పనులు చెయ్య. నాకేంగాదు. మీరెందుకు భయపడ్తుండ్రే’’ అని ఓదార్చిండు. 
    
నిశ్శబ్దంలో అదేపనిగా ఫ్యాను తిరుగుతుంది. కరక్‌ కరక్‌మని గోడగడియారం శబ్ధం ధాటిగా వినవడ్తుంది. క్యాలెండర్‌ సుడిగుండంలో చిక్కుకున్న సాహసికుడిలా గోడకు కొట్టుకాడుతుంది. కిచ్చెన్‌ మౌనంగా రోదిస్తుంది. ఉరుములేని పిడుగుపడ్డట్టుంది. ఇల్లంతా దు:ఖం కురుస్తుంది. ఓదార్పు ఎంత అతికించినా మనసులు నిమ్మలంగా లేవు. 
    
ఎవరికీ తిండి సయించుతలేదు. అయినా తిండిమీద కూసుంటే పిండాకూడు సుట్టూ కూసున్నట్లు అనిపించి ఎవరికీ తినానిపించలేదు. తిన్నమా అన్నట్లు తిని లేసిండ్రు. 
    
డన్‌లప్‌ పరుపుల మీద పన్నా కంటికి కునుకు పడుతలేదు. కన్ను మూసినా, తెరసినా కాలిపెడబొబ్బు పెడుతున్న, మంటతో ఎగసిపడుతున్న విజయారెడ్డి న్యూస్‌ కనవడ్తుంది. రక్షించలేక కొనఊపిరితో కొట్టుకాడుతున్న విజయారెడ్డి. అయ్యో! కుటుంభ సభ్యుందరికీ సొంత మనిషే కాలినట్లు కనిపిస్తుంది.
    
తల్లి, బార్య అన్న మాటలు తనకూ నిజమనిపించి ఎమ్మార్వోకి కంటికి కునుకుపడతలేదు. ఎప్పుడో తెల్లారంగా నిదుర పట్టింది. విజయారెడ్డి మీద పెట్రోల్‌ పోసిన సురేష్‌లా లింగయ్య కనపడుతున్నాడు. విలుయారెడ్డిలా తానే కాలుతున్నట్లు కల. తానే మండుతున్నట్లు బతుకాలనీ గింజుకున్నట్లు పానాలు ఆవిరైనట్లు ఒక పీడకల. పిడుగులాంటి కల.  
    
‘‘కాపాడండి. కాపాడండి. మంటా! మంటా! రక్షించండి. రక్షించండి. కాపాడండి. కాపాడండీ’’ అంటూ బెడ్‌దిగి నే పండిపొర్లుతున్నాడు. 
    
‘‘ఏమండీ! ఏమండీ! మీరు భయపడకండీ’’ అని ఎమ్మార్వో భార్య అరచి గీ పెట్టినా, ధైర్యం నూరిపోసినా వినిపించుకునే స్థితిలో ఎమ్మార్మో లేడు. 
    
‘‘కొడుకా! కొడుకా!’’ అని తల్లి అరిస్తే మాత్రం ఎమ్మార్వోకు వినపడుతలేదు. 
    
‘‘మంటా! మంటా!’’ అని అరుస్తుంటే తల్లి గద్దించింది. ‘‘మంటం ఏం లేదు బిడ్డా’’ అని అంటుండంగానే ఎమ్మార్వో మనసు స్థిమితపడ్డది. బాతురూంలోకెల్లి షవర్‌ కింద స్నానం చేస్తున్నపుడు ఈ పీడకల నిజమైతే ఎట్లా అనే ఆలోచను తిరుగుతున్నయి? 
    
ఎమ్మార్వో స్నానం చేసిండు. టర్కీ టవల్‌తో తదుపుకుంటూ ఇవతకీ వొచ్చిండు. తండ్రి చిత్రపటానికి దండం బెట్టిండు సోఫాలో కుర్చున్నపుడు ‘‘ఏం గాలే బిడ్డా! భయపడకు!’’ అని ఓదార్చుతున్న తల్లి ముందు చిన్నపిల్లాడిలా మారిపోయాడు.     
    
ఎమ్మార్వోకు ఇప్పుడు ‘రెండే దారులున్నాయి. ఒకటి అన్యాయం. రెండు న్యాయం. అన్యాయానికి సుఖం. న్యాయానికి కష్టం. అన్యాయం చేస్తే కాలవెట్టినట్లు, న్యాయం చేస్తే లింగయ్యలాంటి అభాగ్యుల్ని  కాల్లు  మొక్కినట్లు కల. ఈ ద్విముఖ పోటీలో తను మాత్రం కష్టాలెన్ని ఎదురైనా న్యాయం వైపే నిబడుతా తండ్రి ఫోటో మీద ప్రమాణం చేసి అట్లానే నడుచుకున్నట్లు ప్రమాణం చేసిండు.
    
బిడ్డా అని తల్లి పిలిచే వరకు     అందరి మనసులు దూది పింజల్ల తేలిపోయాయి. కాలం కొన్నిసార్లు గుణపాటం నేర్పదమంటే బహుశా ఇదే కావొచ్చు......

Follow Us:
Download App:
  • android
  • ios