దాశరథి పురస్కార గ్రహీత తిరుగునగరి కన్నుమూత

By telugu team  |  First Published Apr 26, 2021, 6:50 AM IST

ప్రముఖ కవి, దాశరథి పురస్కార గ్రహీత తిరునగరి కన్నుమూశారు. ఆయన ముప్పైకి పైగా రచనలు చేశారు. విశేషమైన పాండిత్యం ఆయన సొంతం. 


హైదరాబాద్: దాశరథి పురస్కార గ్రహీత, పండితుడు తిరుగునగరి కన్నుమూశారు. హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.  తిరునగరి యాదాద్రి జిల్లా రాజపేట మండలంలోని బేగంపేట గ్రామంలో జానకిరామక్క, శ్రీ మనోహర్ దంపతులకు 1945 సెప్టెంబర్ 24న జన్మించారు. 

ఉద్యోగ జీవితకాలంలో యాదాద్రి జిల్లా ఆలేరులో స్థిరపడ్డారు.. ప్రస్తుతం చింతల్ లోని గణేశ్ నగర్ లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. తిరునగరి జీవితం-సాహిత్యం అనే అంశం మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో పరిశోధనలు జరిగాయి.

Latest Videos

తిరునగరి ‘కొవ్వొత్తి, వసంతంకోసం, అక్షరధార, గుండెలోంచి, ముక్తకాలు, మాపల్లె, మనిషికోసం, వానా-వాడూ, ఈ భూమి, నీరాజనం, ప్రవాహిని, ఉషోగీత, జీవధార, ఒకింత మానవత కోసం, యాత్ర, కొత్తలోకం వైపు, కిటికీలోంచి, సముద్రమథనం కవితా సంపుటులను వెలువరించారు. 

Also Read: తెలంగాణా సాహిత్యకారులలో వజ్రోత్సవ కవి తిరునగరి

బాలవీర(శతకపద్యాలు), శృంగారనాయికలు(ఖండకావ్యం), తిరునగరీయం(చతుశ్శతి-4 పద్యసంపుటాలు) పద్యరచనలు వెలువరించారు. హిందీ, ఇంగ్లీష్ కవితలనెన్నింటినో అనువదించి తెలుగులోనికి తెచ్చారు. 
    
మూడు దశాబ్దాలపాటు తెలుగు భాషోపాధ్యాయుడుగా, తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. పాతికకు పైగా ప్రభుత్వ, ప్రభుత్వేతర పురస్కారాలందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యిచ్చే దాశరథి పురస్కారం-2020   గ్రహీత.

ముప్పైకి మించి సాహితీరచనలు చేశారు. సాహిత్యవ్యాసాలు వెయ్యికి ఎక్కువే వుంటాయి. గొప్ప గేయ రచయిత కూడా. తిరునగరి వందలాది లలిత, దేశభక్తి, ప్రబోధాత్మక గేయాలు రచించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఎన్నో పాటలు ప్రసారమయ్యాయి. వందలకొద్ది సాహిత్యసదస్సులలో, కవిసమ్మేళనాలలో ప్రధానవక్తగా ఆయన పాల్గొన్నారు.

click me!